Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీనివాస్ దాస్ మంతటి
చరిత్ర ఎప్పుడూ విజేతలతోనే నిండి ఉంటుంది!. ఫిఫా ప్రపంచకప్ అందుకు మినహాయింపు కాదు. 211 దేశాలు పోటీపడే అర్హత రౌండ్లో నెగ్గుకొచ్చి.. 32 దేశాలు తలపడే తుది సమరంలో నిలబడి.. కప్పు కోసం టైటిల్ పోరులో పోరాడినా నెగ్గితేనే గుర్తింపు. కప్పు కొడితేనే ప్రశంస. ప్రపంచమంతా విజేతనే చూస్తోంది, విజేతనే కీర్తిస్తోంది, విజేత గాథే వింటోంది. కానీ ఇప్పుడు పరాజితుల గాథ సైతం అత్యంత స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా ఫిఫా ప్రపంచకప్‌లో ఆడాలనే ఆలోచ నకు సైతం దూరంగా ఉన్న మనకు ఈ పరాజితుల గాథ ప్రేరేణ కావాలి. నిండా 50 లక్షల జనాభా కూడా లేని క్రోయేషియాకు ఈ ప్రస్థానం మరింత కఠినమే కానీ అసాధ్యం కాదు. ఆ జట్టు అదే నిరూపించింది. ప్రపంచకప్ నెగ్గాలంటే బలీయమైన లక్ష్యం, చెక్కుచెదరని ధైర్యం, కప్పు కోసం దేనికైనా సిద్ధమే అనే సంకల్పం. మాస్కో ఫైనల్లో క్రోయేషి యా కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. అండర్ డాగ్‌గా బరిలోకి దిగిన క్రోయేషియా.. ఫిఫా ప్రపంచకప్‌ను ముద్దాడకపోయినా.. అందుకునేందు కు తుది వరకూ చేసిన ప్రయత్నం అత్యంత స్ఫూర్తిదాయకం.
క్రోయేషియాపై ప్రపంచ క్రీడాభిమానులు ఇంత ప్రేమ చూపించడానికి వారిది చిన్న దేశమనే జాలి కాదు, పెద్ద జట్లకు బుద్ధి చెప్పిందనే ఆశ్చర్యంతో కూడిన సంతోషం ఎంత మాత్రం కాదు. నిజానికి 11 మందితో ఆడే ఫుట్‌బాల్‌కు దేశంలో ఎంత జనాభా ఉంటే ఏంటి? ఆడేందుకు సరైన సదుపాయాలు, ప్రపంచ స్థాయి శిక్షణ, శారీరక సామర్థ్యం కోసం ప్రమాణిక ఆహారం. 100 కోట్ల జనాభా ఉన్న దేశానికైనా, 50 లక్షల జనాభా ఉన్న దేశానికైనా ప్రపంచకప్ సాధించేందుకు ఇవి చాలు!. ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన బ్రెజిల్, జర్మనీ, బెల్జియం, అర్జెంటీనా, ఉరుగ్వేలతో కానిది క్రోయేషియాతో సాధ్యపడింది. అందుకు కారణం, ప్రపంచకప్ సాధించాలనే బలమైన సంకల్పం, ఆ దిశగా మెరుగైన ప్రణాళిక. లక్ష్యం దిశగా ఎన్ని అడ్డంకులు, ఆటుపోట్లు ఎదురైనా.. ముందుకే సాగే దృడమైన లక్షణం. ఏ దశలోనూ పోరాట స్ఫూర్తిని వీడువని ఉక్కు సంకల్పం, మేము కచ్చితంగా నెగ్గుతామనే బలీయమైన ఆత్మ విశ్వాసం ప్రపంచ అభిమానులు క్రోయేషియా ఫుట్‌బాల్ జట్టును ఆరాధించేందుకు కారణమయ్యాయి.
గ్రూప్ దశ దాటితే గొప్ప అనుకునే దశ నుంచి ప్రపంచకప్ ఫైనల్లో నిలిచిన క్రోయేషియా ప్రయాణంలో ప్రధానంగా మూడు అంశాలు కీలక పాత్ర పోషించాయి. చరిత్ర పుటల్లో తమ పేరును స్వర్ణాక్షరాలతో లిఖించేందుకు ఆ జట్టును ప్రేరేపించిన ఎక్స్ ఫ్యాక్టర్స్ ఇవి!. మొదటిది, ప్రపంచకప్‌కు ముందు క్రోయేషియా డ్రెస్సింగ్‌రూమ్‌లో స్నేహశీల వాతావరణం లేదు. ఎన్నడూ ప్రశాంతతకు చోటు లేని డ్రెస్సింగ్రూమ్గా ప్రసిద్ధి. తుది జట్టులోకి తీసుకోలేదని ఓ స్టార్ ఆటగాడు జట్టును వీడిన సంగతి అందరికీ తెలుసు. ఇక్కడే కోచ్ డాలిచ్ గొప్ప పాత్ర పోషించాడు. రష్యాలో ఉన్న 50 రోజుల్లో జట్టులోని ప్రతి ఆటగాడు మైదానంలో ఒకరి కోసం ఒకరు చచ్చేంత దృడమైన బంధం ఏర్పరుచుకున్నారు. కుటుంబంలా కలిసిపోయిన జట్టు నెగ్గాలనే సంకల్పంతో తపించింది. ఆ జట్టు ఆడిన మూడు వరుస మ్యాచులు అదనపు సమయానికి దారితీసినా.. వారు అలసి పోలేదు. పైగా సమయం సాగుతున్న కొద్ది క్రోయేషిన్లు మరింత చురుగ్గా కదిలారు. కచ్చితంగా గెలిచి తీరాలనే తపనకు ఇదే నిదర్శనం.
