Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వింబుల్డన్ ఫైనల్లో అమీతుమీకి సిద్ధం
- సెమీస్‌లో అలవోక విజయాలు
- వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్
లండన్ (ఇంగ్లాండ్)
టెన్నిస్ దిగ్గజం, అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ మరో గ్రాండ్‌స్లామ్ ముంగిట నిలిచింది. ప్రాణాంతక ఆరోగ్య సమస్యలతో అలుపెరుగని పోరాటం చేసిన అమెరికా యోధురాలు.. పునరాగమనంలో కేవలం 13వ మ్యాచ్‌లోనే వింబుల్డన్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఫ్రెంచ్ ఓపెన్ మధ్యలోనే గాయంతో నిష్క్రమించిన సెరెనా.. వింబుల్డన్‌లో ఇంత దాకా వస్తుందని ఊహించలేదు. కానీ స్ఫూర్తిదాయక విజయాలు సాధించిన విలియమ్స్ శనివారం జరిగే ఫైనల్లో జర్మనీ భామ ఎంజెలికా కెర్బర్తో అమీతుమీ తేల్చుకోనున్నది. గురువారం జరిగిన సెమీఫైనల్లో సెరెనా విలియమ్స్, ఎంజెలికా కెర్బర్లు అలవోక విజయాలు సాధించి మహిళల సింగిల్స్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి సెమీస్‌లో కెర్బర్ (11) 6-3, 6-3తో జెలినా ఒస్టాపెంకో (లాతివా)పై నెగ్గగా, రెండో సెమీస్‌లో మరో జర్మనీ అమ్మాయి జూలియా జార్జియస్పై 6-2, 6-4తో సెరెనా విలియమ్స్ మెరుపు విజయం సాధించింది. ఎంజెలికా కెర్బర్‌కు ఇది రెండో వింబుల్డన్ ఫైనల్ కాగా.. ఇప్పటికే 23 గ్రాండ్‌స్లామ్ సాధించిన సెరెనా శనివారం 24పై గురిపెట్టబోతుంది.
ఒస్టాపెంకో చేజేతులా.. : మాజీ వరల్డ్ నం.1 ఎంజెలికా కెర్బర్ సెమీఫైనల్లో ప్రత్యర్థి తప్పిదాలను సొమ్ముచేసుకుని చెమట చిందించకుండానే ఫైనల్స్‌కు చేరుకున్నది. 68 నిమిషాల పాటు సాగిన సెమీ సమరంలో కెర్బర్ పెద్దగా కష్టపడకుండానే ఒస్టాపెంకో ఆమె విజయాన్ని తేలిక చేసింది. తొలి సెట్లో 3-3తో సమవుజ్జీలుగా నిలిచిన సమయంలో ఒస్టాపెంకో దూకుడుగా ఎదురుదాడి చేసింది. ఈ ప్రయత్నంలో అనవసర తప్పిదాలు చేసిన ఒస్టాపెంకో వరుసగా పాయింట్లు పువ్వుల్లో పెట్టి కెర్బర్‌కు ఇచ్చేసింది. రెండో సెట్లో 5-1తో దూసుకెళ్లిన కెర్బర్.. ఆఖర్లో రెండు పాయింట్లు కోల్పోయినా 6-3తో ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నది. మెరుగ్గా ఆడినా ఒస్టాపెంకో దూకుడే ఆమెను ఫైనల్‌కు దూరం చేసింది!. మరో సెమీస్‌లో దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌కు ఎదురులేదు. జర్మనీ అమ్మాయి జూలియా జార్జియస్పై 6-2, 6-4తో అలవోక విజయం సాధించింది. కేవలం 70 నిమిషాల్లోనే సెరెనా ఫైనల్లో స్థానం ఖాయం చేసుకున్నది. ఇదిలా ఉండగా మెన్స్ సింగిల్స్‌లో స్విస్ యోధుడు రోజర్ ఫెడరర్‌కు చుక్కెదురైంది. క్వార్టర్స్‌లో సఫారీ ఆటగాడు కెవిన్ అండర్సన్ చేతిలో ఫెడరర్ కంగుతిన్నాడు. నొవాక్ జకోవిచ్, రఫెల్ నడాల్, జాన్ ఇస్నర్, అండర్సన్‌లు సెమీస్‌లో అడుగుపెట్టారు.