Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రీస్ కుర్రాడి పెను సంచలనం
- స్విస్ యోధుడిపై మెరుపు విజయం
- ప్రీ క్వార్టర్స్‌లో కంగుతిన్న కెర్బర్
- క్వార్టర్స్‌లో నడాల్, క్విటోవా, స్టిఫెన్స్
మెల్బోర్న్
ఈ భూమ్మీద ఇప్పుడు అత్యంత సంతోషంగా ఉన్న వ్యక్తిని నేనే. ఫెడరర్ టెన్నిస్ దిగ్గజం. ఎంతో గౌరవం. ఏండ్లుగా స్ఫూర్తిదాయక టెన్నిస్ ఆడుతున్నాడు. ఆరేండ్ల ప్రాయం నుంచే ఫెడరర్ ఆటను విశ్లేషించటం మొదలెట్టాను. రొడ్ లావర్ ఎరినాలో ఫెడరర్‌తో ముఖాముఖి ఆడాలనే కల నిజమైంది. ఇది విజయం సాధించటం అంటారా.. మాటల్లో వర్ణించలేను'
- స్టెఫానొస్ సిట్సిపస్
' నా కొడుకుపై గెలిచినట్టుంది'.. పెర్త్‌లో 20 ఏండ్ల గ్రీస్ కుర్రాడిపై మూడు సెట్ల విజయానంతరం రోజర్ ఫెడరర్ వ్యాఖ్యలు. నిజమే ఫెడరర్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల సంఖ్యంత వయసున్న ఆ కుర్రాడు.. ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో స్విస్ యోధుడుతో తలపడటమే పెద్ద ఘనత. కానీ ఆ కుర్రాడు దిగ్గజంతో ఆడితే చాలు అనుకోలేదు, దిగ్గజంపై గెలిస్తే గొప్ప అనుకున్నాడు!. మెల్బోర్న్ పార్క్ కిక్కిరిసిన రొడ్ లావెర్ ఎరినాలో టెన్నిస్ దిగ్గజాన్ని జయించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అతి పెద్ద సంచలనాన్ని నమోదు చేశాడు. డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్‌పై గెలుపొందాడు. అతడే గ్రీస్ సంచలనం స్టెఫానొస్ సిట్సిపస్. గ్రీస్ కుర్రాడి కండ్లుచెదిరే పోరాటంతో, 18 ఏండ్లలో క్వార్టర్స్‌కు చేరకుండానే ఫెడరర్ మెల్బోర్న్ను వీడటం ఇది రెండోసారి మాత్రమే.
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అతి పెద్ద సంచలనం. 20 గ్రాండ్‌స్లామ్ టోర్నీల విజేత, టెన్నిస్ యోధుడు రోజర్ ఫెడరర్ క్వార్టర్ఫైనల్స్కు చేరకుండానే నిష్క్రమించాడు. హోప్‌మన్ కప్‌లో తొలిసారి ఫెడరర్‌తో తలపడి, పెర్త్‌లో గట్టి పోటీనిచ్చిన 20 ఏండ్ల కుర్రాడు స్టెఫానొస్ సిట్సిపస్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం సృష్టించాడు. రికార్డు ఏడో ఆస్ట్రేలియన్ ఓపెన్ సహా హ్యాట్రిక్ టైటిల్స్ వేటలో నిలిచిన ఫెడరర్‌ను 225 నిమిషాల మారథాన్ మ్యాచ్‌లో జయించి, టెన్నిస్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. 6-7(11-13), 7-6(7-3), 7-5, 7-6(7-5)తో ఫెడరర్‌పై సిట్సిపస్ సంచలన విజయాన్ని నమోదు చేశాడు. మహిళల సింగిల్స్‌లో మాజీ వరల్డ్ నం.1 ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) సైతం కంగుతిన్నది. అమెరికా అమ్మాయి డానిలీ రోస్ కొలిన్స్ చేతిలో వరుస సెట్లలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. మారిన్ సిలిచ్, స్లొనె స్టిఫెన్స్, మరియా షరపోవాలు ఓటమిపాలయ్యారు.
