Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్తా చాటిన ఎం.ఎస్ ధోని
- విమర్శకులకు బ్యాట్‌తోనే బదులు
నవతెలంగాణ క్రీడా విభాగం
మహేంద్రసింగ్ ధోని హెలికాఫ్టర్ షాట్ల జోరు నెమ్మదిగా క్షీణ దశకు చేరుతోందా? అంటే అవుననే చెప్పాలి. ముగింపు మొనగాడు ఇప్పటికీ భారత జట్టులో స్థానానికి అర్హుడా? అంటే మళ్లీ అవుననే సమాధానం. 2019 ప్రపంచకప్ సమీపిస్తోన్న తరుణంలో వన్డే జట్టులో ఎం.ఎస్ స్థానంపై విపరీతమైన చర్చ జరుగుతోంది. ధనాధన్ సామర్థ్యం కోల్పోతున్న ధోని వరల్డ్‌కప్‌లో ఏ పాత్ర పోషించనున్నాడు!?
ధోని ధనాధన్ సత్తా క్షీణిస్తుందనే వాస్తవాన్ని, మహి ఇప్పటికీ జట్టుకు ఎంతో ఉపయోగకారి అనే నిజానికీ వేదికైంది ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్. తొలి వన్డేలో 4/3తో భారత్ విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నది. ఐదు ఓవర్లలోపే క్రీజులోకి వచ్చిన మహి తక్షణ కర్తవ్యం వికెట్ల పతనాన్ని నిలువరించటం. ఇటువంటి సందర్భాల్లో మహి ఎన్నో సార్లు నిరూపించుకున్నాడు, సిడ్నీ బాధ్యత కొత్త కాదు. ధోని మిడిల్ ఆర్డర్లో ఉండగా, జట్టు సైకిల్ స్టాండ్‌లా కుప్పకూలదనే భరోసా ఉంటుంది. అలాగని, అతడు ఉంటే ఓటమి తప్పిస్తాడని కాదు. కానీ కనీసం మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకెళ్లగలడు. ఆఖరు వరకూ పోరాడగలడు. సిడ్నీలో రోహిత్ శర్మ తోడుగా ధోని ఆపద్భాందవుడి పాత్ర పోషించాడు. ఈ క్రమంలో సాధించాల్సిన రన్‌రేట్ ఆకాశానికి చేరింది. ఈ సందర్భం ధోనిలోని మునుపటి ధనాధన్ పవర్ లేదని నిరూపించింది. ఇదేదో సిడ్నీ ఇన్నింగ్స్ ఆధారంగా నిర్ధారణకు వచ్చినది కాదు, గత కొన్నేండ్లుగా మహి ప్రదర్శన చెబుతోన్న సత్యం. ఇక రెండో మ్యాచ్ విషయానికొస్తే ధోనికి తోడుగా కోహ్లి ఉన్నాడు. కుదురుకునేందుకు ధోని సమయం తీసుకోగా, మరో ఎండ్‌లో కోహ్లి బాధ్యత తీసుకున్నాడు. వేగంగా పరుగుల సాధించి, మహిపై ఒత్తిడి తగ్గించాడు. ఆరోగ్యకర భాగస్వామ్యాలకు ఉండే లక్షణమిదే. కొహ్లి అవుటైనా, అప్పటికే క్రీజులో కుదురుకున్న ధోని.. ఎవరిని వేటాడలనే నిర్దారణకు వచ్చేశాడు. నాథన్ లైయాన్ను లక్ష్యంగా చేసుకుని పరుగులు పిండుకున్నాడు. దినేశ్ కార్తీక్ మంచి సహకారం అందించాడు. ఛేదనలు ఎప్పుడూ తుది లక్ష్యంపై కాకుండా, చిన్న చిన్న లక్ష్యాలుగా ఛేదించటం సులువు. ఈ విషయంలో మహిని మించిన మొనగాడు లేడు, అతడి సామర్థ్యం వెలకట్టలేనిది. ఇటువంటి ఎన్నో మ్యాచులను ధోని విజయవంతంగా ముగించాడు, ఆడిలైడ్‌లో అదే జరిగింది. ఇక మెల్బోర్న్లో ఆరంభంలో కోహ్లి, తర్వాత కేదార్ జాదవ్ తోడుగా ధోని ముగింపు మహిమ చూపించాడు. ఇక్కడా భారీ షాట్లకు వెళ్లకుండా, తనదైన శైలిలో మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకెళ్లి విజయాన్ని అందించాడు.
జోరు తగ్గినా, విలువ పెరిగింది!
