Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐపీఎల్ అతి పెద్ద జట్లలో ముంబయి ఇండియన్స్ ఒకటి. టైటిళ్లు, జట్టు విలువ, మార్కెట్ బ్రాండ్ ఇలా ఏ కోణంలో చూసినా ముంబయి ఇండియన్స్ ముందు వరుసలోనే ఉంటోంది. ఐపీఎల్లో బ్లాక్‌బస్టర్ జట్టుగా పేరున్నా, నిలకడ లేమి ముంబయి ఇండియన్స్‌ను టైటిల్ ఫేవరెట్‌గా నిలిపేందుకు అడ్డుగా నిలుస్తోంది. నిలకడలేమి, అంచనాలకు అందని ముంబయి ఐపీఎల్లో నాల్గో టైటిల్ పట్టేస్తుందా? ఆసక్తికరం.
నవతెలంగాణ క్రీడా విభాగం
గణాంకాల పరంగా ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ సరసన ముంబయి ఇండియన్స్ నిలబడుతుంది. చెన్నై మూడు టైటిళ్లు నెగ్గగా, ముంబయి సైతం మూడు సార్లు విజేతగా నిలిచింది. కానీ చెన్నై స్థాయి స్టార్డమ్ ముంబయి ఎన్నడూ పొందలేదు. ఆడిన తొమ్మిది సీజన్లలో ప్రతి సారీ సెమీఫైనల్స్/ప్లే ఆఫ్స్‌కు చేరిన రికార్డు ముంబయి సొంతం. కానీ 2017లో విజేతగా నిలిచిన ముంబయి, 2018లో అసలు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేదు. ఈ నిలకడ లేమి ముంబయిని టైటిల్ రేసులో వెనుకంజలో నిలిపినా, అదే అంచనాలకు అందని తత్వం ముంబయిని మూడు సార్లు విజేతగా నిలిపిన విషయాన్ని మరిచిపోలేం!. తొలి దశ మ్యాచుల్లో చెత్తగా ఆడినా, లీగ్ సాగుతున్న కొద్దీ ప్లే ఆఫ్స్ రేసుతో ముంబయి జోరందుకోవటం చూశాం. ప్లే ఆఫ్స్‌లో ముంబయి మరింత విధ్వంసకర ప్రదర్శన చేయగలదు. ఈ సీజన్లోనూ ముంబయి నుంచి అదే ఆశించగలం.
ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి ముంబయి ఇండియన్స్ జట్టు సమ తూకంగా కనిపిస్తుంది. విదేశీ స్టార్ ఆటగాళ్లు, దేశవాళీ మెరుపులతో ముంబయి తుది జట్టు కూర్పును ఎప్పుడూ ప్రభావశీలంగా ఉంచ గల్గుతోంది. దేశీయ, విదేశీ స్టార్స్ మిక్స్డ్ కాంబినేషన్ ముంబయికి సత్ఫలితాలు ఇచ్చింది. పాండ్య సోదరులు ముంబయి తుది జట్టు కూర్పుకు సమతూకం తీసుస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్‌ల బలం ఉండనే ఉంటుంది. వరల్డ్ బెస్ట్ డెత్ బౌలర్ జశ్‌ప్రీత్ బుమ్రా ముంబయి బౌలింగ్ బలాన్ని ఎన్నో రెట్లు పెంచగలడు.
యువ జోరు కలిసొచ్చేనా? : ఈ ఏడాది ఆటగాళ్ల బదిలీలో బెంగళూర్ నుంచి క్వింటన్ డికాక్‌ను ముంబయి తెచ్చుకున్నది. ప్రతిభావంతుడైనా గత సీజన్లో డికాక్ నిరాశపరిచాడు. ముంబయికి రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్ ఓపెన్ చేయనున్న డికాక్ ఏ మేరకు రాణిస్తాడనేది ప్రశ్నార్థకం. గాయంతో ఆసీస్ సిరీస్‌కు దూరమైన హార్దిక్ పాండ్య ప్రదర్శనపై అందరిలోనూ ఆసక్తి రేగుతోంది. అన్న కృనాల్ పాండ్యతో కలిసి హార్దిక్ ఎన్నో సార్లు ముంబయి గెలిపించాడు. గత సీజన్లో మిస్టరీ స్పిన్నర్ మయాంక్ మార్కండేతో ప్రత్యర్థులను హడలెత్తించిన ముంబయి, ఈ సారీ కొత్త అస్త్రం ప్రయోగిస్తుందేమో చూడాలి.
