Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి టైటిల్ వేటలో రాయల్ చాలెంజర్స్
నవతెలంగాణ క్రీడా విభాగం
ఐపీఎల్లో విధ్వంసకారుల లోటు లేని, ఒంటిచేత్తో మ్యాచ్ మలుపుతిప్పగల యోధుల కరవు లేని ఏకైక జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూర్. ఇప్పుడే కాదు ఐపీఎల్ ఆరంభం నుంచీ బెంగళూర్ స్టార్ కళకు తిరుగులేదు. విరాట్ కోహ్లి, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, ద్రవిడ్, కుంబ్లే, రాస్ టేలర్, జహీర్ ఖాన్ ఇలా బెంగళూర్ స్టార్డమ్కు కొదవ లేకుండా రాయల్ చాలెంజర్స్ తరఫున బరిలోకి దిగారు. 11 సీజన్లలో మూడు సార్లు టైటిల్ పోరుకు చేరుకున్నా, బెంగళూర్ కప్పు కల తీరలేదు. బెంగళూర్ కథ ఇప్పుడూ అదే. స్టార్స్ ఉన్నారు, మ్యాచ్ విన్నర్లు సిద్ధం. కానీ టైటిల్ సాధించగల సమష్టి ప్రదర్శన ఉందా?
ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో డెక్కన్ చార్జర్స్ జట్టు ఎలా ఉండేదో అభిమానులకు గుర్తుండే ఉంటుంది!. లీగ్ ఆరంభ సీజన్లో బంతిని బాదగల వీరులు, వన్డే క్రికెట్లోనే విధ్వంసకారులుగా గుర్తింపు పొందిన వారు డెక్కన్ ఛార్జర్స్ సొంతం. ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఆండ్రూ సైమండ్స్, షాహిద్ అఫ్రిది, స్కాట్ స్టయిరీస్, హర్షలె గిబ్స్..ఇలా జట్టులో ఎవరిని చూసిన ప్రత్యర్థి గుండెల్లో బౌండరీలు పరుగెత్తాల్సిందే!. కానీ ఆరంభ సీజన్లో డక్కన్ ఛార్జర్స్ ప్రదర్శనను సైతం అభిమానులు ఇంకా మరిచిపోలేరు. ఎందుకంటే భారీ హిట్టర్లతో బరిలోకి దిగి, భారీ అంచనాలన నడుమ బొక్కబోర్లా పడింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌కు డీసీ కథను అన్వయించవచ్చు!. బెంగళూర్ జట్టుదీ అదే రీతి, అదే తీరు. జట్టులో స్టార్స్ బ్యాట్స్‌మెన్‌కు కొదవ లేదు. ఎవరిని చూసినా మ్యాచ్‌ను ఏకపక్షం చేయగల యోధులే. కానీ సమష్టి ప్రదర్శనలు చేయలేక చతికిల పడుతోంది. ఆరంభ సీజన్ దారుణ వైఫల్యాన్ని డెక్కన్ ఛార్జర్స్ తర్వాతి సీజన్లోనే కప్పు కొట్టి సరిదిద్దుకున్నది. కానీ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 11 సీజన్లుగా అదే వైఫల్య యాత్ర కొనసాగిస్తోంది. మరి 12వ సీజన్లోనైనా బెంగళూర్ ఐపీఎల్ టైటిల్ బెంగ తీరుతుందా? ఆసక్తికరం.
ఆ ఇద్దరిదే భారం : బెంగళూర్ బ్యాటింగ్ భారం పూర్తిగా కెప్టెన్ విరాట్ కోహ్లి, విలక్షణ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌పై పడింది. గత ఐదు సీజన్లలో మూడు పర్యాయాలు విరాట్ కోహ్లి 500 ప్లస్ పరుగులు చేశాడు. 2016 సీజన్లో ఏకంగా నాలుగు సెంచరీలు నమోదు చేశాడు. డివిలియర్స్ సైతం కండ్లుచెదిరే ఇన్నింగ్స్‌లో ఎన్నో ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా డివిలియర్స్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అతడి బ్యాటింగ్ సత్తాపైనా ఎటువంటి అనుమానాలు లేవు. విరామం తర్వాత బ్యాట్ పట్టనున్న డివిలియర్స్ ఈ సీజన్లో తనదైన ముద్ర వేసే అవకావశం లేకపోలేదు. కానీ జట్టుగా స్టార్ ఆటగాళ్లకు సహకారం లభించటం లేదు. స్థానిక ఆటగాళ్ల మద్దతు, నిలకడైన ప్రదర్శన తోడైతే కానీ బెంగళూర్ ఈసారి కనీసం ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేని పరిస్థితి. గ్లోబల్ టీ20 స్టార్ క్రిస్ గేల్‌ను వదులుకోవటం బెంగళూర్‌కు తీరని లోటు. విండీస్ యువ ఆటగాడు షిమ్రోన్ హెట్మయర్ను వేలంలో కొనుగోలు చేసినా.. అతడు గేల్ స్థానాన్నీ భర్తీ చేయలేడు. దేశవాళీలో భారీ హిట్టింగ్తో అందరి దృష్టిని ఆకర్షించిన శివం దుబె మొన్న వేలంలో భారీ మొత్తానికి బెంగళూర్ సొంతమయ్యాడు. సఫారీ స్టార్ హెన్రిస్ క్లాసెన్‌ను ఈ సీజన్లో ఫినీషర్‌గా వాడుకునేందుకు బెంగళూర్ యోచిస్తోంది.