రెండోది, మానసిక ధృడత్వం.. జట్టు తత్వం. డెన్మార్క్, రష్యా, ఇంగ్లాండ్.. ఇవీ ఫైనల్స్‌కు ముందు వరుసగా క్రోయేషియా ఓడించిన జట్లు. ఈ మూడు మ్యాచులూ అదనపు సమయానికి దారితీశాయి. తొలి రెండు పెనాల్టీ షూటౌట్ వరకూ వెళ్లాయి. మ్యాచ్‌లో వెనుకంజ వేసినా, ప్రత్యర్థి ఆధిపత్యానికి చోటివ్వని జట్టు క్రోయేషియా. మ్యాచ్‌లో మానసికంగా ఎంత బలంగా ఉన్నారో, కదలికల్లో శారీరకంగా అంతే ధృడంగా నిలిచారు. ఇంగ్లాండ్‌పై నెగ్గిన తర్వాత కెప్టెన్ లూకా మోద్రిచ్ ఒక మాట అన్నాడు. ప్రత్యర్థికి మేమేంటో చూపించాం అని పలికాడు. తక్కువ చేసి చూసిన వారికి ఆటతోనే సమాధానం ఇవ్వటంతో వచ్చిన మాటలవి. ముఖ్యంగా క్రోయేషియాను జట్టుగా నిలపటంలో ఇది ప్రముఖ పాత్రే పోషించింది.
చివరగా మూడో అంశం. అనుభవం, ఆత్మ విశ్వాసం. లూకా మోద్రిచ్ క్రోయేషియాను ముందుండి నడిస్తున్న నాయకుడు. రియల్ మాడ్రిడ్ తరఫున నాలుగు చాంపియన్స్ లీగ్ టైటిళ్లు సాధించిన ఇతడి అనుభవం అమోఘం. ఇతడితో పాటు బార్సిలోనా, ఇంటర్ మిలాన్, లివర్‌పూల్, జువెంటస్ తరఫున ఆడిన ఆటగాళ్లు క్రోయేషియాలో ఉన్నారు. ఇవాన్ రాకిటిచ్, మరియో మంజుకిచ్, ఇవాన్ పెరిసిచ్, కొవాసిచ్, డిజెన్లు కీలకం. క్లబ్ సాకర్‌లో ఎప్పుడూ తుది జట్టులోనే ఉండే వీరు.. కీలక మ్యాచుల్లో ఏం చేయాలో, సామర్థ్యాలను ఏ విధంగా వినియోగించుకోవాలో తెలిసిన నేర్పరులు. మేం, ఏ జట్టు కంటే తక్కువ కాదనే ఆత్మ విశ్వాసం, కీలక మ్యాచుల్లో ఆడిన అనుభవం క్రోయేషియాను 2018 ప్రపంచకప్ విజేతగా నిలుపటంలో బహుముఖ పాత్ర వహించింది.
విజేతను అంచనా వేస్తూ ఏ ఆటలోనైనా సాధార ణంగా చెప్పే మాట.. ఓ జట్టు బలమైనదే కానీ క్రీడల్లో ఏదైనా జరగొచ్చు అని జోస్యం చెబుతారు. మాస్కో ఫైనల్లోనూ అదే జరిగింది. ఫ్రాన్స్ ఫేవరేట్, బలమైనది, గోల్స్ కొట్టగలదు కానీ ఫుట్‌బాల్‌లో ఏమైనా జరగొచ్చు అన్నారు. ఆ ఏమైనా జరగొచ్చు అనే గ్యాప్‌ను క్రోయేషియా పూర్తి చేయకపోవచ్చు. కానీ క్రోయేషియా ఫైనల్లోకి ప్రవేశించటమే ప్రపంచ కప్ నెగ్గటంతో సమానం!. ఫైనల్లోనూ తొలుత సెల్ఫ్‌గోల్ ఇచ్చుకున్నా, ఆధిక్యం కోల్పోయినా.. క్రోయేషియా మైదానంలో ఎక్కడా దూకుడు తగ్గించలేదు. ఆఖరు నిమిషం వరకూ పోరాడింది. ఆ పోరాట స్ఫూర్తికే ప్రపంచం ఆ జట్టుకు దాసోహం అయిపోయింది. ఇక నుంచి ఫిఫా ప్రపంచకప్ అనగానే ఫేవరేట్ల అడ్డా అనుకునే పరిస్థితిని క్రోయేషియా మార్చివేసింది. అద్భుత ప్రయాణంలో క్రోయేషియా ప్రపంచకప్ నెగ్గలేదు కానీ ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానుల హృదయాల్ని గెల్చుకున్నది.