Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓడితే సిరీస్ ఆశలు ఆవిరి
- ఒత్తిడిలో కోహ్లిసేన
- నేడు ఆసీస్‌తో రెండో వన్డే పోరు
- ఉదయం 8.50 నుంచి సోనీసిక్స్‌లో..
ఆడిలైడ్ (ఆస్ట్రేలియా)
సిడ్నీలో ఫేవరేట్‌గా కనిపించినా, షాక్ తగిలింది. కొత్త జట్టుతో ఆతిథ్య శిబిరం ఉత్సాహంలో ఉండగా, ఆడిలైడ్ వన్డేకు ముందు కోహ్లిసేన ఒత్తిడిలో పడింది. చారిత్రక సిరీస్ విజయం సాధించిన తర్వాత, ఇక్కడ ఓడితే వన్డే సిరీస్‌పై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. జట్టు సమతుల్యం దెబ్బతినటం సహా కీలక ఆటగాళ్ల ఫామ్ సమస్యలు ఎదుర్కొంటున్న టీమ్ ఇండియా నేడు నెగ్గి లెక్క సరి చేయాలని చూస్తోంది. భారత్, ఆస్ట్రేలియా రెండో వన్డే సమరం నేడు.
సిడ్నీలో ఆస్ట్రేలియా అద్భుత ప్రదర్శన ఎవ్వరూ ఊహించనిది!. స్మిత్, వార్నర్ జట్టును వీడిన తర్వాత ఆడిన కేవలం మూడు వన్డేల్లోనే గెలిచిన ఆస్ట్రేలియా, నిజానికి సిడ్నీలో గొప్ప ప్రదర్శన చేసింది. అన్ని విభాగాల్లో కోహ్లిసేనపై పైచేయి సాధించింది. ఆస్ట్రేలియా డ్రెస్సింగ్‌రూమ్ సహా విశ్లేషకులు సైతం ఊహించని ప్రదర్శన అది. టీ20 సిరీస్ సమం చేసుకొని, తొలిసారి టెస్టు సిరీస్ నెగ్గిన కోహ్లిసేనను.. ఓడితే వన్డే సిరీస్ వదులుకోవాల్సిన స్థితికి తీసుకొచ్చిన ఘనత కచ్చితంగా కంగారూలకు దక్కుతుంది. అయితే, ఆతిథ్య జట్టు ఆనందానికి ఆడిలైడ్‌లో చెక్ పెట్టేందుకు కోహ్లిసేన సిద్ధమైనట్టే కనిపిస్తోంది. జట్టు సమతూకంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా, నేడు ఆడిలైడ్‌లో విజయానికి రంగం సిద్ధం చేసుకుంటోంది.
అతడి ఫామ్ ఆందోళన : సిడ్నీలో ధావన్, కోహ్లి, రాయుడు విఫలమైనా రోహిత్ శర్మ చివరి వరకూ పోరాడాడు. అతడికి ఎం.ఎస్ ధోని సహకరించాడు. మహి అర్ధ సెంచరీ చేసినా, బంతులను వృథా చేయటంతో ఆఖర్లో సాధించాల్సిన రన్‌రేట్ భారీగా పెరిగిపోయింది. ఇది లోయర్ ఆర్డర్‌పై మరింత ఒత్తిడికి కారణమైంది. దీంతో మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడే సత్తా కోల్పోయాడని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆడిలైడ్‌లో మరోసారి ధోని ప్రదర్శనపై ఆసక్తి నెలకొన్నది. ధనాధన్ ఆటతో విమర్శలకు అతడు సమాధానం చెబుతాడేమో చూడాలి. గడిచిన ఏడాదిన్నర కాలంలో భారత టాప్-3 వైఫల్యం చెందటం సిడ్నీలో ప్రథమం!. ఆసీస్ కొత్త సీమర్లకు బదులు చెప్పేందుకు గబ్బర్, కోహ్లి, రాయుడు నేడు సిద్ధమవుతున్నారు. సిడ్నీలో స్వల్ప స్కోర్లకే పరిమితమైన ఈ త్రయం ఆడిలైడ్‌లో అదరగొట్టాలని ఎదురుచూస్తున్నారు. ఇక హార్దిక్ పాండ్య లేకపోవటంతో జట్టు సమతుల్యం దెబ్బతిన్నది. కేదార్ జాదవ్ తుది జట్టులో లేకపోవటం మరింత బెడిసి కొట్టింది. దినేశ్ కార్తీక్ స్థానంలో జాదవ్ తిరిగి తుది జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. జడేజా, కుల్దీప్లతో కలిసి జాదవ్ స్పిన్ బాధ్యతలు పంచుకోవటం లాంఛనమే. పేస్ విభాగంలో భువనేశ్వర్ కుమార్ మునుపటి ఫామ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. మహ్మద్ షమి జోరు మీదున్నాడు. సిడ్నీలో ఖలీల్ అహ్మద్ కాస్త ఇబ్బంది పడ్డాడు. అయినా, అతడికి మరో అవకాశం ఇవ్వటానికే కోహ్లి మొగ్గుచూపుతున్నాడు.