యంగ్ వర్సెస్ ఓల్డ్! : పురుషుల సింగిల్స్ సర్క్యూట్లో ప్రీ క్వార్టర్స్ బరిలో నిలిచిన పిన్న వయస్కుడు, అనుభవజ్ఞుడు తలపడిన మ్యాచ్ ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌కే హైలైట్‌గా నిలిచింది. 37 ఏండ్ల రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)కు 20 ఏండ్ల సిట్సిపస్‌పై విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారు. కానీ ఏ కొలమానంతో అంచనాలు వేశారో సరిచూసుకోండని తొలి గేమ్‌లోనే సిట్సిపస్ చెప్పకనే చెప్పాడు. తొలి సెట్లో తొలుత సర్వ్ చేసిన స్టెఫానొస్ పాయింట్ కోసం చివరి వరకూ పోరాడాడు. 30-40తో వెనుకంజలో నిలిచినా.. పుంజుకుని 1-0 ఆధిక్యం సాధించాడు. సర్వ్‌తో సులువుగా పాయింట్ సాధించిన ఫెడరర్ 1-1తో సమం చేశాడు. ఇలా ఫెడరర్, స్టెఫానొస్లు తమ సర్వ్‌లు నిలుపుకోవటంతో స్కోరు 6-6 వరకూ సమంగానే సాగింది. కానీ టైబ్రేకర్‌లో పైచేయి సాధించిన ఫెడరర్ తొలి సెట్‌ను గెల్చుకున్నాడు. 2, 3వ సెట్లలోనూ ఇదే విధంగా జరిగింది. ఏ ఒక్కరూ సర్వ్‌ను కోల్పోలేదు. కానీ తర్వాతి రెండు టైబ్రేకర్లలో పైచేయి సాధించిన స్టెఫానొస్ 2-1తో క్వార్టర్స్ బెర్త్ ముందు నిలిచాడు. ఈ తరుణంలో అమీతుమీ తేల్చుకోవాల్సిన స్థితిలో నాల్గో సెట్ ఫెడరర్‌కు కీలకమైంది. కానీ ఆ సెట్లోనూ ఆట మారలేదు, ఫలితం మారలేదు. 6-6తో స్కోరు సమమైన వేళ టైబ్రేకర్‌లో ఫెడరర్ 5-7తో వెనుకంజ వేశాడు. క్వార్టర్స్‌కు చేరకుండానే ఇంటిముఖం పట్టాడు. తొలి మూడు సెట్లలో ఒక్క సర్వ్నూ కోల్పోకుండా, నాల్గో సెట్ ఆడాల్సి రావటం ఫెడరర్ బహుశా ఇదే ప్రథమం!. రిటర్న్, వ్యాలీలతో గొప్పగా ఆడినా యువ వేగం ముందు ఫెడరర్ నిలువలేదు. 55 అనవసర తప్పిదాలు ఫెడరర్‌ను దెబ్బతీశాయి. స్టెఫానొస్ 36 అనవసర తప్పిదాలే చేశాడు. స్టెఫానొస్ 20 ఏస్‌లు సంధించగా, ఫెడరర్ 12కే పరిమితమయ్యాడు. సిట్సిపస్ 62 విన్నర్లు సాధించగా, రోజర్ 61 విన్నర్లు సాధించాడు. ఓవరాల్‌గా గ్రీస్ కుర్రాడు 178 పాయింట్లు సాధించగా, ఫెడరర్ 166 పాయింట్లతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
పురుషుల సింగిల్స్ మరో ప్రీ క్వార్టర్స్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నడాల్ వరుస సెట్లలో గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. చెక్ రిపబ్లిక్ ఆటగాడు థామస్ బెర్డిచ్‌పై 6-0, 6-1, 7-6(7-4)తో గెలుపొందాడు. గతేడాది రన్నరప్ సైతం క్వార్టర్స్‌కు చేరలేదు. మారిన్ సిలిచ్ (క్రోయేషియా) ఐదు సెట్ల పోరులో రాబర్టో చేతిలో ఓటమిపాలయ్యాడు. 6-7(6-8), 6-3, 6-2, 4-6,6-4తో బటిస్టా ఆగట్ (స్పెయిన్) క్వార్టర్స్‌కు చేరాడు. అమెరికా కుర్రాడు ఫ్రాన్సెస్ 7-5, 7-6(8-6),6-7(1-7), 7-5తో గ్రిగర్ దిమిత్రొవ్ (బల్గేరియా)పై గెలుపొంది క్వార్టర్స్‌లో కాలుమోపాడు.
షరపోవా, కెర్బర్ అవుట్ : మహిళల సింగిల్స్‌లోనూ ఆదివారం సంచలన ఫలితాలే నమోదయ్యాయి. రెండో సీడ్, టైటిల్ ఫేవరెట్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) సహా మాజీ వరల్డ్ నం.1, రష్యా స్టార్ మరియా షరపోవాలు ఇంటిముఖం పట్టారు. అమెరికా అమ్మాయి డానిలీ రోస్ కొలిన్స్ చేతిలో 0-6, 2-6తో కెర్బర్ దారుణ పరాభవం చెందింది. లోకల్ స్టార్ ఆష్లె బార్టీ (ఆస్ట్రేలియా)తో మూడు సెట్ల సమరంలో 6-1, 1-6, 4-6తో షరపోవా పోరాడి ఓడింది. యూ.ఎస్ ఓపెన్ విజేత స్లొనె స్టిఫెన్స్ సైతం మెల్బోర్న్ను వీడింది. రష్యా ప్లేయర్ అనస్తాసియా చేతిలో 7-6(7-3), 3-6, 3-6తో పరాజయం పాలైంది. మరో మ్యాచ్‌లో పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6-2, 6-1తో అనిసిమోవ (అమెరికా)పై వరుస సెట్లలో నెగ్గి క్వార్టర్ఫైనల్లోకి చేరింది.