Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ నేడు
- తొలి టైటిల్ వేటలో క్రోయేషియా
- 1998 రిపీట్పై ఫ్రాన్స్ ఆశలు
టిక్.. టిక్.. సమయం వచ్చేసింది. మాస్కోలో అంతిమ సమరానికి సర్వం సిద్ధమైంది. ప్రపంచకప్ కల సాకారంలో కలల యాత్ర కొనసాగిస్తోన్న క్రోయేషియా ఓ వైపు, మరోమారు ప్రపంచకప్‌ను తాకాలనే సంకల్పంతో ఫ్రాన్స్ మరో వైపు. 2018 కప్పు ఎవరిదో తేల్చుకునేందుకు సమరానికి సిద్ధమయ్యాయి.
మాస్కో ఫైనల్లో ప్రతి క్షణం కప్పు కోసమే!, వేసే ప్రతి అడుగు కప్పు వైపే, కొట్టే ప్రతి షాట్ ఆ ట్రోఫీ కొసమే!. అందుకే, ప్రపంచం చూపంతా నేడు మాస్కో ఫైనల్‌పైనే. సంచలన జట్టు క్రోయేషియాతో స్టార్స్ టీమ్ ఫ్రాన్స్ అమీతుమీ తేల్చుకోనున్నది. గణాంకాలు, రికార్డులు ఫ్రాన్స్‌ను విజేత అంటుండగా.. సాకర్ ప్రపంచం మాత్రం క్రోయేషియా వైపే నిల్చున్నది! ఉత్కంఠ ఫైనల్లో చరిత్ర ఎవరు సృష్టిస్తారో, కప్పు ఎవరి చేతుల్లో పడుతుందో.. రెప్ప వాల్చకుండా చూడాల్సిందే!.
మాస్కో (లుజ్నికి స్టేడియం)
గ్రూప్ దశలో ఏం చేశాం, నాకౌట్లో ఎలా నెగ్గామనే గణాంకాలతో పని లేదు. టైటిల్ ఫేవరేట్, అండర్డాగ్ అనే తేడా అసలే లేదు. ఇప్పుడంతా 90 నిమిషాల్లో ఎవరు గోల్ కొడతారనే. ఇప్పటివరకూ ఏం చేసినా..ఈ గంటన్నరలో మెరువకుంటే జట్టులో ఎంత మంది స్టార్స్ ఉన్నా ఉపయోగం లేదు. ఇక్కడ గోల్ కొడితే అనామకుడైనా రాత్రి రాత్రికి గ్లోబల్ స్టార్ అయిపోతాడు. అంతటి ప్రత్యేకత, అంతకుమించి అంచనాలున్న ఫట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్లో క్రోయేషియా, ఫ్రాన్స్‌లు తలపడబోతున్నాయి. 47 లక్షల జనాభా ఉన్న దేశం ప్రపంచకప్ ఫైనల్లోకి చేరిందని అభిమానులు ఉప్పొంగిపోతున్న వేళ.. 20 ఏండ్ల తర్వాత మరోసారి కప్పు అందుకోవాలని ఫ్రెంచ్ జట్టు చూస్తోంది. 1998 ప్రపంచకప్‌లో క్రోయేషియాను ఓడించి ఫైనల్లోకి వెళ్లి కప్పు కొట్టిన ఫ్రాన్స్.. ఈసారి కప్పు కోసం ఆ జట్టునే ఢకొీంటుంది. అరంగేట్ర మెరుపుల తర్వాత మళ్లీ ఇప్పుడే అదరగొడుతున్న క్రోయేషియాలో 1998 సెమీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే తపన కంటే ప్రపంచకప్ సాధించాలనే స్వప్నమే బలంగా కనిస్తోంది. సంచలనాలతో మొదలై, సంచనాలతో కొనాగిన 2018 ప్రపంచకప్‌తో మళ్లీ సంచలనంతోనే ముగుస్తుందేమో చూద్దాం.
ఎంబపె వర్సెస్ మోద్రిచ్ : ప్రపంచకప్ ఫైనల్లో కిలియన్ ఎంబపె, లుకా మోద్రిచ్లలో ఎవరు మెరిస్తే వారిదే విజయమని చెప్పవచ్చు!. మిడ్ ఫీల్డ్ నుంచి బంతితో వేగంగా దూసుకొచ్చి దాడి చేయటంలో కిలియన్ దిట్ట. మెరుపు షాట్లు కొట్టడంతో పాటు కీలక పాస్‌లు అందించటంలో మోద్రిచ్ది నేర్పరి. క్రోయేషియాను అంతా తానై నడిపించిన మోద్రిచ్ నేటి ఫైనల్లోనూ కీలకం. అంత మాత్రాన అతడిని నిలువరిస్తే క్రోయేషియా పని అయిపోయిందని చెప్పడానికి వీల్లేదు. మంజుకిచ్, పెరిసిచ్లు అవకాశాలు కల్పించుకుని గోల్ కొట్టగల సమర్థులు. ఇదే సమయంలో ఫ్రాన్స్‌కు ఆంటోని గ్రిజ్మన్, బెంజమిన్ పవార్డ్లు ఉన్నారు. పీలె తర్వాత ప్రపంచకప్ ఫైనల్లో గోల్ కొట్టిన పిన్న వయస్కుడిని నేనే అంటూ ప్రకటించుకున్న ఎంబపెను నిలువరించటం క్రోయేషియా ముందున్న సవాల్. లియోనల్ మెస్సీ అంతటి ఆటగాడినే నిలువరించిన చరిత్ర క్రోయేషియాకు ఉన్నా.. అర్జెంటీనాలో మెస్సీకి ఉన్న సహకారం వేరు, ఇక్కడ ఎంబపెకు లభించే మద్దతు వేరు. ఈ విషయం క్రోయేషియాకు బాగా తెలుసు.
