Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి టైటిల్ వేటలో ఢిల్లీ, పంజాబ్
- ఐపీఎల్ వైఫల్యంలో నిలకడ!
నవతెలంగాణ క్రీడా విభాగం
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అత్యంత నిలకడగా విఫలమవుతున్న జట్లు అనగానే ముందుగా గుర్తొచ్చేది ఢిల్లీ క్యాపిటల్ (డెర్‌డెవిల్స్), కింగ్స్ ఎలెవన్ పంజాబ్. 11 సీజన్లలో ఢిల్లీ ఏనాడూ ఫైనల్స్ మెట్లు ఎక్కలేదు. పంజాబ్ ఓ సీజన్లో టైటిల్ రేసులో నిలిచినా, నిరాశ తప్పలేదు. డివిలియర్స్, సెహ్వాగ్, వార్నర్, దిల్షాన్, మెక్‌గ్రాత్ వంటి స్టార్స్ ఆడినా ఢిల్లీ రాత మారలేదు. పంజాబ్‌దీ అటు ఇటుగా ఇదే కథ. ఓ సీజన్లో మెరిసినా.. మిగతా సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు అష్టకష్టాలు పడింది. జట్టు స్వరూపంలో చెప్పుకోదగిన మార్పులతో సీజన్ 12కు సిద్ధమవుతోన్న పంజాబ్, ఢిల్లీలకు ఇప్పుడైనా ఐపీఎల్ ద్రాక్ష అందుతుందా?!
ఐపీఎల్లో చివరి తొమ్మిది సీజన్లలో నాలుగు సార్లు ఢిల్లీ క్యాపిటల్స్ (డెర్‌డెవిల్స్) పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికే పరిమితమైంది. ప్రాంఛైజీ యాజమాన్యంలో వచ్చిన మార్పు గత సీజన్లో ఢిల్లీ ప్రదర్శనలో మార్పు తీసుకు రాలేదు. ఈ సారి ఏకంగా జట్టు పేరులోనూ మార్పు చేశారు. జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పుడు విఫలం కావటం, ప్రతిభావంతులైనా యువ ఆటగాళ్లలో నిలకడ లోపించటం దశాబ్ద కాలంగా ఢిల్లీని ఐపీఎల్లో సక్సెస్ రుచి చూడని జట్టుగా నిల్పుతున్నాయి. డివిలియర్స్, దిల్షాన్, సెహ్వాగ్, డెవిడ్ వార్నర్ వంటి విధ్వంసక ఆటగాళ్లు ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించినప్పుడూ అద్బుతాలేమీ చోటుచేసుకోలేదు. ఆరంభ సీజన్లో గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచినా, సెమీఫైనల్లో పరాజయం పాలైంది. ఢిల్లీ ఐపీఎల్ విజేతగా నిలిచే స్వర్ణావకాశం 2008లోనే చేజారింది. కానీ టైటిల్ కోసం ఢిల్లీ వేట ఇంకా కొనసాగుతూనే ఉన్నది.
