Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెల్జియంకు తప్పని భంగపాటు
- శామ్యూల్ ఉమ్టిటి గెలుపు గోల్
- 1-0తో ఫ్రాన్స్ ఫటాఫట్
- ఫిఫా ప్రపంచకప్ 2018
రిఫరీ తుది విజిల్ ఊదాడు. అంతే.. ఫ్రెంచ్ ఆటగాళ్లు, అభిమానులు 1998 పునరావృతం చేయాలనే ఉత్సాహంలో మునిగిపోయారు. అభిమాన కోలాహలంతో పారిస్ నగరం జనసంద్రంగా మారిపోగా.. సెయింట్ పీటర్స్బర్గ్ స్టేడియం ఆటగాళ్లు విజయ గర్వంతో ఊగిపోయింది. మాస్కో ఫైనల్లో మరోమారు ప్రపంచకప్‌ను అందుకోవాలని ఉత్కంఠ సెమీస్ విజయాన్ని ఆస్వాదించారు.
ఫ్రాన్స్ చరిత్ర సృష్టించింది. గత 20 ఏండ్లలో ముచ్చటగా మూడోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి ప్రవేశించింది. బంతి ప్రత్యర్థి నియంత్రణలో కొనసాగినా ఒత్తిడికి లోనవని ఫ్రెంచ్ శిబిరం.. అదను చూసి గోల్ కొట్టింది. బెల్జియం దూరేందుకు వీల్లేని రక్షణ గోడ కట్టేసి 1-0 విజయంతో తుది పోరుకు దూసుకెళ్లింది. 51వ నిమిషంలో శామ్యూల్ ఉమ్టిటి మెరుపు హెడర్ గోల్ ఫ్రాన్స్‌ను ఫైనల్లోకి తీసుకెళ్లగా.. అప్రతిహాత జైత్రయాత్రతో జోరుమీదున్న బెల్జియంకు
ఆ గోల్ భంగపాటు మిగిల్చింది.
బ్రెజిల్‌ను ఓడించిన జట్టు, ప్రీమియర్ లీగ్ స్టార్స్‌తో కూడిన శిబిరం. ఏ క్షణంలోనైనా ఎదురుదాడి చేయగల సత్తా, సామర్థ్యాలకు కొదవ లేదు. ఐనా ప్రపంచకప్ మెగా పోరులో మరోసారి రెడ్ డెవిల్స్‌కు భంగపాటు తప్పలేదు. తొలి అర్థ భాగంలో ఆధిపత్యం చెలాయించిన బెల్జియం తుదకు మూడో స్థానం పోటీకి పరిమితమైంది. గత రెండేండ్లలో బెల్జియం ఓడటం ఇదే తొలిసారి.
సెయింట్ పీటర్స్బర్గ్
సమవుజ్జీల సమరం. ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చు. ఇరు జట్లలోనూ మెరుపు దాడులు చేయగల సమర్థులకు కొదవ లేదు. అన్నింటికి మించి, ఇరు జట్ల గోల్ కీపర్లు అంత సులువుగా ప్రత్యర్థికి ఆధిక్యం ఇవ్వబోరు. అన్నింటికి మించి ఈ బెల్జియం 'స్వర్ణయుగపు ఆటగాళ్లతో' బరిలోకి దిగగా.. ఫ్రెంచ్ ఎప్పట్లాగే స్టార్ బృందంతో రంగంలోకి దూకింది. చరిత్రలో తొలిసారి ఫైనల్లోకి వెళ్లాలనే కసితో ఉన్న బెల్జియం బాగానే ఆడింది, కానీ గోల్ మాత్రం ఫ్రాన్స్ కొట్టేసింది. 1-0తో బెల్జియంను వెనక్కి నెట్టి ప్రపంచకప్ తొలి ఫైనల్స్ బెర్త్ సొంతం చేసుకున్నది. ద్వితీయార్థంలో గోల్ కొట్టిన ఫ్రాన్స్.. ఆధిక్యం నిలుపుకుని ఔరా అనిపించింది. 51వ నిమిషంలో ఆంటోని గ్రిజ్మన్ కార్నర్ కిక్‌ను గోల్ పోస్ట్ ముందు మొహరించిన శామ్యూల్ ఉమ్టిటి హెడర్‌తో గోల్‌గా మలిచాడు. అప్పటికే ప్రమాదం గుర్తెరిగి బెల్జియం గోల్ కీపర్ కోర్టియస్ అప్రమత్తంగా ఉన్నా ప్రయోజనం లేకపోయింది. ఫ్రాన్స్ 1-0 ఆధిక్యంతో పాటు మాస్కో ఫైనల్ బెర్త్ దక్కించుకున్నది. బంతి నియంత్రణలో, పాస్ కచ్చితత్వంలో ఫ్రాన్స్ కంటే ఎంతో మెరుగైన స్థితిలో నిలిచిన బెల్జియం.. గోల్ కొట్టడంలో మాత్రం ఫ్రెంచ్ కోటను బద్దలు కొట్టలేకపోయింది.
