Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వన్డే సిరీస్ నిర్ణయాక పోరు నేడు
- స్పిన్ అండతో ఫేవరేట్‌గా భారత్
- ప్రతీకార సిరీస్ విజయంపై ఇంగ్లాండ్ గురి
సా|| 5 నుంచి సోనీసిక్స్‌లో..
వరుసగా రెండో సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ వరకూ వచ్చింది. వరుసగా రెండో సిరీస్‌లో ఇంగ్లాండ్ పుంజుకుని ట్రోఫీ రేసులో నిలిచింది. వరుసగా రెండో సిరీస్ రెండో మ్యాచ్‌లో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ కుల్దీప్ యాదవ్‌ను నిలువరించారు. వరుసగా రెండో సిరీస్‌లో టీమ్ ఇండియా కప్పుపై కన్నేసింది. ఐదు టెస్టుల ప్రతిష్టాత్మక సిరీస్‌కు ముందు వన్డే సిరీస్ నెగ్గేందుకు ఇంగ్లాండ్, భారత్ తహతహ లాడుతున్నాయి. స్పిన్ అనుకూలతతో కోహ్లిసేన ఫేవరేట్‌గా కనిపిస్తోన్నా.. ఇంగ్లాండ్ ఏదైనా చేయగలదు!.
లీడ్స్ (ఇంగ్లాండ్)
ఇంగ్లాండ్ పర్యటనలో టీమ్ ఇండియా వరుసగా రెండో సిరీస్‌పై కన్నేసింది. మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో లార్డ్స్ వన్డేలో భారీ ఓటమి మూటగట్టుకున్న కోహ్లిసేన నేడు లీడ్స్‌లో వన్డే సిరీస్‌పై గురి పెట్టింది. మరోవైపు సొంతగడ్డపై ప్రపంచకప్‌లో హాట్ ఫేవరేట్‌గా దిగాలని ఆశిస్తోన్న ఇంగ్లాండ్‌కు ఇది విషమ పరీక్షే. ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్.. వన్డే సిరీస్‌నూ వదులుకునేందుకు సిద్ధంగా లేదు. పైగా వన్డే వరల్డ్‌కప్ ఫేవరేట్‌గా కొనసాగుతూ, సొంత గడ్డపై వన్డే సిరీస్ నెగ్గకుంటే అది కచ్చితంగా ఇంగ్లాండ్‌పై ఒత్తిడి పెంచుతుంది. విమర్శకులకు ఆ అవకాశం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదనే ధృడ నిశ్చయంతో మోర్గాన్ సేన కనిపిస్తోంది. ఆగస్టు 1 నుంచి ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్ ఆరంభం కాబోతున్న నేపథ్యంలో వన్డే సిరీస్ ఫలితం దానిపై ప్రభావం చూపించనున్నది. ఈ విజయంతో టెస్టుల్లో రెట్టించిన ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగాలని భారత్ భావిస్తోంది. అందుకు, ఇంగ్లాండ్ అంత సులువుగా తలొగ్గుతుందా? అనేది ఆసక్తికరం. నిర్ణయాత్మక మూడో వన్డే భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ఆరంభం కానున్నది.
