Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ క్రీడా విభాగం
ఫిఫా ప్రపంచకప్.. ప్రతి సాకర్ క్రీడా కారుడు జీవిత కాలంలో ముద్దాడాలనే తపించే కలల కప్పు. చరిత్రలో ఎందరో దిగ్గజాలు సాధించిన కప్పు. మరెందరో దిగ్గజాలకు సైతం చిక్కని కప్పు. విజేతను విశ్వవ్యాప్తంగా హీరోను చేసే కప్పు అది. అందుకే ఆ కప్పు వేటలో దొరికిన ప్రతి అవకాశం అమూల్యమైనదే. అందుకే ప్రపంచకప్ ప్రయాణంలో ఎదురయ్యే ప్రయాస, ఒడిదొడుకులకు విలువెక్కువ!. ఎన్నో అవాంత రాలు ఎదుర్కొని నిలిస్తే సరిపోదు, కప్పు అందుకు నేందుకు అత్యుత్తమ ఆట తీరు, గోల్ కొట్టేందుకు కండ్లుచెదిరే నైపుణ్యం సైతం చూపించాలి. జట్టులో స్టార్ ఆటగాళ్లున్నారు, ప్రపంచకప్ అందుకోగల సమర్థులకు కొదవ లేదు. కానీ ప్రపంచకప్ సాధించాలంటే స్టార్ యిజం కాదు జట్టు తత్వం ఉండాలనే విషయం ఫ్రాన్స్‌కు తెలుసు. అందుకే ఆ జట్టు స్టార్ ఆటగాళ్ల సత్తాపై ఆధారపడకుండా, జట్టు ప్రదర్శనపై నమ్మకంతో ప్రపంచకప్‌ను అందుకోవాలని తపించింది. ఆ దిశలో విజయం సాధించింది.
20 ఏండ్లలో ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్ ఫైనల్లో ఆడిన ఫ్రాన్స్.. సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత రెండో ప్రపంచ కప్ విజయాన్ని సొంతం చేసుకున్నది. ఈ ప్రయాణంలో ఫ్రాన్స్‌ను విజేతగా నిలుపటంలో మూడు అంశాలు ప్రముఖ పాత్ర వహించాయి. వాటిలో మొదటిగా, నిలకడైన ధృడత్వం. టోర్నీలో ఫ్రాన్స్ గణాంకాలే ఆ విషయాన్ని చెబుతాయి. రష్యాలో ఫ్రాన్స్ ఏ మ్యాచ్‌లో 9 నిమిషాల కంటే ఎక్కువ సమయం ప్రత్యర్థి కంటే వెనుకంజలో ఉండలేదు. గోల్ కీపర్ హ్యూగో లోరిస్ ఫ్రాన్స్ గోల్ పోస్ట్‌పైకి దూసుకొచ్చిన చివరి ఏడు షాట్లను సమర్థవంతంగా నిలువరించాడు. మిడ్‌ఫీల్డ్‌లో ఎంగోలో కాంటె అత్యధికంగా 48 సార్లు బంతిని ప్రత్యర్థి నుంచి లాగేసుకున్నాడు. ఇవన్నీ.. ఫ్రాన్స్ ఆధిపత్యాన్ని, ఆటలో పైచేయి సాధించేందుకు ఉపయోగపడ్డాయి. ఈ గణాంకాలే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. ఫ్రాన్స్‌లో స్టార్ ఫార్వర్డులు ఉన్నారు. కానీ డిఫెన్స్, మిడ్ ఫీల్డ్‌లోనూ వారికి గొప్ప సహకారం లభించింది. జట్టును మరింత దృడంగా ఉంచేందుకు ఇది దోహదపడింది.
రెండోది, జట్టు తత్వం. ఫిఫా ప్రపంచకప్ ఎన్నడూ వ్యక్తిగత విన్యాసాలు, ప్రతిభకు పెద్ద పీట వేయలేదు. కానీ జట్టు తత్వానికి ఎనలేని గౌరవం ఇచ్చింది!. అందుకు లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలే ఉదహరణ. అందుకే స్టార్స్‌తో కూడిన ఫ్రాన్స్ తొలుత జట్టు స్ఫూర్తిని అలవరుచుకోవటం విజయంలో ప్రధాన భూమిక. ముందుగా ఆటలో.. గోల్ కొట్టడంలో ప్రతి ఒక్క ఆటగాడు తన వంతు పాత్ర నిర్వర్తించగలడు. నాకౌట్ దశలో ఫ్రాన్స్‌కు డిఫెండర్లు, మిడ్‌ఫీల్డర్లు, ఫార్వర్డ్‌ల నుంచి గోల్స్ నమోదయ్యాయి. సమష్టి విజయానికి సరైన నిర్వచనం ఇది. మరోక అంశం, మానవ సంబంధాలు. సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లు మైదానంలోకి వచ్చి గోల్ సంబురాలు పంచుకున్న దృశ్యం ఒక్క ఫ్రాన్స్‌లోనే చూశాం. ఎవరికి వారే స్టార్స్ అనే భావన నుంచి అంతా ఒక జట్టు అనే బలమైన బంధం ఏర్పరుచుకున్నారు. మూడో చాయిస్ గోల్ కీపర్ నుంచి అసిస్టెంట్ కోచ్ వరకూ అందరూ జట్టు మిషన్‌లో భాగమయ్యారు. ఫ్రాన్స్‌ను మరింత కాలం చాంపియన్‌గా నిలుపగల శక్తి ఈ జట్టు స్ఫూర్తికి ఉందనటంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక చివరగా మూడోది, వెంబడించిన చరిత్ర. 20 ఏండ్ల క్రితం తమ తొలి, ఏకైక వరల్డ్ కప్ అందుకున్నది. మరో ప్రపంచకప్ వేటలో ఆ జట్టుకు ఉన్న ఏకైక అడ్డంకి రెండు దశాబ్దాల క్రితం తమ చేతిలో దెబ్బతిన్న క్రోయేషియా. 1998 సెమీఫైనల్ ఓటమికి క్రోయేషియా ఇప్పటికీ ప్రతీకారం కోసం ఎదురుచూస్తోంది. ఇదే సమయంలో 2016 యుఈఎఫ్ఏ ఫైనల్లో పోర్చుగల్ చేతిలో ఓడిన ఫ్రాన్స్ ఇంకా ఆ పీడ కలను మర్చిపోలేదు. ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న జట్టుపైనే మళ్లీ నెగ్గి, యుఈఎఫ్ఏ ఓటమి గాయానికి శాశ్వత ఉపశమనం ఇవ్వాలనే ఆలోచన ఫ్రాన్స్‌ను బలంగా ప్రేరేపించింది. వ్యక్తిగత నైపుణ్యాలు, జట్టు స్ఫూర్తి ఫ్రాన్స్‌ను 20 ఏండ్లలో రెండోసారి ప్రపంచకప్ విజేతగా నిలిపింది. అంతిమంగా, అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన జట్టు చెంతకే ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ చేరిపోయింది.