ప్రథమార్థం రెడ్ డెవిల్స్దే!
2016 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోని రికార్డు బెల్జియం సొంతం. ఈ ఏడాది ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటిన స్టార్స్ బెల్జియం బృందంలో కీలక ఆటగాళ్లు. ఎడెన్ హజార్డ్, రుమెలు లుకాకు, చాడ్లి, ఫెలాని, డీ బ్య్రూనె వంటి స్టార్ ఆటగాళ్లున్న బెల్జియం ఈ ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ కొట్టింది. ఫ్రాన్స్‌తో సెమీఫైనల్లో ప్రథమార్థం బెల్జియంకు అనుకూలంగానే సాగింది. అంచనాలకు తగినట్టే బెల్జియం భీకర దాడులు చేసింది. 19వ నిమిషంలో ఎడెన్ హజార్డ్ ఫ్రాన్స్‌ను భయపెట్టాడు. లెఫ్ట్ కార్నర్ నుంచి బంతితో దూసుకొచ్చిన హజార్డ్ గోల్‌పోస్ట్‌ను టార్గెట్ చేశాడు. కానీ ఫ్రెంచ్ డిఫెండర్ రఫెల్ వరానె జంప్ చేసి బంతిని పైకి నెట్టేశాడు. 31వ నిమిషంలో బెల్జియం నుంచి ఫ్రాన్స్‌కు మరో ప్రమాదం ఎదురైంది. రైట్ కార్నర్ కిక్‌ను బాక్స్ లోపల అందుకున్న టోబి అల్డర్వీరెల్డ్ పవర్ఫుల్ కిక్‌తో గోల్‌పోస్ట్‌ను టార్గెట్ చేశాడు. ఈసారీ ఫ్రెంచ్ గోల్ కీపర్ హ్యుగో లోరిస్ అడ్డుకున్నాడు. ప్రథమార్థంలో ఫ్రాన్స్ 34వ నిమిషంలో తొలిసారి గోల్‌పోస్ట్‌పై ప్రమాదకరంగా దండెత్తింది. బెంజిమన్ పవార్డ్ కుడి వైపు నుంచి క్లిష్టమైన కోణంలో బంతిని కిక్ చేశాడు. కానీ బెల్జియం గోల్ కీపర్ కోర్టియస్ కాలుతో సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ప్రథమార్థంలో పూర్తి ఆధిపత్యం చెలాయించినా గోల్ కొట్టడంలో బెల్జియం సఫలీకృతం కాలేదు.
