Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీలంకపై భారీ శతకం
- రాణించిన లసిత్ మలింగ
- ఆసియా కప్
ఆసియా కప్ ఆరంభం మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బోణి చేసింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 137 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఛేదనలో శ్రీలంక 35.2 ఓవర్లలో 124 పరుగులకే కుప్పకూలింది.
దుబాయ్ : ఆసియా కప్‌కు అద్భుత ఆరంభం. పస లేని పోరు అనుకున్న వేళ, ఉత్కంఠతో కూడిన పోరాటం. ఆసియా కప్ ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ పోరు ఆకట్టుకునే రీతిలో సాగింది!. తొలుత వెటరన్ సీమర్ లసిత్ మలింగ వికెట్ల వేటతో బంగ్లాదేశ్ కుదేల్ కాగా, తర్వాత ముష్ఫీకర్ రహీం పరుగుల వేటతో లంక చిత్తయ్యింది. ముష్ఫీకర్ రహీం (144, 150 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెరీర్ అత్యధిక వన్డే స్కోరుతో చెలరేగగా తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 261 పరుగులు చేసింది. లసిత్ మలింగ (4/23) ధాటికి స్వల్ప స్కోరుకే పరిమితమయ్యే ప్రమాదంలో పడిన బంగ్లాదేశ్ గొప్పగా పుంజుకున్నది. ముష్ఫీకర్తో కలిసి మూడో వికెట్‌కు 132 పరుగుల భాగస్వామ్యం నిర్మించిన మహ్మద్ మిథున్ (63, 68 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 49.3 ఓవర్లలో ఆలౌటై 261 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటింగ్ చేయాల్సి ఉంది!.
మలింగ మ్యాజిక్ : చాలా విరామం తర్వాత జట్టులోకి వచ్చిన వెటరన్ సీమర్ లసిత్ మలింగ (4/23) బంగ్లాపై నిప్పులు చెరిగాడు. ఆరంభ ఓవర్లోనే రెండు వికెట్లు కూల్చిన మలింగ బంగ్లాదేశ్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. లిటన్ దాస్ (0), షకిబ్ అల్ హసన్ (0)లు మలింగ మ్యాజిక్కు డకౌట్‌గా నిష్క్రమించారు. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (2 నాటౌట్) మణికట్టు గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. దీంతో రెండు ఓవర్లలోనే బంగ్లా టాప్ ఆర్డర్‌ను కోల్పోయింది. ఈ తరుణంలో ముష్ఫీకర్ రహీం (144), మిథున్ (63) ఎంతో పరిణతి చూపించారు. లంక బౌలర్లు విజృంభిస్తున్న వేళ ఓపిగ్గా క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీ రన్‌రేట్ తగ్గకుండా చూసుకున్నది. మూడో వికెట్‌కు 132 పరుగులు జోడించిన ఈ జోడీని మళ్లీ మలింగానే విడదీశాడు. మిథున్‌ను వెనక్కి పంపి బంగ్లా జోరు తగ్గించాడు. మహ్మదుల్లా (1), మొసద్దిక్ హోస్సెన్ (1)లు వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయారు. దీంతో142/5తో బంగ్లా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
ముష్ఫీకర్ వీరంగం : సహచరులు ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు చేరుతుండగా లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అండతో ముష్ఫీకర్ గొప్ప పోరాటం చేశాడు. పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేసిన ముష్ఫీకర్ పరుగులు చేయటంతో పాటు వికెట్ కాపాడుకోవటంపైనా దృష్టి పెట్టాడు. ఎక్కువగా తనే స్ట్రయిక్ తీసుకుని స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. 123 బంతుల్లో సెంచరీ సాధించిన ముష్ఫీకర్ ఆ తర్వాత దూకుడు అందుకున్నాడు. నాలుగు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 229/9తో బంగ్లా ఇన్నింగ్స్ ముగిసినట్టే అనిపించింది. కానీ గాయపడిన తమీమ్ ఇక్బాల్ నొప్పితోనే మళ్లీ క్రీజులోకి వచ్చాడు. మరో ఎండ్‌లో ఇక్బాల్ అండతో ముష్ఫీకర్ వేగంగా 32 పరుగులు జోడించాడు. దీంతో బంగ్లాదేశ్ 261 పరుగులు చేయగల్గింది. శ్రీలంక బౌలర్లలో ధనంజయ డిసిల్వ (2/38), లక్మల్ (1/46)లు రాణించారు.