మిడిల్ ఆర్డర్ బెంగ: ఇంగ్లాండ్‌లో భారత్ నెగ్గిన మూడు మ్యాచుల్లో (రెండు టీ20, ఒక వన్డే) టాప్ ఆర్డర్ మెరుపులే కనిపిస్తాయి. ఓడిన మ్యాచుల్లో మిడిల్ ఆర్డర్ వైఫల్యాలు కనిపిస్తున్నాయి. టీ20ల్లో వరుసగా రాహుల్, రోహిత్ చెలరేగగా.. తొలి వన్డేలో రోహిత్, కోహ్లి రాణించారు. మూడేండ్ల తర్వాత జట్టులోకి వచ్చిన సురేశ్ రైనా లార్డ్స్‌లో 48 పరుగులతో ఆకట్టుకున్నా.. మిడిల్ ఆర్డర్లో మెరుగైన ప్రదర్శన చేయలేదు. క్రీజులో స్వేచ్ఛగా కదలని రైనా.. జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడినా నిలిచినా అతడి స్థానం సుస్థిరం చేసుకునేందుకు అది సరిపోదు. ఇక ఎం.ఎస్ ధోని నెమ్మదైన ఇన్నింగ్స్‌పై భారత అభిమానులే మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో లీడ్స్‌లో మహి నుంచి బ్లాక్‌బస్లర్ షాట్లు వస్తాయేమో చూడాలి. టాప్ ఆర్డర్లో శిఖర్ ధావన్ మెరుపు ఆరంభాలతో జట్టుకు శుభారంభాల్ని ఇస్తోన్నా.. భారీ స్కోరు చేయలేదు. దీంతో లీడ్స్‌లో గబ్బర్ నుంచి మెగా ఇన్నింగ్స్ ఆశించొచ్చు. మరోమారు కీలక వన్డేలో కుల్దీప్ యాదవ్ స్థానంలో మరో స్పిన్నర్ (అక్షర్ పటేల్)ను తీసుకునే అవకాశం లేకపోలేదు. టీ20ల్లో కోహ్లి ఇదే చేశాడు. యుజ్వెంద్ర చాహల్ నుంచి స్థాయికి తగ్గ ప్రదర్శన రావాల్సి ఉంది. ఉమేశ్ యాదవ్‌కు తోడుగా షార్దుల్ ఠాకూర్ పేస్ బాధ్యతలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
బదులు తీర్చుకోవాలని.. : లీడ్స్ వన్డేకు ముందు ఇంగ్లాండ్‌కు అతి పెద్ద ఊరట స్టార్ బ్యాట్స్‌మన్ జో రూట్ ఫామ్‌లోకి రావటం. స్పిన్ ఫోబియో నుంచి బయటపడ్డ రూట్ లార్డ్స్‌లో స్ఫూర్తిదాయక శతకం సాధించాడు. అక్కడా కుల్దీప్ ప్రమాదకరంగా పరిణమించినా.. ఆరంభంలో అతడిపై ఆచితూచి ఆడి తర్వాత విరుచుకుపడ్డాడు. లోయర్ ఆర్డర్లో జోశ్ బట్లర్ సహా డెవిడ్ విల్లే జోరుమీదున్నారు. మిడిల్ ఆర్డర్లో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్ ఫామ్ సాధించారు. ఓపెనర్ జేసన్ రారు ఆడేది లేనిది అనుమానంగా ఉంది. బంతితోనూ మెరుగ్గా కనిపిస్తోన్న ఇంగ్లాండ్ లీడ్స్‌లో భారత్‌కు షాకిచ్చేందుకు ఎదురుచూస్తోంది. ఐతే ఇవన్నీ ఇంగ్లాండ్ స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటేనే లేదంటే మళ్లీ తొలి వన్డే ఫలితమే పునరావృతం అవుతుందనటంలో సందేహం లేదు.
బంతి తిరుగున్ : లార్డ్స్‌లో స్పిన్‌కు అనుకూలించినా, ఒక్కో ఇన్నింగ్స్‌కు ఒక్కోలా పిచ్ స్పందించింది. కానీ హీడింగ్లెలో బాగా ఎండకాస్తోంది. దీంతో నేటి మ్యాచ్‌లో ఇరు జట్ల స్పిన్నర్లు ఫోకస్‌లోకి వచ్చారు. నిరుడు ఇక్కడ దక్షిణాఫ్రికాతో ఆడిన వన్డేలో ఇంగ్లాండ్ 339/6 పరుగులు చేసింది. సహజంగానే లీడ్స్‌లో పరుగుల వరద పారుతుంది. పిచ్‌పై పచ్చిక పెద్దగా కనిపించటం లేదు. వికెట్ల వేటలో స్పిన్నర్లను ఊరిస్తోన్న పిచ్‌పై బంతి తిప్పినోళ్లదే సిరీస్ అని చెప్పవచ్చు!.
తుది జట్లు (అంచనా)
భారత్ : రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, సురేశ్ రైనా, ఎం.ఎస్ ధోని, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యుజ్వెంద్ర చాహల్, ఉమేశ్ యాదవ్.
ఇంగ్లాండ్ : జేసన్ రారు/జేమ్స్ విన్సె, జానీ బెయిరిస్టో, జో రూట్, ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్, జోశ్ బట్లర్, మోయిన్ అలీ, డెవిడ్ విల్లే, ఆదిల్ రషీద్, లియాం ఫ్లంకెట్, మార్క్ వుడ్.