Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరంగేట్రంలోనే చితకబాదిన పృథ్వీ షా
- పుజారా, కోహ్లి అర్థ సెంచరీలు
- విండీస్‌తో తొలి టెస్టు తొలి రోజు
స్కూల్ క్రికెట్ సంచలనం. దేశవాళీ క్రికెట్ యువ కెరటం. ఇప్పుడు భారత క్రికెట్ ఆశా కిరణం!. దులీప్ ట్రోఫీ, రంజీ ట్రోఫీల్లో అరంగేట్ర మ్యాచుల్లోనే సెంచరీలతో చెలరేగిన యువ స్టార్ పృథ్వీ షా, అదే ట్రెండ్ భారత క్రికెట్లోనూ కొనసాగించాడు. రాజ్‌కోట్‌లో కరీబియన్ బౌలర్లపై తన ట్రేడ్ మార్క్ బ్యాక్ ఫుట్ షాట్లతో విరుచుకుపడి 99 బంతుల్లోనే కెరీర్ తొలి శతకం సాధించాడు. పిన్న వయసులోనే అరంగేట్ర మ్యాచ్‌లోనే మూడెంకల పరుగులు తీసిన పృథ్వీ షా రాజ్‌కోట్ టెస్టులో తొలి రోజు ప్రత్యేకంగా నిలిచాడు. అరంగేట్ర టెస్టులో సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడైన భారత ఆటగాడి నిలిచాడు. పృథ్వీ షా (134, 154 బంతుల్లో 19 ఫోర్లు) శతక జోరుకు పుజారా (86), కోహ్లి (72 నాటౌట్) తోడవటంతో భారత్ 364/4తో భారీ స్కోరుకు బాటలు వేసుకున్నది.
రాజ్‌కోట్ : 2018 ఆరంభం నుంచీ క్రికెట్ వరల్డ్‌లో అద్భుథాలు చేస్తూనే ఉన్న యువ క్రికెటర్ పృథ్వీ షా. ఏడాది ఆరంభంలో అండర్-19 ప్రపంచకప్ విజయం అందుకున్న పృథ్వీ షా, తర్వాత దేశవాళీలో సెంచరీల మోత మోగించాడు. భారత్-ఏ తరఫున ఇంగ్లాండ్ పర్యటనలోనూ అత్యధిక పరుగులు బాది భారత జటు ్టలోకి వచ్చాడు. ఇప్పుడు అరంగేట్ర మ్యాచ్‌లోనే చితక బాదిన పిన్న వయస్కుడైన భారత క్రికెటర్‌గా నిలిచాడు. రాజ్‌కోట్ టెస్టులో 99 బంతుల్లోనే 100 పరుగులు చేసిన పృథ్వీ షా కెరీర్ తొలి సెంచరీ కొట్టాడు. చతేశ్వర్ పుజారా (86, 130 బంతుల్లో 14 ఫోర్లు), విరాట్ కోహ్లి (72 నాటౌట్, 137 బంతుల్లో 4 ఫోర్లు) అర్ధ సెంచరీలతో కదం తొక్కారు. అజింక్య రహానె (41, 92 బంతుల్లో 5 ఫోర్లు) రాణించాడు. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచు కున్న భారత్ తొలి రోజు 89 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. మూడు సెషన్లలోనూ పరుగుల వరద పారించిన భారత బ్యాట్స్‌మన్ కరీబియన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కెప్టెన్ కోహ్లి, రిషబ్ పంత్ (17) అజేయంగా క్రీజులో ఉన్నారు.
కెఎల్ రాహుల్ విఫలం : మ్యాచ్‌కు ముందు రోజే అరంగేట్రం ఖాయం చేసుకున్న పృథ్వీ షా, టెస్టు కెరీర్‌ను అంచనాలకు అనుగుణంగా ఆరంభించాడు. రాహుల్ ద్రవిడ్ శిక్షణలో ఎదిగిన పృథ్వీ టెస్టుల్లో మేటి ఆటగాడు కాగలడనే అంచనాలను రాజ్‌కోట్‌లో నిజం చేసే ప్రయత్నంలో సఫలమయ్యాడు. తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌కు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ. ఫామ్‌లో ఉన్న కెఎల్ రాహుల్ (0)ను గాబ్రియనల్ ఇన్‌స్వింగర్‌తో సాగనంపాడు. లొపలికి దూసుకొచ్చే బంతులతో ఇబ్బంది పడుతున్న రాహుల్ బలహీనతను గాబ్రియల్ సొమ్ముచేసుకున్నాడు. దీంతో తొలి ఓవర్లోనే భారత్ తొలి వికెట్ కోల్పోయింది.
