Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండేండ్ల నిషేధం తర్వాత తిరిగొచ్చిన వేళ చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. నాన్నల జట్టుగా విమర్శలొచ్చినా.. విజేతల జట్టుగా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో టైటిల్ నిలుపుకున్న ఏకైక జట్టు చెన్నై. మరోసారి సూపర్ కింగ్స్ ఆ ప్రదర్శనను పునరావృతం చేయగలదా?
9 సీజన్లు. మూడు సార్లు విజేత. నాలుగు సార్లు రన్నరప్. మరో రెండు సార్లు సెమీఫైనలిస్ట్. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఈ గణాంకాలు చెబితే చాలు, ఆ జట్టు పేరు ఎవరైనా చెబుతారు. ఆటగాళ్లు, అభిమానులు భావోద్వేగంతో ముడిపడిన అరుదైన ప్రాంఛైజీ సైతం అదే. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ సీజన్ ఏదైనా, జట్టు ఎలా ఉన్నా టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉంటుంది. ఇప్పుడూ అదే సీన్.
టైటిల్ నిలుపుకోవటంపై ధోని గురి
నవతెలంగాణ క్రీడా విభాగం
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్. రెండేండ్ల నిషేధం తర్వాత భావోద్వేగాల నడుమ సూపర్ కింగ్స్ మళ్లీ లీగ్‌లోకి అడుగుపెట్టింది. ఎప్పట్లాగే చెన్నై సూపర్ కింగ్స్ తన కీలక ఆటగాళ్ల బృందాన్ని తిరిగి తెచ్చుకున్నది. కానీ, ఈసారి అలా చేసినందుకు చెన్నైపై విమర్శలే ఎక్కువగా వినిపించాయి. వయసు మళ్లిన ఆటగాళ్లతో పొట్టి పోరులో చెన్నై పోటీతత్వం ఎలా చూపిస్తుందని విమర్శించారు. ఒక దశలో కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ (న్యూజిలాండ్) ఈ ప్రశ్నలపై చిరాకు పడ్డాడు. తర్వాత సోషల్ మీడియాలో వివరణ ఇచ్చుకున్నాడు. 2018లో చెన్నై సూపర్ కింగ్స్ విజయ గాథ, ఐపీఎల్ సహా ఏ ఆటలోనైనా రాణించినంత కాలం వయసు అడ్డంకి కాదు మరోసారి నిరూపితమైంది. గత ఏడాది జట్టునే చెన్నై తాజా సీజన్‌కు కొనసాగిస్తోంది. ఆటగాళ్ల బదిలీలో చెన్నైకి మూడేండ్లు ప్రాతినిథ్యం వహించిన సీమర్ మోహిత్ శర్మను కొనుగోలు చేసింది. వరుసగా రెండేండ్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన చరిత్ర కలిగిన చైన్నై.. మళ్లీ ఇప్పుడు ఆ ప్రదర్శన పునరావృతం చేయగలదని విజిల్ పొడు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ధోని ఫ్యాక్టర్ : ఎం.ఏ చిదంబరం స్టేడియం. గ్యాలరీలు అన్నీ అభిమానులతో నిండిపోయి ఉన్నాయి. అప్పుడే ఎం.ఎస్ ధోని మైదానంలోకి అడుగుపెడుతున్నాడు. ధోని.. ధోని.. ధోని అంటూ చిదంబరం స్టేడియం మహి నామస్మరణలో మార్మోగింది. స్టేడియం చుట్టూ ధోని తరంగాలే ప్రవహిస్తున్నాయి. అయితే, ఈ సన్నివేశం చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించినది కావటం విశేషం. అంతర్జాతీయ మ్యాచుల ప్రాక్టీస్ సెషన్లకు సైతం హాజరయ్యేందుకు ఆసక్తి చూపని అభిమానులు.. ధోనిని చూసేందుకు చిదంబరం స్టేడియానికి బారులు తీరారు. ప్రాక్టీస్ సెషన్లోనే ఇలా ఉందంటే, ఇక మార్చి 23న ఆరంభ మ్యాచ్‌లో ధోని మేనియా ఎలా ఉండబోతుందో ఊహించగలమా?!. ఇక వ్యూహాత్మకంగా చెన్నై సూపర్ కింగ్స్ అతి పెద్ద బలం కెప్టెన్ ధోని. 37 ఏండ్ల ధోని చెన్నై తరఫున పెద్దగా నిరాశపరిచిన చరిత్ర లేదు. గత సీజన్లోనూ ధోని గొప్పగా రాణించాడు. ఒత్తిడి సమయాల్లో ప్రశాంతమైన నిర్ణయాలు, వెలకట్టలేని అనుభవం ధోనిని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. బ్యాట్స్‌మన్‌గా, వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా, మెంటర్‌గా ధోని బహుముఖ పాత్రాభినయం చేయనున్నాడు.
కూర్పు కుదిరింది! : ఐపీఎల్ హీరో సురేశ్ రైనా చెన్నై తరఫున పూనకమొచ్చినట్టే బాదుతాడు. గత సీజన్లలో రైనా జోరు అందరూ చూసినదే. డుప్లెసిస్, షేన్ వాట్సన్, శామ్ బిల్లింగ్స్ సహా డ్వేన్ బ్రావోలు చెన్నైకి తరగని వన్నె. కేదార్ జాదవ్, అంబటి రాయుడు, రవీంద్ర జడేజాలు జట్టుకు సమతూకం తీసుకొస్తారు. సఫారీ యువ సీమర్ లుంగి ఎంగిడి, ఇమ్రాన్ తాహీర్, దీపక్ చాహర్, కరణ్ శర్మలు చెన్నై బౌలింగ్‌ను పటిష్టం చేశారు. స్థానిక ప్రతిభావంతులు, ఐపీఎల్లో తిరుగులేని ఆటగాళ్లు, వరల్డ్ క్రికెట్లో అనుభవం ఉన్న స్టార్స్.. ఇలా చెన్నై పరిపూర్ణ జట్టుగా రూపొందింది.
ప్రాంఛైజీ : చెన్నై సూపర్ కింగ్స్
కెప్టెన్ :మహేంద్రసింగ్ ధోని
యజమాని : ఎన్. శ్రీనివాసన్
సొంత మైదానం : ఎంఏ చిదంబరం స్టేడియం
జట్టు : ఎం.ఎస్ ధోని (కెప్టెన్), సురేశ్ రైనా, డుప్లెసిస్, మురళీ విజరు, రవీంద్ర జడేజా, శామ్ బిల్లింగ్స్, మిచెల్ శాంట్నర్, డెవిడ్ విల్లే, డ్వేన్ బ్రావో, షేన్ వాట్సన్, లుంగి ఎంగిడి, ఇమ్రాన్ తాహిర్, కేదార్ జాదవ్, అంబటి రాయుడు, హర్బజన్ సింగ్, దీపక్ చాహర్, కెఎం ఆసిఫ్, కరణ్ శర్మ, దృవ్ శోరె, జగదీశన్, షార్దుల్ ఠాకూర్, మోను కుమార్, చైతన్య బిష్ణోరు, మోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్.
గత ప్రదర్శన : 2010, 2011, 2018 చాంపియన్
అంచనా : ఫైనలిస్ట్!. టైటిల్ రేసులో నిలిచిన జట్లలో ముందున్నది.