బౌలింగ్ బలహీనత : ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచీ బెంగళూర్‌ను బౌలింగ్ బలహీనత వెంటాడుతోంది. తాజా సీజన్లోనూ ఎటువంటి మార్పు లేదు. పేలవ ప్రదర్శనతో భారత పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు దూరమైన ఉమేశ్ యాదవ్ ఐపీఎల్లో బెంగళూర్ బౌలింగ్ సారథి కావటం పరిస్థితికి అద్దం పడుతోంది. న్యూజిలాండ్ సీమర్ టిమ్ సౌథీ, హైదరాబాదీ సీమర్ మహ్మద్ సిరాజ్ జట్టులో ఉన్నప్పటికీ గత సీజన్లో ఆశించిన ప్రభావం చూపలేకపోయారు. నాథన్ కౌల్టర్‌నైల్, గ్రాండ్‌హౌమె, మార్కస్ స్టోయినిస్లపై బెంగళూర్ ఆధారపడాల్సి ఉంటుంది. యుజ్వెంద్ర చాహల్ బెంగళూర్ ప్రధాన స్పిన్నర్. అతడికి యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ మోయిన్ అలీలు తోడు కానున్నారు. తుది జట్టు కూర్పు సైతం బెంగళూర్‌కు సమస్యగానే మిగలనున్నది.
ప్రాంఛైజీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూర్
సొంత మైదానం :చిన్నస్వామి స్టేడియం
యజమాని : రాయల్ చాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రయివేటు లిమిటెడ్
గత ప్రదర్శన :2009, 2011, 2106 రన్నరప్
జట్టు : విరాట్ కోహ్లి (కెప్టెన్), అక్షదీప్ నాథ్, మోయిన్ అలీ, యుజ్వెంద్ర చాహల్, నాథన్ కౌల్టర్‌నైల్, కొలిన్ డీ గ్రాండ్‌హౌమె, ఏబీ డివిలియర్స్, శివం దుబె, గుర్కీరత్ సింగ్ మన్, షిమ్రోన్ హెట్మయర్, హిమ్మత్ సింగ్, కుల్వంత్, హెన్రిచ్ క్లాసెన్, మిలింద్ కుమార్, మహ్మద్ సిరాజ్, పవన్ నేగీ, దేవదూత్, పార్దీవ్ పటేల్, ప్రయాశ్ రారు, నవదీప్ షైని, టిమ్ సౌథి, మార్కస్ స్టోయినిస్, వాషింగ్టన్ సుందర్, ఉమేశ్ యాదవ్
అంచనా : బెంగళూర్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకోవటం అనుమానమే!.
ఐపీఎల్లో బెంగళూర్‌కు తప్ప మరోక ప్రాంఛైజీకి ఆడబోను. ఇప్పుడు, ఎప్పుడు, ఎప్పటికైనా బెంగళూరే. ఐపీఎల్లో బెంగళూర్ వైఫల్యానికి చెత్త నిర్ణయాలే కారణం. మేం బాగానే ఆడాం కానీ, అదృష్టం కలిసి రాలేదని చెప్పను. కీలక మ్యాచుల్లో ప్రత్యర్థి మెరుగైన నిర్ణయాలు తీసుకున్నది. ఆ పని బెంగళూర్ చేయలేదు. అక్కడే రాయల్ చాలెంజర్స్ వైఫల్యం ఉండిపోయింది. ప్రపంచకప్ ప్రణాళికలోని ఆటగాళ్లు ఐపీఎల్లో పని ఒత్తిడి, ఫిట్నెస్ చూసుకోవాలి. అది వారి బాధ్యత. నా శరీర తత్వానికి నేడు 10, 12, లేదా 15 మ్యాచులు ఆడగలను. మరో ఆటగాడు నా కంటే ఎక్కువ లేదా తక్కువ ఆడగలడు. ప్రపంచకప్ ప్రణాళికలోని ఆటగాళ్లందరూ నిర్దిష్ట సంఖ్యలో ఇన్ని మ్యాచులే ఆడాలనే నిబంధన పెట్టలేం. ప్రపంచకప్‌లో ఆడాలని అందరికీ ఉంటుంది. అందుకోసం ఫిట్నెస్ కాపాడుకోవాల్సిన బాధ్యత ఆటగాళ్లదే'
- విరాట్ కోహ్లి