షా.. షా.. పృథ్వీ షా : టెస్టు క్రికెట్లో తొలి బంతిని వదిలేసిన షా, తనకు ఇష్టమైన బ్యాక్ ఫుట్ షాట్‌తోనే తొలి పరుగు తీశాడు. వార్మప్ మ్యాచ్‌లో షాను స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన విండీస్, రాజ్‌కోట్‌లో అతడిని కట్టడి చేసేందుకు నానా తంటాలు పడింది. 134 పరుగుల్లో అత్యధిక శాతం పృథ్వీ షా బ్యాక్ ఫుట్ షాట్ల ద్వారానే పిండుకున్నాడు. ఐదు రోజుల ఆటలో బౌలర్లకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే, దూకుడుగా ఆడకుండానే 100 ప్లస్ స్ట్రయిక్‌రేట్‌తో శతకం సాధించటం షా ప్రత్యేకతను చాటింది. ఏడు ఫోర్లతో 56 బంతుల్లో తొలి అర్ధ సెంచరీ అందుకున్న పృథ్వీ షా, తర్వాత మరింత వేగంగా ఆడాడు. కచ్చితమైన షాట్లతో చెలరేగి 99 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. షా శతకంతో డ్రెస్సింగ్‌రూమ్ ఆనందంతో చప్పట్లు కొట్టడం తొలి రోజు ఆటలో హైలైట్!. పుజారాతో కలిసి రెండో వికెట్‌కు 206 పరుగులు జోడించిన షా.. బిషు బంతితో వికెట్ పారేసుకున్నాడు. స్పిన్నర్ బిషు రిటర్న్ క్యాచ్‌తో షా అద్భుత ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. పుజారాతో భాగస్వామ్యంలో పృథ్వీ షా పరుగులే ఎక్కువ. షా 124 బంతుల్లో 113 పరుగులు చేయగా, పుజారా 130 బంతుల్లో 86 పరుగులు చేశాడు.
రాణించిన పుజారా, కోహ్లి : లోకల్ బారు చతేశ్వర్ పుజారా (86) సొంతగడ్డపై అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అధిక ఉష్ణోగ్రతలతో జేబులో ఓ చిన్న నీటి సీసాతో క్రీజులోకి వచ్చిన పుజారా అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. విండీస్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న పుజారా సెంచరీకి 14 పరుగుల దూరంలో వికెట్ కోల్పోయాడు. ఆసియా కప్‌కు విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లి, రాజ్‌కోట్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో ఫామ్ కొనసాగించాడు. పుజారా, పృథ్వీ షా వేసిన బలమైన పునాదిని భారీ స్కోరు దిశగా తీసుకెళ్లాడు. అజింక్య రహానె (41)తో కలిసి 106 పరుగులు జోడించిన కోహ్లి అర్ధ సెంచరీ తర్వాత దూకుడు పెంచాడు. ఆరంభంలో స్పిన్‌తో ఇబ్బంది పడిన రహానె నెమ్మదిగా కుదురుకున్నాడు. కానీ అర్ధ సెంచరీ చేరువలో వికెట్ కోల్పోయాడు. రిషబ్ పంత్ (17 నాటౌట్, 21 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ఓ ఫోర్, సిక్సర్‌తో ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్ బౌలర్లలో బిషు, గాబ్రియల్, ఛేజ్, లెవిస్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్ : పృథ్వీ షా (సి,బి) బిషు 134, కెఎల్ రాహుల్ (ఎల్బీ) గాబ్రియల్ 0, చతేశ్వర్ పుజారా (సి) డావ్రిచ్ (బి) లెవిస్ 86, విరాట్ కోహ్లి బ్యాటింగ్ 72, అజింక్య రహానె (సి) డావ్రిచ్ (బి) ఛేజ్ 41, రిషబ్ పంత్ బ్యాటింగ్ 17, ఎక్స్‌ట్రాలు : 14, మొత్తం :(89 ఓవర్లలో 4 వికెట్లకు) 364.
వికెట్ల పతనం : 1-3, 2-209, 3-232, 4-337.
బౌలింగ్ : గాబ్రియల్ 18-1-66-1, పాల్ 10-1-41-0, లెవిస్ 12-0-56-1, బిషు 30-1-113-1, ఛేజ్ 16-0-67-1, బ్రాత్‌వైట్ 3-0-11-0.