Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్, బెల్జియం ఢీ
సెయింట్ పీటర్స్బర్గ్ : ప్రపంచకప్‌లో అత్యంత క్లిష్టమైన మ్యాచ్ ఇదేనేమో!. ప్రపంచకప్ కలలు చెదిరి, గుండెల నిండా ఓటమి బాధలో ఉన్న ఇంగ్లాండ్, బెల్జియంలు నేడు మూడో స్థానం కోసం పోటీ పడుతున్నాయి. ఫైనల్లోకి చేరినట్టే అని స్వప్నించిన ఇంగ్లాండ్‌కు ఇది మరింత మింగుడు పడని తరుణం. అత్యుత్తమ ఆటగాళ్లతో రష్యాకు వచ్చిన రెడ్ డెవిల్స్ కథ కూడా ఇంతే. అయినా, రష్యా నుంచి ఓదార్పు విజయంతో వెళ్లేందుకు ఈ రెండు జట్లూ నేడు తలపడనున్నాయి.
ప్రపంచ కప్ లక్ష్యం దిశగా అడుగు దూరంలో నిలిచిపోయిన జట్లకు ఇది పెద్ద మ్యాచ్ కాకపోవచ్చు. కానీ కనీసం మూడో స్థానం సంతృప్తితోనైనా నిష్క్రమించాలనే ఆలోచన ఈ మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చే అవకాశం లేకపోలేదు. ఇంగ్లాండ్, బెల్జియంలు అత్యుత్తమ ఆటగాళ్లను బరిలోకి దింపకపోవచ్చు. దీంతో ఈ మ్యాచ్ నామమాత్రంగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది!. రుమెలు లుకాకు రష్యాలో ఆఖరి మెరుపుల కోసం తపిస్తే తప్ప నేడు బరిలోకి దిగే చాన్స్ లేదు. ఇంగ్లాండ్ శిబిరంలోనూ ఇదే సీన్. కెప్టెన్ హ్యారీకేన్ సహా కీలక ఆటగాళ్లు మైదానంలోకి దిగకపోవచ్చు. కానీ అర్థ శతాబ్దంలో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచేందుకు కాంస్యంతోనే స్వదేశానికి వెళ్లాలనే బలీయమైన కాంక్ష ఇంగ్లాండ్‌లో కనిపిస్తోంది. హ్యారీకేన్ సహా డిఫెండర్ జాన్ స్టోన్స్, హ్యారీ ముగురెలు ఇంగ్లాండ్‌కు కీలకం అవుతారు. బెల్జియం తరఫున రుమెలు లుకాకు, మిడ్ ఫీల్డర్ ఎడెన్ హజార్డ్ సహా కెవిన్ డీ బ్రూనెలు ప్రభావం చూపనున్నారు. అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన బెల్జియం మూడో స్థానం రేసులో ఫేవరేట్‌గా కనిపిస్తోన్నా.. నెగ్గాలనే తపన కొరవడిన పోరులో ఏం జరిగినా జరగొచ్చు!.