ఉమ్టిటి తలతో కొట్టేశాడు
రెండో అర్థ భాగంలో ఫ్రాన్స్ దూకుడుగా ఎదురుదాడి మొదలు పెట్టింది. తొలుత ఒలివర్ గిరౌడ్ బాక్స్ లోపల స్ట్రయిట్ కిక్..మిస్ ఫైర్ అవగా.. క్షణాల వ్యవధిలోనే బెల్జియం గోల్‌పోస్ట్‌లోకి ఫ్రాన్స్ చొచ్చుకుపోయింది. 51వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను ఆంటోని గ్రిజ్మన్ కిక్ చేయగా.. డిఫెండర్ శామ్యూల్ ఉమ్టిటి బంతిని తలతో ఢకొీట్టి గమ్యాన్ని గోల్‌పోస్ట్ వైపు మార్చేశాడు. అంతే, ఉత్కంఠ సెమీఫైనల్లో తొలి గోల్ ఫ్రాన్స్ కొట్టేసింది. ద్వితీయార్థంలో 1-0 ఆధిక్యంతో గెలుపు దిశగా దూసుకెళ్లింది. కొద్దిసేపటికే ఫ్రాన్స్ తన ఆధిక్యాన్ని 2-0కు పెంచుకునేలా కనిపించింది. కిలియన్ ఎంబపె, పాల్ పొగ్బా మెరుపు పాస్‌లతో మరోమారు గోల్ ప్రయత్నం చేశాడు ఒలివర్ గిరౌడ్. కానీ డిఫెండర్‌కు తాకి బంతి మళ్లీ వెనక్కి వచ్చింది. ఫ్రాన్స్ మరోమారు ప్రయత్నించినా.. లక్షంపై గురి కుదరలేదు. ఈ రెండు సార్లు బెల్జియం గోల్ కీపర్ అద్భుత రీతిలో అడ్డుకున్నాడు. 80వ నిమిషంలో బెల్జియం మిడ్ ఫీల్డర్ జాన్ వర్టెంగెన్ గోల్ కొట్టినంత పని చేశాడు. సర్కిల్ బయట బంతి అందుకున్న వర్టెంగెన్ స్ట్రయిట్ కిక్‌తో మెరిశాడు, కానీ ఫ్రాన్స్ గోల్‌కీపర్ దాన్ని అడ్డుకున్నాడు. ఆఖరి నిమిషాల్లో టోబీ అల్డర్వీరల్డ్ మరో మెరుపు ప్రయత్నం చేశాడు. కానీ మళ్లీ లోరిస్ అవకాశం ఇవ్వలేదు. 90 నిమిషాల ఆట ముగిసినా బెల్జియం ప్రయత్నాలు ఫలించలేదు.
ఆరు నిమిషాల ఇంజూరీ సమయంలో బెల్జియం ప్రమాదకరంగా పరిణమిస్తుందని అనుకున్నా.. ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఫ్రాన్స్ విజృంభించింది. వేగంగా అవకాశాలు కల్పించుకునేందుకు ప్రయత్నించింది. ఆఖర్లో ఆంటోని గ్రిజ్మన్, కొరెంటెన్ టొలిస్సోలు దాదాపుగా గోల్ కొట్టేసినట్టే అనిపించారు!, కానీ కోర్టియస్ ఫ్రాన్స్ ఆధిక్యాన్ని 1-0కే పరిమితం చేశాడు. 51వ నిమిషంలో ఉమ్టిటి గోల్‌తో ఫైనల్లోకి ప్రవేశించిన ఫ్రాన్స్ ఆదివారం జరిగే బిగ్ ఫైట్‌లో ఇంగ్లాండ్ లేదా క్రోయేషియాతో కప్పు కోసం కోట్లాడనున్నది.
సెమీస్‌లో ఆడారిలా..
ఫ్రాన్స్ బెల్జియం
01 గోల్స్ 00
19 గోల్ ప్రయత్నాలు 09
05 టార్గెట్‌పై షాట్లు 03
01 ఆఫ్సైడ్లు 01
04 కార్నర్ కిక్‌లు 05
17 ఫ్రీ కిక్‌లు 07
40 % బంతి నియంత్రణ 60%
86 % పాస్ కచ్చితత్వం 90%
06 ఫౌల్స్ 16
02 ఎల్లో కార్డులు 03