Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విదర్భ రంజీ కెప్టెన్ ఫజల్
నాగ్‌పూర్ : వరుసగా రెండోసారి రంజీ విజేతగా నిలిచిన విదర్భ, ఇప్పుడు దేశవాళీ క్రికెట్లో స్టార్ అడ్డాగా మారింది. 40 ఏండ్ల వెటరన్ క్రికెటర్ వసీం జాఫర్ మార్గనిర్దేశనంతో రంజీ టైటిల్‌ను నిలుపుకున్న విదర్భ, రంజీల్లో కొత్త శకానికి నాంది పలికింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో విదర్భ 312 పరుగులకే కుప్పకూలిన వేళ, ఆ జట్టు నెగ్గుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇక సౌరాష్ట్ర 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వేళా, టైటిల్ విదర్భ చేజారిందనే అనుకున్నారు. అందుకు ఏకైక కారణం, సౌరాష్ట్ర స్టార్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా. కానీ పుజారాకు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కట్టడి చేసిన విదర్భ సౌరాష్ట్రను చిత్తు చేసింది. స్టార్ బ్యాట్స్‌మన్ పుజారా కోసం విదర్భ మానసికంగా, వ్యూహాత్మకంగా సిద్ధమైందని ఆ జట్టు కెప్టెన్ ఫయజ్ ఫజల్ తెలిపాడు. ' సౌరాష్ట్ర రంజీ సీజన్లో అద్బుతంగా ఆడింది.సెమీస్‌లో కర్ణాటకను ఓడించి ఫైనల్స్‌కు చేరిన తీరు అమోఘం. పుజారా, షెల్డన్ జాక్సన్లతో పాటు సౌరాష్ట్ర బ్యాట్స్‌మెన్ అందరికీ ప్రత్యేక వ్యూహం సిద్ధం చేసుకున్నాం. పుజారాకు ప్రత్యేక ఫీల్డింగ్ మొహరింపులతో సులువుగా పరుగులు ఇవ్వకూడదని నిర్ణయించాం, ఫలితం అందరూ చూశారు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా బంతులే యమని బౌలర్లకు మనోధైర్యం అందించి వ్యూహం అమలు చేశాం' అని ఫజల్ పేర్కొన్నాడు.