బలమైన టాప్ ఆర్డర్ : ఢిల్లీ క్యాపిటల్స్‌కు బలమైన టాప్ ఆర్డర్ ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వీడిన శిఖర్ ధావన్ సొంత గూటికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ ఓపెనర్ కొలిన్ మన్రోతో కలిసి ధావన్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. టీ20ల్లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడటం మన్రో ఓ లక్షణంగా మార్చుకున్నాడు. ధాటిగా ఆడటంలో ధావన్‌కు మంచి రికార్డుంది. యువ సంచలనం పృథ్వీ షా ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ ఆర్డర్‌ను బరింత బలోపేతం చేస్తున్నాడు. ఇన్నింగ్స్‌ను దూకుడు పట్టాలెక్కిం చటం, చక్కదిద్దడంలో పృథ్వీ దిట్ట. అది ఈ సారి క్యాపిటల్స్‌కు ఉపయోగ పడనున్నది. కానీ మిడిల్ ఆర్డర్ అనుభవ లేమి ఢిల్లీకి ప్రతికూలాంశం. కెప్టెన్ శ్రేయాష్ అయ్యర్, రిషబ్ పంత్ ప్రతిభావంతులు. ఢిల్లీ ఎన్నో తిరుగులేని ఇన్నిం గ్స్‌లు ఆడాడు పంత్. ఈ సీజన్లోనూ ఢిల్లీ పంత్‌పై ఎన్నో అశలు పెట్టుకున్నది. కెప్టెన్సీ దక్కాక మెరుగైన ప్రదర్శన చేసిన అయ్యర్, అదే జోరు కొనసాగించే అవకాశం ఎక్కువ. ఆల్‌రౌండర్లు క్రిస్ మోరీస్, అక్షర్ పటేల్‌లు బంతితో, బ్యాట్‌తో తమ వంతు పాత్ర పోషించాలి. నేపాల్ మణికట్టు స్పిన్నర్ సందీప్ ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ట్రంప్ కార్డ్‌గా బరిలోకి దిగుతున్నాడు. మణికట్టు మాయతో సందీప్ ఏం చేస్తాడనే ఆసక్తి నెలకొన్నది. హనుమ విహారి, సక్సెనా, రూథర్‌ఫర్డ్‌లు ఢిల్లీ కీలకం కానున్నారు. బంతితో ట్రెంట్ బౌల్ట్, కీమో పాల్లు బాధ్యత తీసుకోనున్నారు.
ప్రాంఛైజీ : ఢిల్లీ క్యాపిటల్స్
కెప్టెన్ : శ్రేయాష్ అయ్యర్
సొంత మైదానం : ఫిరోజ్ షా కోట్ల
యజమాని : పార్థు జిందాల్,కిరణ్ కుమార్ గ్రంథి
జట్టు : శ్రేయాష్ అయ్యర్, కొలిన్ మన్రో, పృథ్వీ షా, మంజిత్ కర్లా, శిఖర్ ధావన్, హనుమ విహారి, కొలిన్ ఇంగ్రామ్, రిషబ్ పంత్, అంకుశ్ , క్రిస్ మోరీస్, జలజ్ సక్సెనా, అక్షర్ పటేల్, బి. అయ్యప్ప, రూథర్‌ఫర్డ్, అమిత్ మిశ్రా, రాహుల్ తెవాటియ, సందీప్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అవేశ్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, ఇషాంత్ శర్మ, కీమో పాల్ , నాథూ సింగ్.
గత ప్రదర్శన : 2008, 2009, 2012 ప్లే ఆఫ్స్/ సెమీఫైనలిస్ట్
అంచనా : పటిష్టమైన జట్లతో, మెగా మ్యాచుల్లో నెగ్గుకు రావటం ఢిల్లీకి కష్టమే. పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో మార్పు కోసమే ఢిల్లీ పోరాడాలి!. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్‌కు కోసం అద్భుతం చేయాలి.
2018 సీజన్లో పంజాబ్ ధనాధన్ ఆరంభం కొట్టేసింది. సెహ్వాగ్ పర్యవేక్షణలో ఆడిన తొలి ఆరు మ్యాచుల్లోనే ఐదు విజయాలు సొంతం చేసుకున్నది. ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకున్న జట్టుగా ముందుగానే ముద్ర పడిపోయింది. కానీ తర్వాత ఆడిన ఎనిమిది మ్యాచుల్లో పంజాబ్ ఒక్క విజయంతోనే సరిపెట్టుకున్నది. మెరుపు ఆరంభం, దారుణ వైఫల్యంతో ముగియగా పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. గత సీజన్ దారుణ ఓటమి తర్వాత సెహ్వాగ్ పంజాబ్‌కు దూరమయ్యాడు. చీఫ్ కోచ్ మైక్ హసన్ వెనుదిరిగాడు. బ్రాడ్ హాడ్జ్ ఇప్పుడు పంజాబ్ శిక్షణ బాధ్యతలు తీసుకున్నాడు. ఆటగాళ్ల వేలంలో ఆసక్తికరమైన కొనుగోళ్లు చేసిన పంజాబ్ ఈసారి పరిస్థితిలో మార్పు చూపించే ప్రయత్నమైతే చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నది.