ఆస్ట్రేలియాపై మూడు వన్డేల్లో అతడి ప్రదర్శన గతంలో మాదిరి ధనాధన్‌ను తలపించలేదు. కానీ తుది జట్టులో నిలిచేందుకు అతడు ఇంకా విలువైన ఆటగాడే. గతంలో ధోని 'ది బ్యాట్స్‌మన్' ట్యాగ్ తుది జట్టులోకి చోటు కోసం సరిపోయేది. అయితే, ఇప్పుడు ధోని 'ది ప్యాకేజ్' ట్యాగ్ అతడిని జట్టులో నిలుపుతోంది. వికెట్ల వెనకాల పరిపూర్ణమైన కీపింగ్, డీఆర్ఎస్లో కచ్చితత్వం, మైదానంలో వ్యూహాత్మక సలహాలు ధోనీని ఇప్పటికీ జట్టులో నిలిచేలా చేస్తున్నాయి. భారత టాప్-3 రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి ప్రపంచ అత్యుత్తమ త్రయం. కానీ వారి తర్వాతి వరుసలో అనుభవం ఉన్న ఆటగాడే లేడు. కానీ ఆ లోటును ధోని భర్తీ చేస్తున్నాడు.
అనుకున్నప్పుడు అలవోకగా సిక్సర్లు బాదటం, ఫీల్డర్ల మధ్య బంతిని పంపించి విలువైన పరుగులు సాధించటం, వికెట్ల మధ్య వేగవంతమైన పరుగు, ఎప్పుడు ఏ విధంగా ఆడాలనే అసమాన ప్రతిభ తెలిసినోడు.. ఏండ్లుగా ధోని అతిపెద్ద సాంకేతిక సానుకూలతలు. వీటిలో తొలి రెండింటిలో స్పష్టమైన తగ్గుదల కనిపించినా, చివరి రెండింటిలో మహి ఇప్పటికీ ప్రభావశీలుడు. వయసు పెరిగితే తెలివేమీ నెమ్మదించదు, అందుకే అతడు వికెట్ల మధ్య పరుగులో క్రీయాశీలంగా ఉన్నాడు. తనను తాను పూర్తి ఫిట్నెస్గా చూసుకున్నాడు. గతంలో మాదిరి భారీ షాట్లు ఆడేందుకు ధోనికి ఇప్పుడు సమయం అవసరం. అందుకే క్రీజులోకి రాగానే కాస్త సమయం తీసుకుంటున్నాడు. భారీ షాట్లకు వెళ్లటంలో అతడు ఎంపిక చేసుకునే బంతులు, టార్గెట్ చేసుకునే బౌలర్లు తక్కువవుతున్నారు. ఇది ఆందోళన కలిగించే పరిణామం. బ్యాట్స్‌మన్ పరిమితులు ఒకసారి బౌలర్ పసిగడితే, ఆ ప్రభావం ప్రతికూలం. ధోని మునుపటిలా ప్రతి బంతినీ సిక్సర్ సంధించలేడనే విషయం బౌలర్‌కు తెలిసిపోవటంతో, బౌలర్లు మరింత దూకుడుగా బంతులేస్తున్నారు. గతంలో చివరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సి ఉన్నా.. క్రీజులో ధోని ఉంటే ఒత్తిడి బౌలర్‌పైనే. కానీ ఇప్పుడు మహికి బంతులేసేందుకు బౌలర్లు ఏమాత్రం సంకోచించటం లేదు. ఫీల్డర్లు మొహరింపులు సైతం ధోనికి ప్రతికూలంగా ఉంటున్నాయి. గతంలో సర్కిల్ బయట కాచుకునే ఫీల్డర్లు ఇప్పుడు సర్కిల్ లోపల మరింత దగ్గరగా కాపు కాస్తున్నారు. దీంతో సింగిల్స్ తీసేందుకు ధోని ఇబ్బంది పడుతున్నాడు. దీంతో పరుగుల కోసం కచ్చితంగా రిస్క్ తీసుకొని, షాట్‌కు వెళ్లాల్సిందే. కానీ రిస్క్ తీసుకోవటం ధోని డీఎన్ఏలోనే లేదు!. సహనంతో క్రీజులోనే నిలిచి ఎప్పట్లాగే మ్యాచ్‌ను ఆఖరి ఓవర్ వరకూ తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో మిడిల్ ఓవర్లలో కొన్ని బంతులను వృథా చేసినా, అది జట్టు మూల్యం చెల్లించుకునే పరిస్థితికి దారితీయదని ధోని నమ్మకం.
ధోని ది డిఫెన్స్!
