Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడో టైటిల్‌పై కోల్‌కత కన్ను
నవతెలంగాణ క్రీడా విభాగం
కోల్‌కత నైట్‌రైడర్స్‌కు దక్కిన బ్లాక్‌బస్టర్ ఆరంభం మరే జట్టుకు దక్కలేదు. బ్రెండన్ మెక్‌కలమ్ విధ్వంసక శతకంతో ఐపీఎల్లో కోల్‌కత ఎంట్రీ అదిరింది. కానీ వరుస సీజన్లలో కోల్‌కత నిరాశపరిచింది. 2009లో ఏకంగా 10 మ్యాచుల్లో పరాజయం పాలైంది. నాయకత్వ మార్పు, ఆత్మవిశ్వాసం లోపం కోల్‌కతను కుంగదీసింది. 2011లో గౌతం గంభీర్ కోల్‌కత నాయకత్వ పగ్గాలు అందుకున్న తర్వాత నైట్‌రైడర్స్ రూపురేఖలు మారిపోయాయి. 2012లో కోల్‌కతకు సునీల్ నరైన్ సైతం తోడయ్యాడు. 2012, 2014లో విజేతగా నిలిచిన కోల్‌కత లీగ్ స్టార్ జట్లలో ఒకటిగా చేరిపోయింది. గత సీజన్లో గంభీర్ జట్టును వీడిన తర్వాత కోల్‌కత కథ మళ్లీ మొదటికొచ్చింది. కాగితంపై కోల్‌కత బలంగానే కనిపిస్తోన్నా.. కచ్చితంగా టైటిల్ కొట్టగల దీమా కొరవడింది. కానీ అన్ని విభాగాల్లో బలమైన కోల్‌కత ఎప్పుడూ ప్రమాదకరమే!
ఐపీఎల్లో ఓ విశిష్ట లక్షణం కనిపిస్తుంటుంది. స్టార్ ఆటగాళ్లు, విధ్వంసక వీరులను నమ్ముకున్న ఏ జట్టు విజేతగా నిలువలేదు. వీరోచిత విన్యాసాలతో పాటు నిలకడగా రాణించగల ఆటగాళ్లు, సమష్టి తత్వంతోనే ఐపీఎల్లో విజయాలు సాధించగలమని గత చాంపియన్స్ నిరూపించాయి. ఆరంభ సీజన్లలో కోల్‌కత సైతం స్టార్స్‌ను నమ్ముకున్నది. విధ్వంసక ఆటగాళ్లు అభిమానులను స్టేడియానికి రప్పించగలరు, ఒకట్రెండు మ్యాచుల్లో ఒంటిచేత్తో విజయాల్ని సాధించి పెట్టగలరు. కానీ సమష్టితత్వమే టైటిల్‌ను అందించగలదు అని 2012కు గానీ కోల్‌కతకు తట్టలేదు. తక్కువ ధరకే కోల్‌కతకు దక్కినా.. కోల్‌కతకు వెల కట్టలేని విజయాలు అందించాడు గౌతం గంభీర్. జట్టులో స్థైర్యాన్ని నింపాడు, ఆటగాళ్లలో గెలుపు కసి రగిల్చాడు. వనరులను తెలివిగా వినియోగించటంలో, దూకుడుగా నిర్ణయాలు తీసుకోవటంలో తన మార్క్ చూపించాడు. అశేష అభిమానుల నడుమ ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతను కొట్టడం అంత సులువు కాదని ప్రత్యర్థులకు గట్టి సందేశమే పంపాడు. కానీ గంభీర్ లేని కోల్‌కత సేనాని లేని సైన్యం అనే చెప్పాలి. కాగితంపై కోల్‌కత బలం ఏమాత్రం తగ్గలేదు. బలమైన నాయకత్వంతో కోల్‌కత ఇప్పటికీ టైటిల్ నెగ్గగలదు.
