Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కీపింగ్ మెరుపులపై పంత్
న్యూఢిల్లీ : వికెట్ల వెనకాల అతడి నైపుణ్య లేమి అదనపు పరుగులు (బైస్) రూపంలో జట్టుకు అదనపు భారంగా మారాయి. మంచి బంతులేసిన బౌలర్లు, వికెట్ కీపర్ వైఫల్యం మూలంగా నిరాశకు లోనవుతున్నారు. అతడు వికెట్ల వెనకాల పనికి రాడు. ఇంగ్లాండ్ పర్యటనలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై వినిపించిన విమర్శలు. నిజమే, విమర్శల్లో వాస్తవం ఉంది. వికెట్ల వెనకాల పంత్ ఎంతో నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో పంత్ వికెట్ కీపింగ్ చర్చనీయాంశమైంది. అయితే, ఆస్ట్రేలియా పర్యటనలో వికెట్ల వెనకాల అద్భుత నైపుణ్యం చూపించిన పంత్, వికెట్ల ముందూ మెరిసిన సంగతి తెలిసిందే. వికెట్ కీపింగ్ మెరుగుదల ఘనతను మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరెకు ఇచ్చాడు రిషబ్. ' ఇంగ్లాండ్‌లో వికెట్ కీపింగ్ భిన్నమైన అనుభవం. ఆ తర్వాత నేషనల్ అకాడమీలో కిరణ్ మోరెతో పని చేశాను. చేతులు ఉంచే పొజిషన్, శరీర కవలికలపై మోరె కీలక సూచనలు చేశారు. నా వికెట్ కీపింగ్‌లో కొన్ని మార్పులు చేసుకున్నాను. అది పని చేసింది' అని రిషబ్ పంత్ తెలిపాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు రెండో వికెట్ కీపర్‌గా ఎంపికైన రిషబ్ ప్రపంచ కప్ జట్టులో చోటు ఖాయం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో 20 క్యాచులు అందుకున్న పంత్, ఆడిలైడ్ టెస్టులో 11 క్యాచులతో ప్రపంచ రికార్డు సమం చేసిన సంగతి తెలిసిందే.