స్కిల్స్ వర్సెస్ ఫిట్నెస్ : విచిత్రమే ఐనా, ఈ ప్రపంచకప్ ఫైనల్లో నైపుణ్యం, ఫిట్నెస్లు పరస్పరం పోటీపడుతున్నాయి!. క్రోయేషియా కంటే మెరుగైన జట్లు నైపుణ్యముందనే గర్వంతోనే ఆ జట్టును తక్కువ చేశాయి. కానీ ప్రతి మ్యాచ్‌లో అదనపు సమయం లేదా పెనాల్టీ వరకూ పోరాడిన అలుపెరుగని జోరు క్రోయేషియాది. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో క్రోయేషిన్ల ఫిట్నెస్ ఏ విధంగా మేలు చేసిందో సాకర్ ప్రపంచం కళ్లారా చూసింది. ఫ్రాన్స్ ఇంత వరకూ 90 నిమిషాల ఆట తర్వాత దశకు వెళ్లలేదు. కానీ క్రోయేషియా ప్రతి మ్యాచ్‌లోనూ కఠోరంగా శ్రమించింది. అదనపు సమయంలోనూ అప్పుడే బరిలోకి దిగినట్టు శర్వశక్తూలు ఒడ్డి ఆడింది. ఫ్రాన్స్ శిబిరంలో గోల్స్ కొట్టగల ఆటగాళ్లకు కొదవ లేదు. మిడ్ ఫీల్డ్‌లో పాల్ పొగ్బా, కాంటె, మటుదిలతో బంతి నియంత్రణలో ఉంచుకోగలదు. డిఫెన్స్‌లో తిరుగులేదని బెల్జియంతో మ్యాచ్‌లో తేలిపోయింది. కానీ శారీరక సామర్థ్యంలో క్రోయేషియాతో ఫ్రాన్స్ నిలబడగలదా? అనే అనుమానం ఎక్కువగా వినిపిస్తోంది. అందుకే, ఆట 90 నిమిషాల్లో ముగిస్తే ఫ్రాన్స్‌ది, అదనపు సమయంలో ఐతే క్రోయేషియాది కప్పు అని చెప్పవచ్చు.
100 కోట్లు
మాస్కో ఫైనల్ పోరును ప్రపంచ వ్యాప్తంగా సుమారు 100 కోట్ల మంది వీక్షించనున్నారు.
3
ఫ్రాన్స్‌కు ఇది మూడో ఫైనల్. 1998 పారిస్ ఫైనల్లో నెగ్గగా, 2006లో ఇటలీకి తలొగ్గింది.
జట్లు (అంచనా)
ఫ్రాన్స్: హ్యుగో లోరిస్ (గోల్‌కీపర్), బెంజమిన్ పవార్డ్, రాఫెల్ వరానె, శామ్యూల్ ఉమ్టిటి, లుకాస్ హెర్నాండేజ్, పాల్ పొగ్బా, కాంటె, కిలియన్ ఎంబపె, ఆంటోని గ్రిజ్మన్, బ్లేస్ మటుది, ఒలివర్ గిరౌడ్.
క్రోయేషియా : డానిజెల్ సుబాసిచ్ (గోల్‌కీపర్), సిమె, డిజన్ లవ్రెన్, విదా, ఇవాన్ స్ట్రినిచ్, ఇవాన్ రాకిటిచ్, మార్సెలో బ్రొజోవిచ్, అంటె రెబిచ్, లుకా మోద్రిచ్, ఇవాన్ పెరిసిచ్, మరియో మంజుకిచ్.
13
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి అడుగుపెట్టిన 13వ భిన్న జట్టు క్రోయేషియా. ఇన్నేండ్లలో 12 జట్లు మాత్రమే (పునరావృతం) ఫైనల్లో ఆడాయి.
20
క్రోయేషియా ఫిఫా ర్యాంక్ 20. ఇంత తక్కువ ర్యాంక్‌తో ఫైనల్స్‌కు చేరిన తొలి జట్టు క్రోయేషియా.