భావోద్వేగ కోనుగోలు : సీజన్ 12 ఆటగాళ్ల వేలంలో అందరి కంటే ముందుగా దుకాణం సర్దేసిన ప్రాంఛైజీ ముంబయి. కానీ గతంలో ముంబయి మ్యాచ్ విన్నర్ లసిత్ మలింగపై ఎవరూ ఆసక్తి చూపకపోవటంతో, ముంబయి ముందుకొచ్చింది. ప్రపంచ క్రికెట్ ఆల్‌టైమ్ దిగ్గజ ఆల్రౌండర్లలో ఒకడు యువరాజ్ సింగ్. వేలంలో రెండు సార్లు అతడిపై ఎవరూ ఆసక్తి చూపలేదు. మూడోసారీ యువీ పేరు వచ్చేసరికి, ముంబయి అతడినీ కనీస ధరకు ( రూ.1 కోటి) తీసుకున్నది. ఈ భావోద్వేగ కొనుగోళ్లు ముంబయికి ఏ మేరకు ఉపయోగకరం అనేది ఈ సీజన్ ఫలితమే తేల్చాలి.
ప్రాంఛైజీ : ముంబయి ఇండియన్స్
కెప్టెన్ : రోహిత్ శర్మ
సొంత మైదానం : వాంఖడే స్టేడియం
యజమాని : ముఖేశ్ అంబాని
జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), ఎవిన్ లెవిస్, క్వింటన్ డికాక్, అన్మోల్ప్రీత్ సింగ్, సూర్యకుమార్ యాదవ్, సిద్దేశ్ లాడ్, ఇషాన్ కిషన్, ఆదిత్య తారె, హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్య, బెన్ కట్టింగ్, యువరాజ్ సింగ్, పంకజ్ జైస్వాల్, మయాంక్ మార్కండె, రాహుల్ చాహర్, అనుకూల్ రారు, జయంత్ యాదవ్, జశ్‌ప్రీత్ బుమ్రా, ఆడం మిల్నె, మిచెల్ మెక్లనగెన్, జేసన్ బెహ్రాన్‌డార్ఫ్, రాసిక్ సలాం, లసిత్ మలింగ, బరిందర్ శరణ్.
గత ప్రదర్శన : 2013, 2015, 2017 విజేత
అంచనా : ప్లే ఆఫ్స్‌కు చేరుకునే వీలుంది. ఫైనల్స్ రేసులో నిలిచినా, మూడు లేదా నాల్గో స్థానానికి పరిమితం కావచ్చు!.
ఈ సీజన్లో ముంబయి ఇండియన్స్‌కు అన్ని మ్యాచులకు నేనే ఓపెనర్‌గా వస్తాను. ప్రపంచకప్‌లో నేను ఆడేది ఓపెనర్‌గానే కావటం ఈ నిర్ణయానికి ఓ కారణం. ఓపెనర్‌గానే నేను విజయవంతమయ్యాను, జట్టు అది అర్థం చేసుకున్నది. మిడిల్ ఆర్డర్లో అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. మిడిల్ ఆర్డర్లో ఇన్నింగ్స్ బాధ్యత తీసుకోగల యువరాజ్ సింగ్ ఉన్నాడు. ఈ వెసులుబాటు ఓపెనర్‌గా వచ్చేందుకు ఉపయోగపడింది. ఈ సీజన్లో ప్రతి మ్యాచ్‌లో ముంబయి ఇన్నింగ్స్ నేనే ఆరంభిస్తా'
- రోహిత్ శర్మ, ముంబయి ఇండియన్స్ కెప్టెన్