Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధోనికి ఇయాన్ చాపెల్ కితాబు
న్యూఢిల్లీ : వన్డే క్రికెట్లో మహేంద్రసింగ్ ధోనీనే ఇప్పటికీ ముగింపు మొనగాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ కితాబిచ్చాడు. కొంతకాలంగా ఎం.ఎస్ ధోని ముగింపు సత్తా క్షీణిస్తోందని, అతడిలో మునుపటి వేడి లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో హ్యాట్రిక్ అర్ధ సెంచరీలతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన ధోనిపై చాపెల్ ప్రశంసల జల్లు కురిపించాడు. ' ధోని మాదిరి మరెవ్వరూ మ్యాచులను ముగించలేదు. ధోని మరీ ఆలస్యం చేశాడని ఎన్నోసార్లు అనుకున్నాను. కండ్లుచెదిరే పవర్ఫుల్ షాట్లతో అన్నిసార్లు ఉత్కంఠ విజయాల్ని అందించాడు. వ్యూహాత్మకంగా ఇప్పటికీ మహి బుర్ర చురుగ్గా పనిచేస్తోంది' అని చాపెల్ అన్నాడు. వన్డే క్రికెట్ మరో దిగ్గజ ఫినీషర్ మైకెల్ బెవాన్తో ధోనిని పోల్చిన చాపెల్.. మిస్టర్ కూల్‌కే ఓటేశాడు. ' బెవాన్ ఫోర్లతో మ్యాచులను ముగించగా, ధోని సిక్సర్లతో ఆ పని చేశాడు. వికెట్ల మధ్య పరుగు తీయటంలో బెవాన్ చురుకుదనంతో ధోనీకి పోటీ పెట్టవచ్చు కానీ, 37 ఏండ్ల వయసులోనూ అంతే వేగంగా మహి పరుగులు తీస్తున్నాడు. టీ20 ఫార్మాట్ అనుకూలత ధోనికి ఉన్నప్పటికీ, బెవాన్ కంటే ధోనియే అత్యుత్తమ ఫినీషర్. అందులో ఎటువంటి చర్చకు తావులేదు. వన్డే క్రికెట్ బెస్ట్ ఫినీషర్ ధోని' అని తాను రాసిన ఓ కాలమ్‌లో చాపెల్ పేర్కొన్నాడు.