Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లుకాకు, హజార్డ్ డబుల్ గోల్స్
- 2-5తో ట్యూనిషియా చిత్తు
- నాకౌట్‌కు చేరువైన బెల్జియం
బూమ్ బూమ్ బెల్జియం. టైటిల్ ఫేవరేట్లు తడబడుతున్న వేళ.. బెల్జియం మాత్రం భీకర ఫామ్‌లో దూసుకెళ్తోంది. వరుసగా రెండో మ్యాచ్‌లో మెరుపు విజయం సాధించి నాకౌట్‌కు చేరువైంది. రుమెలు లుకాకు, ఎడెన్ హజార్డ్లు డబుల్ గోల్స్ కొట్టిగా ట్యూనిషియాపై బెల్జియం 5-2తో ఘన విజయం సాధించింది. ట్యూనిషియా రెండు గోల్స్ సాధించినా.. బెల్జియం గోల్స్ వర్షంలో కొట్టుకుపోయింది.
నవతెలంగాణ-మాస్కో
జోరుమీదున్న బెల్జియం ఫిఫా ప్రపంచకప్‌లో మరో రికార్డు కొట్టేసింది. వరుసగా రెండో భారీ విజయం సొంతం చేసుకున్న బెల్జియం.. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో 5-2 విజయాన్ని సొంతం చేసుకున్నది. ఫిపా ప్రపంచకప్ చరిత్రలో ఇది కేవలం తొమ్మిదోసారి. ట్యూనిషియాపై ఏకంగా ఐదు గోల్స్ కొట్టిన బెల్జియం గ్రూప్-జి లో అగ్రస్థానం సొంతం చేసుకున్నది. బెల్జియం దూకుడుకు చిత్తుగా ఓడిన ట్యూనిషియా ప్రపంచకప్‌లలో వరుసగా 13వ మ్యాచ్‌లో విజయం లేకుండానే ముగించింది. బెల్జియం స్టార్స్ ఎడెన్ హజార్డ్, రుమెలు లుకాక్లు చెరో రెండు గోల్స్‌తో ట్యూనిషియాను ముంచెత్తారు. ఆఖరు క్షణాల్లో సబ్‌స్టిట్యూట్ మిచీ బెతస్యూహయి మరో గోల్‌తో బెల్జియం గోల్స్ సంఖ్యను ఐదుకు పెంచాడు. పనామాతో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ నెగ్గితే.. గ్రూప్-జి నుంచి ఇంగ్లాండ్, బెల్జియంలు నేరుగా నాకౌట్‌కు అర్హత సాధించనున్నాయి.
గోల్స్ ఉప్పెన! : టైటిల్ ఫేవరేట్ బెల్జియం వరుసగా రెండో మ్యాచ్‌లో సత్తా చాటింది. గోల్ ప్రయత్నాల్లోనే కాకుండా బంతి నియంత్రణలో, పాస్ కచ్చితత్వంలో తన మార్క్ చూపించింది. రుమెలు లుకాకు, ఎడెన్ హజార్డ్లు డబుల్ గోల్స్‌తో మెరిసిన వేళ.. బెల్జియం 5-2తో ఘన విజయం సాధించింది. ఆట ఆరంభమైన ఆరో నిమిషంలోనే బెల్జియంకు పెనాల్టీ లభించింది. ఎడెన్ హజార్డ్ పెనాల్టీని గోల్‌గా మలచటంతో బెల్జియం 1-0తో ఖాతా తెరిచింది. 16వ నిమిషంలో రుమెలు లుకాకు గోల్ కొట్టాడు. దీంతో ఆ జట్టు ఆధిక్యం 2-0కు పెరిగింది. కానీ మరో రెండు నిమిషాల్లోనే ట్యూనిషియాకు బ్రొన్ గోల్ కొట్టాడు. ట్యూనిషియా అంతరాన్ని తగ్గించాడు. ప్రథమార్థం ఇంజూరీ సమయంలో రుమెలు లుకాకు మరోమారు గోల్‌పోస్ట్‌పై దాడిచేశాడు. 51వ నిమిషంలో హజార్డ్ మళ్లీ మెరువగా బెల్జియం స్కోరు 4-1కు చేరుకున్నది. 90వ నిమిషంలో మరో గోల్ సాధించిన బెల్జియం తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నది. ఇంజూరీ సమయంలో కజ్రీ గోల్ కొట్టడంతో ట్యూనిషియాకు ఓదార్పు లభించింది.
బెల్జియం ట్యూనిషియా
05 గోల్స్ 02
23 గోల్ ప్రయత్నాలు 15
05 కార్నర్లు 02
03 ఆఫ్సైడ్లు 03
52 బంతి నియంత్రణ 48
83 పాస్ కచ్చితత్వం 82
00 ఎల్లో కార్డులు 01
12 ఫౌల్స్ 13