Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ20 సిరీస్ కోసం భారత్, కివీస్ పోరు
- హామిల్టన్‌లో నేడు చావోరేవో
- జోరుమీదున్న టీమ్ ఇండియా
హామిల్టన్
చరిత్రను తిరగ రాయటాన్ని అలవాటుగా మార్చుకున్న టీమ్ ఇండియా, న్యూజిలాండ్ పర్యటనలో మరో బోణీ సిరీస్‌పై కన్నేసింది. ఇక్కడ టీ20 సిరీస్‌ను నెగ్గని భారత్, హామిల్టన్‌లో ఆ ఘనత దక్కించుకునేందుకు ఎదురుచూస్తోంది. వన్డే సిరీస్‌ను కోల్పోయిన కివీస్, చిన్న కప్పుపై కన్నేయగా.. రోహిత్‌సేన సువర్ణావకాశాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేదు. భారత్, న్యూజిలాండ్ సిరీస్ వేటలో హామిల్టన్‌లో నేడు అమీతుమీ ఖాయం.
సుదీర్ఘ పర్యటనను మరో సిరీస్ విజయంతో ముగించాలని టీమ్ ఇండియా ఆశిస్తోంది. ఆసీస్‌తో టీ20 సిరీస్‌ను పంచుకున్నా.. తర్వాత వరుసగా టెస్టు, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్నది. కివీస్‌పై వన్డే సిరీస్‌నూ ఏకపక్షంగా వశపర్చుకున్నది. ఈ పర్యటనకు ఘనమైన ముగింపు న్యూజిలాండ్ గడ్డపై తొలి టీ20 సిరీస్ విజయమే!. వెల్లింగ్టన్ తప్పిదాలను వేగంగా ఆక్లాండ్‌లోనే సరిచేసుకున్న రోహిత్‌సేన, అదే ఊపులో పొట్టి కప్పును సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఇదే సమయంలో వన్డే సిరీస్ ఓటమికి ఓదార్పుగా టీ20 సిరీస్ సాధించాలని విలియమ్సన్ సేన పట్టుదలగా కనిపిస్తోంది. సిరీస్ కోసం ఇరు జట్లూ పోటాపోటీగా పోరాడేందుకు సిద్ధమైన వేళ.. పొట్టి సిరీస్ ఎవరికి దక్కుతుందో చూడాలి.
ధనాదన్ దరువేస్తారా? : చిన్న బౌండరీల కివీస్ పిచ్‌లపై పొట్టి సిరీస్‌లో రోహిత్‌సేన స్థాయికి తగ్గ స్కోరు చేయలేదు. ప్రధాన బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి, ప్రధాన బౌలర్ జశ్‌ప్రీత్ బుమ్రాలు లేకుండా బరిలోకి దిగినా.. ఆ లోటు ఎక్కడా కనిపించకుండా చేసేందుకు రోహిత్‌కు ఇదే సరైన సమయం. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేదు. దీంతో ఆక్లాండ్‌లో అతడికి చోటు దక్కలేదు. నేడూ అతడు ఆడే అవకాశం కనిపించటం లేదు. చైనామన్ కుల్దీప్ యాదవ్‌ను బరిలోకి దింపే ఆలోచన చేస్తోన్న రోహిత్ అందుకోసం బ్యాటింగ్ లైనప్‌లో దినేశ్ కార్తీక్‌ను బెంచ్‌కు పరిమితం చేసే అవకాశం లేకపోలేదు. కృనాల్ ప్యాండ లెఫ్టార్మ్ స్పిన్‌తో పాటు ఏడో స్థానంలో దూకుడైన బ్యాటింగ్‌తో లోయర్ ఆర్డర్‌ను బలోపేతం చేస్తున్నాడు. టాప్ ఆర్డర్లో శిఖర్ ధావన్ భారీ ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తుండగా, రిషబ్ పంత్ సైతం తనదైన ఇన్నింగ్స్ ఆడాలని ఎదురుచూస్తున్నాడు. భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్‌లు మరోసారి హార్దిక్ పాండ్యతో కలిసి పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.
సిరీస్ సాధించాలని : ఆతిథ్య న్యూజిలాండ్ పొట్టి సిరీస్ సాధించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. వన్డే ఓటమి న్యూజిలాండ్ బలహీనత కాదని చెప్పేందుకు పొట్టి విజయం విలియమ్సన్ సేనకు అత్యవసరం. యువ ఆటగాళ్లకు తోడు నాణ్యమైన ఆల్‌రౌండర్లతో భారత్‌కు గట్టి పోటీ ఇవ్వగల సత్తా న్యూజిలాండ్ సొంతం. కానీ భారత స్పిన్నర్లు మెరిసిన చోట న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడుతున్నారు. కెప్టెన్ విలియమ్సన్ చివరి మ్యాచ్‌లో చెలరేగితే ఆతిథ్య జట్టుకు తిరుగుండదు. రాస్ టేలర్, గ్రాండ్‌హౌమె సహా టిమ్ సీఫర్ట్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. జేమ్స్ నీషమ్ తుది పోరులో ఆడే అవకాశం కనిపిస్తోంది. ఇశ్ సోధి, టిమ్ సౌథీ, శాంట్నర్‌లు బంతితో భారత్‌ను నియంత్రించటంపైనే న్యూజిలాండ్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
పిచ్ రిపోర్టు : న్యూజిలాండ్‌లో అన్ని మైదానాల మాదిరిగానే హామిల్టన్ సైతం చిన్న బౌండరీల బ్యాటింగ్ అనుకూల పిచ్. గతంలో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లు నమోదయ్యాయి. కానీ స్పిన్ కీలక పోషిస్తున్న సిరీస్‌లో, మాయగాళ్లు మెరిస్తే ఫలితం ఏ విధంగా ఉంటుందో ఆక్లాండ్‌లో చూశాం. ఇక్కడా స్పిన్‌ను నమ్ముకునేందుకు ఇరు జట్లూ సిద్ధమవుతున్నాయి.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, విజరు శంకర్, ఎం.ఎస్ ధోని, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, యుజ్వెంద్ర చాహల్.
న్యూజిలాండ్ : టిమ్ సీఫర్ట్, కొలిన్ మన్రో, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, డార్లీ మిచెల్, జేమ్స్ నీషమ్, కొలిన్ డీ గ్రాండ్‌హౌమె, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, ఇశ్ సోధి, బ్లేయిర్ టిక్నర్.