Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విప్లవాత్మక మార్పులు సూచించిన ఎంసీసీ
లండన్ : టెస్టు క్రికెట్లో ఎక్కువ మందికి విసుగు తెప్పించే కాలయాపనకు కాలం చెల్లనున్నది. ఇక నుంచి ప్రతి షాట్ ఆడిన తర్వాత, మరో బంతి వేసేందుకు నిర్దిష్ట సమయాన్ని నిర్దేశించనున్నారు. ఒక్కో దేశంలో ఒక్కో తరహా బంతి కాకుండా, టెస్టుల్లో ఒకే బంతిని ఉపయోగించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీ పలు మార్పులు సూచించింది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైక్ గెట్టింగ్ సారథ్యంలోని కమిటీ గత వారం బెంగళూర్‌లో సమావేశమైంది. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ కమిటీలో సభ్యుడు. టెస్టు క్రికెట్ చూసేందుకు ఎందుకు ఆసక్తి చూపటం లేదని ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ అభిమానులను ప్రశ్నించగా.. స్లో ఓవర్ రేట్ అని 25శాతం మంది బదులిచ్చారు. టీ20 క్రికెట్ విప్లవాత్మ కంగా వృద్ధి చెందుతున్న తరుణంలో సంప్రదాయ ఐదు రోజుల ఆటకు వన్నె తెచ్చేందుకు ఎంసీసీ కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఎంసీసీ సూచనలకు ఐసీసీ ఆమోదం తెలిపితే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ నుంచి ఈ మార్పులు చూడబోతున్నాం!. ఎంసీసీ సూచించిన మార్పులివే..
- స్కోరు బోర్డు పక్కనే టైమర్‌ను అమర్చుతారు. షాట్ తర్వాత మరో బంతి వేసేందుకు 45 సెకండ్లు, కొత్త బ్యాట్స్‌మన్ క్రీజులోకి వచ్చినప్పుడు 60 సెకండ్లు, బౌలర్ మార్పు జరిగిప్పుడు 80 సెకండ్ల గరిష్ట సమయం నిర్దేశిస్తారు. ఈ సమయంలో ఏ జట్టు సిద్ధంగా లేకపోయినా తొలుత హెచ్చరిస్తారు. తర్వాత ఐదు పరుగుల జరిమానా విధిస్తారు.
- ఇదే విధంగా వికెట్ పడినప్పుడు సైతం టైమర్‌ను వినియోగిస్తారు. పెవిలియన్ నుంచి పిచ్ దూరాన్ని బట్టి ఇక్కడ సమయం మారుతుంటుంది. టైమర్ 0 సెకండ్లకు చేరేలోపు బ్యాట్స్‌మన్, ఫీల్డర్లు సిద్ధంగా ఉండాలి.
- అంపైర్ నిర్ణయ సమీక్ష విధానం (డీఆర్ఎస్) సమయంలోనూ టైమర్‌ను వినియోగిస్తారు. టీవీ అంపైర్ నాటౌట్ అని ప్రకటించిన తర్వాత అనవసర జాప్యానికి చోటివ్వరు. నాటౌట్ నిర్ణయాన్ని టీవీ అంపైర్ వీలైనంత త్వరగా ప్రకటించేలా చూడాలి..
- వరల్డ్‌కప్ తర్వాత ఆరంభమయ్యే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఒకే తరహా బంతిని వినియోగిం చాలి. భారత్‌లో ఎస్జీ.. ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లలో డ్యూక్ బంతులు.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలలో కూకాబుర్రా బంతులు వాడుతున్నారు. ఇలా భిన్న బంతులను కాకుండా ఒకే బంతిని అన్ని చోట్లా ఉపయోగిస్తారు.
- టెస్టు క్రికెట్లో నో బాల్స్‌కు ఫ్రీ హిట్ ప్రకటించటం. వన్డేల్లో ఫ్రీ హిట్స్ వచ్చాక నో బాల్స్ శాతం గణనీయంగా తగ్గింది. ఇంగ్లాండ్ ఏకంగా 45 వరుస వన్డేల్లో నో బాల్స్ వేయలేదు. కానీ టెస్టుల్లో మూడు సిరీస్‌ల్లోనే 12 నో బాల్స్ వేసింది. స్లో ఓవర్ రేట్‌కు నో బాల్స్ కారణం. అభిమానుల్లో ఫ్రీ హిట్‌కు స్పందన బాగుంది. దీంతో టెస్టుల్లోనూ నో బాల్స్‌కు ఫ్రీ హిట్ ఇవ్వటం.