ఆస్ట్రేలియా పర్యటనలో రెండు మంచి విషయాలు. విదేశీ పిచ్‌లపై నిలబడి పరుగులు చేయలేడు అని విమర్శలు ఎదుర్కొన్న చతేశ్వర్ పుజార టెస్టుల్లో చరిత్ర సృష్టించగా, మునుపటి ముగింపు మహిమ కోల్పోయాడు అని నిందలు మోసిన మహేంద్రుడు వన్డేల్లో చెలరేగాడు. గత కొన్నేండ్లుగా ధోని స్ట్రయిక్ రేట్, బౌండరీల సగటు గణనీయంగ తగ్గుతోంది. 2015 ప్రపంచకప్‌కు ముందు తొలి 20 బంతులకు ధోని స్ట్రయిక్‌రేట్ 74.80. అదే 2015-2018 వరకు 74.80 కాగా, 2018 నుంచి 65.85కు చేరుకున్నది. ఇదే విధంగా 21-40 బంతుల్లో స్ట్రయిక్ రేట్ వరుసగా 90.88, 79.08, 79.86గా ఉంది. ఇక 41 బంతుల తర్వాత ధోని స్ట్రయిక్ రేట్ 106.67, 97.73, 71.72. ఆఖర్లో జూలు విదిల్చే మహి అక్కడే స్ట్రయిక్‌రేట్‌ను గణనీయంగా కోల్పోయాడు. ఇదే విధంగా బౌండరీలు బాదే విషయంలోనూ ధోని సత్తా తగ్గుతూ వస్తోంది. తొలి 20 బంతుల్లో 2015 వరల్డ్‌కప్ వరకు 13.7 బంతులకో బౌండరీ బాదగా, అది 2015-18 కాలానికి 15.4కు పెరిగింది. 2018 నుంచి 22.4 బంతులకు గానీ ఓ బౌండరీ బాదటం లేదు. 40 బంతులు ఎదుర్కొన్న తర్వాత ధోని గతంలో ప్రతి 9.3 బంతులకో బౌండరీ కొట్టేవాడు. ప్రపంచకప్ నుంచి అది 9.9 బంతులకు చేరింది, 2018 నుంచి 18.1 బంతులకు చేరటం మహి ధనాధన్ పవర్ పడిపోవటం స్పష్టంగా తెలిసేలా చేస్తోంది.
ప్రపంచకప్ జట్టులో ఉండాలి అతడు..
2018 ప్రపంచకప్ జట్టులో ధోని ఉంటాడా? లేదా చర్చ ఇక అనవసరం. అతడు ఏ స్థానానికి సరిపోతాడనే విషయాన్ని కనుక్కోవటం జట్టుకు కీలకం. ప్రస్తుతం అతడు ఐదో స్థానంలో ఆడుతున్నాడు. మరింత ముందుగా ఆడించాలనే ఆలోచనలో తప్పేమీ లేదు.. ముందుగా వస్తే కొత్త బంతితో సీమర్లను ఎదుర్కొలేడు అనే విమర్శ వినిపిస్తోంది. ధోని ఎదుర్కొనే విధానం కొత్తగా కనిపించినా, కొత్త బంతిని అలవోకగా ఎదుర్కొని నిలబడగలడు. ఇక స్పిన్నర్లపై గతంలో నేరుగా దాడి చేసే ధోని, ఇప్పుడు స్వీప్, స్క్వేర్‌లో పరుగుల కోసం చూస్తున్నాడు. ఎదురుదాడి పొజిషన్ నుంచి రక్షణాత్మక దారి ఎంచుకోవటంలో తప్పేమీ లేదు. ప్రపంచకప్‌లో టాప్-3 త్రయం రాణించి జట్టు స్కోరు 30 ఓవర్ల తర్వాత 220/2-230/2గా ఉన్నప్పుడు కచ్చితంగా ధోనిని పంపించరాదు. హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్ సహా అవసరమైతే కేదార్ జాదవ్‌నూ ముందుగా పంపించాలి. అదే ఆరంభ ఓవర్లలోనే టాప్-3 విఫలమైతే అప్పుడు జట్టును ఆదుకునేది ధోని మాత్రమే, ఇందులో మరో ఆలోచనకు చోటు లేదు.
కెరీర్లో భిన్న పరిస్థితుల్లో, భిన్న సమయాల్లో విభిన్న పాత్రల్లో ఒదిగిపోవటమే చాంపియన్ల లక్షణం. 25 ఏండ్ల చేసిన విధ్వంసం 35 ఏండ్ల వయసులో చేయలేమని వాస్తవాన్ని అంగీకరించటంలో తప్పేమీ లేదు. ధోనీకి సైతం ఇది వర్తిస్తుంది, అందుకే మహి దిగ్గజ చాంపియన్.