Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యమగూచితో తెలుగు తేజం పోరు
- సమీర్ వర్మకు జపాన్ సవాల్
- వరల్డ్ టూర్ ఫైనల్స్ 2018
- ఉ|| 11 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
భారత బ్యాడ్మింటన్‌ను శిఖర స్థాయికి తీసుకెళ్లిన సైనా నెహ్వాల్ 2011లో ప్రయత్నించింది. వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టైటిల్ మాత్రం తీసుకురాలేదు. ఒకే ఏడాదిలో నాలుగు సూపర్ సరీస్‌లు నెగ్గిన వేటగాడు కిదాంబి శ్రీకాంత్ సైతం అందుకునే యత్నం చేశాడు. కానీ వరల్డ్ ఫైనల్స్ అందలేదు.
క్రికెటేతర స్టార్‌గా ఎదిగిన పి.వి సింధు వరుసగా రెండు సార్లు ప్రయత్నించింది. 2016లో సెమీస్‌కు, 2017లో ఫైనల్స్‌కు చేరింది. అయినా, వరల్డ్ టైటిల్ అందలేదు. ముచ్చటగా మూడోసారి సింధు మళ్లీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌పై కన్నేసింది. ప్రతిష్టాత్మక బీడ్ల్యూఎఫ్ టైటిల్‌ను సొంతం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది!. చైనాలోని గాంగ్జౌ నగరంలో నేటి నుంచే ప్రపంచ టూర్ ఫైనల్స్ ఆరంభం.
గాంగ్జౌ (చైనా) : తెలుగు తేజం పి.వి సింధు సీజన్‌ను ఘనంగా ముగించే పనిలో నిమగమైంది. ఈ ఏడాది సింధు మెగా ఈవెంట్లలో మెరిసినా, బీడ్ల్యూఎఫ్ సర్క్యూట్లో టైటిల్ నెగ్గలేదు. కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు సహా ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో సింధు వరుసగా రజత పతకాలు సాధించింది. ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్ కోసం కొంత విరామం తీసుకున్న సింధు.. పునరుత్తేజంతో షటిల్ కోర్టులోకి వచ్చేస్తోంది. ప్రపంచ టైటిల్ వేటలో కఠిన డ్రా ఎదురైనా.. ప్రతి ప్రత్యర్థి కోసం ప్రత్యేకంగా సిద్ధమైన సింధు ఈ సారి ఎలాగైనా వరల్డ్ టూర్ టైటిల్ పట్టేయాలనే పట్టుదలతో కనిపిస్తోంది.
అకానెతో ఆరంభ పోరు : అత్యుత్తుమ ఎనిమిది మంది షట్లర్లు పాల్గొనే వరల్డ్ టూర్ ఫైనల్లో సింధుకు కఠిన డ్రా ఎదురైంది. వరల్డ్ నం.1 తైజు యింగ్, డిఫెండింగ్ చాంపియన్ అకానె యమగూచి (జపాన్) సహా అమెరికా సంచలనం బీవెన్ జాంగ్‌లతో కూడిన గ్రూప్‌లో సింధు చోటుచేసుకున్నది. గ్రూప్-ఎలో జరిగే తొలి మ్యాచ్‌లో సింధు, యమగూచిలు నేడు తలపడనున్నారు. సూపర్ సిరీస్ టోర్నీల్లో తిరుగులేని ప్రదర్శనలతో మహిళల సింగిల్స్‌లో యమగూచి ప్రమాదకర షట్లర్‌గా తయారైంది. నిజానికి గత సీజన్లో యమగూచిపై సింధు 8-0తో తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. గతేడాది నుంచి సమీకరణాలు మారిపోయాయి. సింధు, యమగూచిలు ఐదు మ్యాచుల్లో తలపడగా నాలుగింట జపాన్ భామ విజయం సాధించింది. ఇటీవల తాజా ఫామ్ సింధును కలవర పాటుకు గురిచేస్తోంది. సింధు ఎత్తును వ్యూహంలో చేర్చిన అకానె.. ర్యాలీలలో తరచుగా సింధు కిందకు వంగి ఆడేలా చేస్తోంది. ఎత్తును బలంగా మార్చుకుని సింధు ఇన్నాండ్లూ పవర్ఫుల్ స్మాష్‌లతో ప్రత్యర్థులపై విరుచుకుపడగా.. అకానె కొత్త దారిలో వచ్చి తంటాలు పెడుతోంది!. నేడు సింధు, యమగూచి మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టు సాగనున్నది. ఇద్దరూ మంచి ఫామ్‌లో ఉండటంతో రసవత్తర సమరానికి తెరలేవనున్నది. రెండు వారాల పాటు కఠోర సాధన చేసిన సింధు.. గాంగ్జౌలో గెలుపు ఢంకా మోగించాలని ఉవ్విళ్లూరుతోంది. సింధు, యమగూచి ఆరంభ మూడు గేములకు దారితీయటం ఖాయమని నిపుణుల అంచనా. గ్రూప్ దశను దాటి సెమీఫైనల్స్‌కు చేరాలంటే కచ్చితంగా రెండు విజయాలు సాధించాలి. యమగూచి, తైజు యింగ్, బీవెన్ జాంగ్‌లు ముగ్గురూ సింధుపై ఇటీవల పైచేయి సాధించిన వారు కావటం గ్రూప్ మ్యాచులపై మరింత ఉత్కంఠ రేగేందుకు ఆస్కారమిస్తోంది. మరో వైపు పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ నేడు తొలి మ్యాచ్‌లో జపాన్ స్టార్ కెంటా మెమోటను ఎదుర్కొనున్నాడు. తాజా టోర్నీల్లో కిదాంబి శ్రీకాంత్‌పై వరుస విజయాలు సాధిస్తూ, భారత స్టార్‌ను ఇబ్బందికి గురిచేస్తోన్న షట్లర్లలో కెంటో ముందున్నాడు. ఫామ్ కోల్పోయి శ్రీకాంత్ ఈ టోర్నీకి దూరమైనా.. మెన్స్ సింగిల్స్‌లో సమీర్ వర్మ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. నిజానికి గ్రూప్‌లో సమీర్ సింధు వరల్డ్ వేట!