Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రికెట్ సూపర్‌స్టార్, యువ వెయిట్‌లిఫ్టర్‌కు అత్యున్నత క్రీడా పురస్కారం
- తెలుగు తేజం సిక్కి రెడ్డికి అర్జున
- ఖరారు చేసిన క్రీడా మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్ సూపర్ స్టార్, ఛేదనలో మొనగాడు విరాట్ కోహ్లికి భారత అత్యున్నత క్రీడా పురస్కారం దక్కింది. గతంలో వరుసగా రెండేండ్లు ఈ పురస్కారానికి నామినేట్ చేయబడినా దక్కనిది, ఇప్పుడు భారత క్రికెట్ సారథిని వరించింది. సచిన్ టెండూల్కర్ (1997), మహేంద్రసింగ్ ధోని (2007) తర్వాత రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అందుకోనున్న మూడో క్రికెటర్‌గా విరాట్ కోహ్లి నిలువనున్నాడు. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అవార్డుల కమిటీ సిఫారసులకు అమోదం తెలిపింది. భారత వెయిట్ లిఫ్టింగ్ యువ సంచలనం, టోక్యోలో పసిడి ఆశలు రేపుతోన్న మీరాబాయి చాను సైతం ఈ అత్యున్నత క్రీడా పురస్కారాన్ని అందుకోనున్నది. విరాట్ కోహ్లి, మీరాబాయి చానులకు ఖేల్‌రత్న అవార్డును గురువారం క్రీడా శాఖ ఖరారు చేసింది. అవార్డుల కమిటీ సిఫారసులతో ఈ వివరాలు బయటకు వచ్చినా, అధికారికంగా గురువారం అవార్డు విజేతలయ్యారు. తెలుగు తేజం, యువ బ్యాడ్మింటన్ కెరటం సిక్కి రెడ్డికి అర్జున అవార్డు దక్కింది. టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న సైతం అర్జున అందుకోనున్నాడు. ఆసియా క్రీడల్లో భారత పతాకధారి, పసిడి పతకాలు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు అర్జున దక్కింది. యువ స్ప్రింటర్ హిమ దాస్‌కు సైతం అర్జున అవార్డు ప్రకటించారు. ద్రోణాచార్య అవార్డుకు సిఫారసు చేయబడిన ఆర్చరీ కోచ్ జీవన్‌జోత్ సింగ్ తేజ పేరును క్రీడా శాఖ తొలగించింది. 2015లో సియోల్ (దక్షిణ కొరియా)లో జరిగిన ప్రపంచ యూని వర్శిటీ క్రీడల్లో క్రమశిక్షణ చర్యల కింద ఏడాది పాటు సస్పెండ్ చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఉత్తమ కోచ్‌లను వరించే ద్రోణాచార్య పురస్కారానికి అతడిని పేరును పరిగణనలోకి తీసుకోలేదు.
2018 క్రీడా పురస్కార విజేతలు
రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న: మీరాబాయి చాను (వెయిట్ లిఫ్టింగ్), విరాట్ కోహ్లి (క్రికెట్)
అర్జున అవార్డు : నీరజ్ చోప్రా, జిన్సన్ జాన్సన్, హిమ దాస్ (అథ్లెటిక్స్), ఎన్.సిక్కి రెడ్డి (బ్యాడ్మింటన్), సతీశ్ కుమార్ (బాక్సింగ్), స్మతీ మంధాన (క్రికెట్), శుభాంకర్ శర్మ (గోల్ఫ్), మన్‌ప్రీత్ సింగ్, సవిత (హాకీ), రవి రాథోర్ (పోలో), రహి సర్నోబత్, అంకుర్ మిట్టల్, శ్రేయాషి సింగ్ (షూటింగ్), మనిత బత్ర, జి. సతియన్ (టేబుల్ టెన్నిస్), రోహన్ బోపన్న (టెన్నిస్), సుమిత్ (రెజ్లింగ్), పూజ (వుషూ), దామ (పారా అథ్లెటిక్స్), మనోజ్ సర్కార్ (పారా బ్యాడ్మింటన్).
ద్రోణాచార్య అవార్డు: సి.ఎ కట్టప్ప (బాక్సింగ్), విజరు శర్మ (వెయిట్ లిఫ్టింగ్), ఏ శ్రీనివాస రావు (టేబుల్ టెన్నిస్), సుఖ్‌దేవ్ సింగ్ పన్ను (అథ్లెటిక్స్), క్లారెన్స్ లొబొ (హాకీ, జీవినకాల సాఫల్యం), తారక్ సిన్హా (క్రికెట్, జీవనకాల సాఫల్యం), జీవన్ కుమార్ శర్మ (జూడో, జీవనకాల సాఫల్యం), వీఆర్ బీడూ (అథ్లెటిక్స్, జీవనకాల సాఫల్యం).
ధ్యాన్‌చంద్ అవార్డు : సత్యదేవ్ ప్రసాద్ (ఆర్చరీ), భరత్ కుమార్ (హాకీ), బాబీ అలియోసిస్ (అథ్లెటిక్స్), దత్తాత్రేయ (రెజ్లింగ్).