భయంకర బ్యాటింగ్ లైనప్ : పంజాబ్ ప్రధాన బలం విధ్వంసకర బ్యాట్స్‌మెన్. ఓపెనింగ్ నుంచీ ముగింపు వరకూ బంతిని బలంగా బాదగల బ్యాట్స్‌మెన్‌కు కొదవ లేదు. క్రిస్ గేల్, కెఎల్ రాహుల్‌లతో కూడిన ఓపెనింగ్ జోడీ పంజాబ్‌కు బలం, బలహీనత!. గత సీజన్లో రాహుల్ 54.91 సగటుతో 659 పరుగులు చేశాడు. స్ట్రయిక్ రేట్ సైతం కండ్లుచెదిరే రీతిలోనే ఉన్నది. వరుసగా భారీ ఇన్నింగ్స్‌లతో మెరిసినా, సహచరుల సహకారం కొరవడి రాహుల్ ఇన్నింగ్స్‌లు వృథా అయ్యాయి. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న రాహుల్ భారీ ఇన్నింగ్స్‌ల పరంపర కొనసాగించే వీలుంది. గ్లోబల్ టీ20 హీరో క్రిస్ గేల్ సగం నింపిన గన్ వంటి బ్యాట్స్‌మన్. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చెలరేగుతాడో చెప్పటం కష్టం. ఇటీవల భారీ ఇన్నింగ్స్‌లతో అందరి దృష్టిని ఆకర్షించిన గేల్ ఐపీఎల్లో ఏం చేస్తాడనేది ఆసక్తికరం. డెవిడ్ మిల్లర్, మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్‌లతో పంజాబ్ బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ శామ్ కరన్ పంజాబ్‌కు ఈ సీజన్లో ఎక్స్ ఫ్యాక్టర్ కాగలడు. కెప్టెన్ అశ్విన్, ముజీబ్ రెహమాన్‌లు స్పిన్ విభాగాన్ని పటిష్టం చేశారు. మహ్మద్ షమి, అండ్రూ టై, హర్దుస్, అంకిత్ రాజ్‌పుత్‌లో కూడిన పేస్ విభాగం పంజాబ్‌ను గట్టెక్కించగలదు.
ప్రాంఛైజీ : కింగ్స్ ఎలెవన్ పంజాబ్
కెప్టెన్ : రవిచంద్రన్ అశ్విన్
సొంత మైదానం : ఐఎస్ బింద్రా స్టేడియం
యజమాని : ప్రీతి జింటా, నెస్ వాడియా, కరణ్ పాల్, మోహిత్ బర్మన్
జట్టు : కెఎల్ రాహుల్, క్రిస్ గేల్, అండ్రూ టై, మయాంక్ అగర్వాల్, అంకిత్ రాజ్‌పుత్, ముజీబ్ రెహమాన్, కరుణ్ నాయర్, డెవిడ్ మిల్లర్, రవిచంద్రన్ అశ్విన్, హెన్రిక్స్, నికోలస్ పూరన్, వరుణ్ చక్రవర్తి, శామ్ కురన్, మహ్మద్ షమి, సర్ఫరాజ్ ఖాన్, హర్దుస్, అర్షదీప్ సింగ్, దర్శన్ నాల్కండె, ప్రబిసిమ్రన్ సింగ్, అగ్నివేశ్, హర్‌ప్రీత్ బ్రార్, మురుగన్ అశ్విన్.
గత ప్రదర్శన : 2014 రన్నరప్
అంచనా : ఐపీఎల్లో అత్యంత నిలకడగా విఫలమైన జట్లలో పంజాబ్ ముందుంది. ఈ సారి పరిస్థితిలో మార్పు ఉండొచ్చు. పంజాబ్‌కు ఇప్పుడు సమతూకమైన జట్టు ఉంది. మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు. ఈ సారి పంజాబ్ నుంచి మెరుగైన ప్రదర్శన ఆశించవచ్చు.