జట్టు భలే : ప్రతీ సీజన్లోనూ కోల్కతది బలమైన జట్టు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్లో ఆ జట్టుకు తిరుగులేని వనరులున్నాయి. బంతితోనూ నైట్‌రైడర్స్ ప్రమాదకారి. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, సునీల్ నరైన్ కోల్‌కతకు కొండంత బలం. స్పిన్ మ్యాజిక్‌తో మ్యాచ్‌ను ఏ దశలోనైనా మలుపు తిప్పగల సమర్థుడు నరైన్, గత సీజన్లలో బ్యాట్‌తో పించ్ హిట్టర్ అవతారం ఎత్తాడు. ఒత్తిడి లేని బ్యాటింగ్‌తో ఎడాపెడా బౌండరీలు బాదటంలో నరైన్ సక్సెస్ అయ్యాడు. విండీస్ ఆల్‌రౌండర్లు రస్సెల్, బ్రాత్వేట్లు బంతితో, బ్యాట్‌తో ప్రత్యర్థుల నుంచి మ్యాచ్ ఎంత వేగంగా లాగేసుకుంటారనేది చెప్పనక్కర్లేదు. క్రిస్ లిన్, రాబిన్ ఉతప్పలతో తిరుగులేని ఓపెనర్లు.. శుభ్‌మన్ గిల్, శివం మవి, కమలేశ్ నాగర్కోటి వంటి యువ ఆటగాళ్లు అదనపు ఆకర్షణ. ప్రపంచకప్ ముంగిట అన్ని జట్టలోనూ విదేశీ ఆటగాళ్లు లీగ్ మధ్యలోనే వెనక్కి వెళ్లనున్నారు. ఈ సమయంలో కోల్‌కత యువ ఆటగాళ్లు కీలక పాత్ర పోషించగలరు. దినేశ్ కార్తీక్, రింకూ సింగ్, నితీశ్ రానా, పియూశ్ చావ్లాలతో మిడిల్ ఆర్డర్ బలోపేతంగా ఉన్నది. ఆసీస్ పేసర్ ల్యూకీ ఫెర్గుసన్ ఈ సీజన్లో కోల్‌కత ప్రధాన సీమర్ బాధ్యతలు చూసుకోనున్నాడు.
ఆల్‌రౌండర్ల అండ : మిగతా జట్లతో కోల్‌కతను ప్రత్యేకంగా ఉంచుతున్న లక్షణం ఆల్‌రౌండర్ల బలం. కోల్‌కతలో వెస్టిండీస్ ఆటగాళ్లు సునీల్ నరైన్, అండ్రూ రస్సెల్, కార్లోస్ బ్రాత్వేట్లు ప్రమాదకర ఆల్‌రౌండర్లు. ఒక్క ఓవర్లోనే వీరు మ్యాచ్ ఫలితాన్ని శాసించగలరు. తుది జట్టు కూర్పులో విలక్షణ, బ్యాటింగ్ ఆర్డర్లో మెరుపు నిర్ణయాలు కోల్‌కత ప్రత్యేకత నిలుపుతున్నాయి. దినేశ్ కార్తీక్‌లో కెప్టెన్‌గా తనదైన ముద్ర వేయాలనే తపన కనిపిస్తోంది. ఇది కోల్‌కతకు సానుకూలాంశం.
ప్రాంఛైజీ :కోల్‌కత నైట్‌రైడర్స్
కెప్టెన్ :దినేశ్ కార్తీక్
సొంత మైదానం :ఈడెన్ గార్డెన్స్
యజమాని :షారుక్ ఖాన్, జుహి చావ్లా, జై మెహత
జట్టు : క్రిస్ లిన్, రాబిన్ ఉతప్ప, శుభ్‌మన్ గిల్, నితీశ్ రానా, రింకూ సింగ్, దినేశ్ కార్తీక్ (కెప్టెన్), నిఖిల్ నాయక్, అండ్రూ రస్సెల్, జో డెన్లీ, శ్రీకాంత్ ముండె, కార్లోస్ బ్రాత్‌వేట్, పియూశ్ చావ్లా, కుల్దీప్ యాదవ్, సునీల్ నరైన్, కమలేశ్ నాగర్కోటి, శివం మవి, పృథ్వీ రాజ్, హ్యారీ గుర్నె, అన్రిచ్, ఫెర్గుసన్.
గత ప్రదర్శన :2012, 2014 చాంపియన్
అంచనా :
మూడో టైటిల్ రేసులో కోల్‌కత బలమైన పోటీదారు. కప్పు నెగ్గగల సత్తా కోల్‌కత సొంతం. టైటిల్ రేసులో ముందున్నప్పటికీ ఈ ఏడాది ప్లే ఆఫ్స్‌తోనే సరిపెట్టుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.