Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-క్వార్టర్స్ బెర్త్ కోసం స్టార్స్ ఢీ
- జకోవిచ్, జ్వెరెవ్ ముందంజ
- ఆస్ట్రేలియన్ ఓపెన్
మెల్బోర్న్ : మహిళల సింగిల్స్‌లో క్వార్టర్స్‌కు ముందే స్టార్స్ ముఖాముఖి. దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్, టాప్ సీడ్ సిమోన హలెప్ (రొమానియా)లు ప్రీ క్వార్టర్స్‌లోనే తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. మూడో రౌండ్లో వీనస్ విలియమ్స్‌పై 6-2, 6-3తో గెలుపొందిన హలెప్, నాల్గో రౌండ్లో సెరెనాతో సమరానికి సై అంటోంది. మహిళల సింగిల్స్ విజేతను నిర్ణయించే ఈ ప్రీ క్వార్టర్స్పైనే ఇప్పుడు అభిమానుల ఆసక్తి నెలకొన్నది. మరోవైపు సెరెనా జోరు కొనసాగుతోంది. 6-2, 6-1తో ఉక్రెయిన్ ప్లేయర్ డయానపై వరుస సెట్లలో గెలుపొందిన సెరెనా రికార్డు టైటిల్ వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. స్పెయిన్ భామ గార్బినె ముగురుజా 7-6(7-5), 6-2తో స్విస్ అమ్మాయిపై చెమటోడ్చింది. కరిలినా ప్లిస్కోవా 6-4, 3-6, 6-2తో మూడు సెట్లలో గియోర్గిపై గెలుపొందింది. నాల్గో సీడ్ నవొమి ఒసాక (జపాన్) 5-7, 6-4, 6-1తో మెరుపు విజయం సాధించి నాల్గో రౌండ్లోకి ప్రవేశించింది. అమెరికా స్టార్ మడిసన్ కీస్ 6-3, 6-2తో మెర్టన్స్పై గెలుపొందింది.
పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) 6-3, 6-4, 4-6, 6-0తో డెనిస్పై అలవోక విజయం సాధించి నాల్గో రౌండ్లోకి చేరుకున్నాడు. యువ సంచలనం, జర్మనీ ఆశా కెరటం అలెగ్జాండర్ జ్వెరెవ్ జోరు కొనసాగుతోంది. ఆస్ట్రేలియా ఆటగాడు బోల్ట్‌పై 6-3, 6-3, 6-2తో వరుస సెట్లలో గెలుపొందిన జ్వెరెవ్ తొలి టైటిల్ వేటలో కసిగా దూసుకెళ్తున్నాడు. డెవిడ్ గొఫిన్పై మెద్వదెవ్ 6-2, 7-6(7-2), 6-2తో నెగ్గగా, జపాన్ స్టార్ కిరు నిషికొరి 7-6(8-6), 6-1, 6-2తో మూడో రౌండ్లో విజయం సాధించాడు. మిలోస్ రావోనిక్ 6-4, 6-4, 7-6(8-6)తో పైచేయి సాధించగా, కొరిచ్ 2-6, 6-3, 6-4, 6-3తో ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ఫ్రాన్స్ ఆటగాడు పౌలీ 7-6(7-3), 6-3, 6-7(10-12), 4-6, 6-3తో పాపిరీన్పై పోరాడి గెలుపొందాడు.