Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రష్యా ఫుట్‌బాల్ జట్టుకు 300 పైగా డోపింగ్ పరీక్షలు
మాస్కో : 2018 ఫిఫా ప్రపంచకప్‌లో వరల్డ్ నం. 65గా అడుగుపెట్టిన ఆతిథ్య రష్యా.. గత ఆరు మాసాలుగా ఒక్క విజయం కూడా సాధించలేదు. ఐనా సొంతగడ్డపై జరుగుతున్న సాకర్ సమరంలో రష్యా అద్భుత ప్రదర్శన చేసింది. వరుసగా తొలి రెండు గ్రూప్ మ్యాచుల్లో భారీ విజయాలతో నాకౌట్‌కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. సౌదీ అరేబియాను 5-0, ఈజిప్ట్‌ను 3-1తో ఓడించిన రష్యా గ్రూప్-ఏ నుంచి నాకౌట్ బెర్త్ ఖాయం చేసుకున్నది. రష్యా ఫుట్‌బాల్ జట్టు మెరుపు ప్రదర్శనతో ఫిఫా, యుఈఎఫ్ఏ సహా ఇతర డోపింగ్ ఏజెన్సీలు మరోలా ఆలోచించాయి. 2014 సోచి వింటర్ ఒలింపిక్స్ సందర్భంగా డోపింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న రష్యాపై ఇప్పుడు సైతం అదే కోణంలో కన్నేశాయి. ఫలితంగా, మైదానంలో కండ్లుచెదిరే విన్యాసాలతో గోల్స్ కొట్టిన ఫుట్‌బాల్ ప్లేయర్స్.. తర్వాత ల్యాబోరేటరీల్లో పరీక్షల కోసం వందల సార్లు రక్త, మూత్ర నమూనాలు ఇవ్వక తప్పలేదు!. ఈ విషయాన్ని రష్యా ఫుట్‌బాల్ జట్టు డాక్టర్ ఈడర్డ్ బెజులోవ్ వెల్లడించారు. తొలి రెండు మ్యాచుల్లో రష్యా ఫుట్‌బాల్ జట్టు వరుసగా 73, 71 మైళ్ల దూరాన్ని కవర్ చేసింది. దీంతో ఫిఫా 120 సార్లు, యుఈఎఫ్ఏ, రష్యా యాంటీ డోపింగ్ ఏజెన్సీలు 200కు పైగా పరీక్షలు నిర్వహించాయి. ఐతే ఈ అన్ని పరీక్షల్లోనూ రష్యా ఫుట్‌బాలర్లు కడిగిన ముత్యంలా బయటపడ్డారు. ఈ పరీక్షలను నిర్వహిచినట్టు, ఫలితాలపై ఫిఫా సహా యుఈఎఫ్ఏ అధికారులు అధికారికంగా వెల్లడించలేదు.