Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాయల్స్ ఒడిదొడుకుల ప్రయాణం
నవతెలంగాణ క్రీడా విభాగం
అండర్డాగ్ రాజస్థాన్ రాయల్స్ ఆరంభ సీజన్లో అద్భుతం చేసింది. ధోని నాయకత్వంలోని చెన్నైపై నెగ్గి ఐపీఎల్ తొలి విజేతగా నిలిచింది. 2008 నుంచి 2019 వరకూ రాజస్థాన్ ఆ జ్ఞాపకాలతోనే కాలం వెళ్లదీస్తోంది. మరీ చెత్త ప్రదర్శనలు చేయకపోయినా, రెండో టైటిల్ సాధించగల ప్రదర్శన చేయటంలో రాయల్స్ నిలకడగా విఫలమవుతోంది. ఈ సీజన్ అందుకు మినహాయింపుగా ఉండబోదు!
ఆరంభ మెరుపులే రాజస్థాన్ రాయల్స్ చిరునామా అయ్యాయి!. రెండేండ్ల నిషేధానికి ముందు ఐదు సీజన్లలో రాయల్స్ కనీసం ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేదు. గత సీజన్లో నిలకడగా రాణించింది. ప్లే ఆఫ్స్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్ చేతిలో పరాజయం పాలైంది. జోశ్ బట్లర్, బెన్ స్టోక్స్ అండతో ప్లే ఆఫ్స్‌కు చేరిన రాయల్స్.. జాతీయ జట్టు శిబిరంలో చేరేందుకు వారు ప్రాంఛైజీని వీడగా ప్లే ఆఫ్స్‌లో చేతులెత్తేసింది. ఈ సీజన్లోనూ రాయల్స్‌ను అదే సమస్య పీడించబోతున్నది. ప్రపంచ కప్ నేపథ్యంలో కీలక ఆటగాళ్లు ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ప్లే ఆఫ్స్‌కు చేరటం వరకు సవ్యంగానే సాగనున్నా, ఈ తర్వాత రాయల్స్‌కు భంగపాటు తప్పకపోవచ్చు.
కొత్త టాలెంట్ మ్యాజిక్ : వర్థమాన ఆటగాళ్లపై పెట్టుబడి పెట్టడంలో రాజస్థాన్ రాయల్స్ తర్వాతే ఎవరైనా. ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచీ తాజాగా 2019 వేలంలోనూ రాజస్థాన్ రాయల్స్ దృష్టి వర్థమాన ఆటగాళ్లపై, భవిష్యత్‌లో రాణించగలిగే ప్రతిభ ఉన్న ఆటగాళ్లపైనే పడింది. స్టార్ క్రికెటర్ల వైపు రాజస్థాన్ ఎన్నడూ పరుగు తీయలేదు. మొన్న వేలంలోనూ ఆసీస్ యువ సంచలనం ఆష్టన్ టర్నర్‌ను కొనుగోలు చేసింది. భారత్‌పై మొహాలి వన్డేకు ముందు టర్నర్ ముగింపు నైపుణ్యం ప్రపంచా నికి తెలియదు. కానీ రాయల్స్ టర్నర్‌పై ముందుగానే పెట్టుబడి పెట్టింది. ఈ సీజన్లో ఆష్టన్ టర్నర్ ఎంత కీలక ఆటగాడు కానున్నాడో తెలియనిది కాదు.
జట్టు బాగుంది : షేన్ వార్న్ మరోసారి సలహాదారుగా రావటం రాయల్స్‌కు గొప్ప బలం. వ్యూహకర్తగా, యువ ఆటగాళ్లలో ఆత్మ విశ్వాసం నింపటంలో వార్న్ నేర్పరి. కెప్టెన్ అజింక్య రహానెకు ఐపీఎల్ మంచి రికార్డుంది. ఐపీఎల్ మెరుపులతో వరల్డ్‌కప్ బెర్త్ ఆశిస్తోన్న రహానెకు ఇది వ్యక్తిగతంగానూ కీలకం. సంజూ శాంసన్, మనన్ వోమ్రా, శ్రేయాష్ గోపాల్, రాహుల్ త్రిపాఠిలు ప్రతిభావంతులు. ఈ కుర్రాళ్లు మరోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. ఇంగ్లాండ్ ఆటగాళ్లు బెన్ స్టోక్స్, జోశ్ బట్లర్, జోఫ్రా ఆర్చర్లు ప్రధాన పాత్ర పోషించనున్నారు. బంతితో విండీస్ యువ మెరుపు ఒసేన్ థామస్, ధవల్ కులకర్ణితో పాటు జైదేవ్ ఉనద్కత్ కీలకం కానున్నారు. కృష్ణప్ప గౌతమ్, శ్రేయాష్ గోపాల్, ఇశ్ సోధిలతో స్పిన్ విభాగం బలోపేతంగా ఉన్నది.
ప్రాంఛైజీ : రాజస్థాన్ రాయల్స్
కెప్టెన్ : అజింక్య రహానె
సొంత మైదానం :
సవారు మాన్సింగ్ స్టేడియం
యజమాని : మనోజ్ బాదలె,
జట్టు : అజింక్య రహానె (కెప్టెన్), కృష్ణప్ప గౌతమ్, సంజూ శాంసన్, మనన్ వోహ్రా, శ్రేయాష్ గోపాల్, ఆర్యమాన్ బిర్లా, మిథున్, ప్రశాంత్ చోప్రా, స్టువర్ట్ బిన్నీ, రాహుల్ త్రిపాఠి, బెన్ స్టోక్స్, స్టీవ్ స్మిత్, జోశ్ బట్లర్, ఆష్టన్ టర్నర్, లివింగ్‌స్టోన్, జోఫ్రా ఆర్చర్, జైదేవ్ ఉనద్కత్, వరుణ్ అరోన్, ఒసేన్ థామస్, ఇశ్ సోథి, ధవల్ కులకర్ణి, మహిపాల్, శశాంక్ సింగ్, రియాన్ పరాగ్, శుభమ్ రంజానె.
గత ప్రదర్శన : 2008 చాంపియన్
అంచనా :
కనీసం ప్లే ఆఫ్స్‌కు చేరవచ్చు. ద్వితీ యార్థంలో కీలక ఆటగాళ్ల గైర్హాజరీతో మరోసారి కప్పుకు రాయల్స్ ఎంతో దూరంలోనే నిష్క్రమించనున్నది.