సిరీస్ కొట్టాలని.. : స్మిత్, వార్నర్ నిషేధం తర్వాత ఏ ఫార్మాట్లోనూ ఓ సిరీస్ విజయం సాధించిన ఆస్ట్రేలియాకు ఆడిలైడ్‌లో ఆ అవకాశం వచ్చింది. నేటి మ్యాచ్‌లో నెగ్గితే వన్డే సిరీస్ ఆసీస్ వశం కానున్నది. ఇదే అంశం ఆ జట్టులో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. ఫామ్ కోసం ఇబ్బంది పడుతోన్న కెప్టెన్ అరోన్ ఫించ్ ఇక్కడ మరింత కసితో కనిపిస్తున్నాడు. ఓపెనర్ అలెక్స్ నిరూపించుకునే పనిలో ఉన్నాడు. ఉస్మాన్ ఖవాజ, హాండ్స్‌కాంబ్, షాన్ మార్ష్‌లు రాణించటంపై ఆసీస్ ఇన్నింగ్స్ ఆధారపడి ఉంది. బంతితో రిచర్డ్సన్, బెహాన్డార్ఫ్లు ఊహించిన అద్భుతం చేశారు. తొలి నాలుగు ఓవర్లలో కోహ్లిసేన కోరలు పీకి ఔరా అనిపించారు. నేటి మ్యాచ్‌లోనూ అటువంటి ప్రదర్శన పునరావృతం చేయాలని పేసర్లు భావిస్తున్నారు. నాథన్ లైయాన్ వన్డే జట్టులో ఉనికి నిలుపుకోవాల్సిన స్థితిలో నిలిచాడు. అతడూ ఆడిలైడ్‌లో వికెట్ల వేటపై ఆశలు పెట్టుకున్నాడు.
పిచ్ రిపోర్టు : ఆడిలైడ్‌లో ఇటీవల జరిగిన అన్ని వన్డేల్లోనూ స్వల్ప స్కోర్లే నమోదయ్యాయి. పేసర్లకు అనుకూలిస్తోన్న పిచ్‌పై పరుగులు చేయటం సవాల్‌గా మారింది. దీంతో నేటి మ్యాచ్ సైతం తక్కువ స్కోర్లకే పరిమితం కానున్నదని చెప్పవచ్చు. అధిక ఉష్ణోగ్రతల నడుమ పేసర్లతో పాటు స్పిన్నర్లూ కీలక భూమిక వహించనున్నారు. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.
తుది జట్లు (అంచనా)
భారత్ : రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, అంబటి రాయుడు, ఎం.ఎస్ ధోని, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ షమి.
ఆస్ట్రేలియా : అరోన్ ఫించ్, అలెక్స్ కారే, ఉస్మాన్ ఖవాజ, షాన్ మార్ష్, పీటర్ హాండ్స్‌కాంబ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్, పీటర్ సిడిల్, జే రిచర్డ్సన్, నాథన్ లైయాన్, జేసన్ బెహాన్‌డార్ఫ్.