Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెయిర్‌స్టో, వార్నర్ మెరుపు శతకాలు
- మహ్మద్ నబి స్పిన్ మాయజాలం
- ఛేదనలో చేతులెత్తేసిన బెంగళూర్
- రాయల్స్‌పై సన్‌రైజర్స్ ఘన విజయం
నవతెలంగాణ-హైదరాబాద్
డెవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో శతక మోత. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద. బౌలర్ ఎవరైనా, బంతి ఎలా పడినా.. గమ్యం బౌండరీ లైన్ అయిపోయింది. 12 ఫోర్లు, 7 సిక్సర్లతో బెయిర్‌స్టో ఊచకోత కోయగా.. ఐదేసి ఫోర్లు, సిక్సర్లతో వార్నర్ విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్లు ఇద్దరూ ఆకాశమే హద్దుగా శతకాలు కొట్టగా ఐపీఎల్12లో హైదరాబాద్ రెండో విజయం సాధించింది. స్పిన్నర్ మహ్మద్ నబి (4/11) మాయజాలంతో ఛేదనలో బెంగళూర్ చేతులెత్తేసింది. బెంగళూర్‌కు ఇది హ్యాట్రిక్ ఓటమి.
సన్‌రైజర్స్ సూపర్ విక్టరీ. డెవిడ్ వార్నర్ (100 నాటౌట్, 55 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), జానీ బెయిర్‌స్టో (114, 56 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) ధనాధన్ శతకాలతో ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఓపెనర్ల విధ్వంసక సెంచరీలతో బెంగళూర్‌పై హైదరాబాద్ 118 పరుగుల భారీ విజయం సాధించింది. వార్నర్, జానీ జోరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత 231 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో స్పిన్నర్ మహ్మద్ నబి (4/11), సీమర్ సందీప్ శర్మ (3/19) విజృంభించగా బెంగళూర్ 19.5 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ కోహ్లి (3), ఏబీ డివిలియర్స్ (1),షిమ్రోన్ హెట్మయర్ (9) విఫలమయ్యారు. ఐపీఎల్12లో కోహ్లి జట్టుకు ఇది హ్యాట్రిక్ ఓటమి కాగా, సన్‌రైజర్స్ సొంతగడ్డపై వరుసగా రెండో విజయం సాధించింది. పరుగుల పరంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఐపీఎల్లో ఇదే అత్యుత్తుమ విజయం.
మహ్మద్ నబి మాయ : ఫ్లడ్‌లైట్ల వెలుతురులో బ్యాటింగ్ మరింత సులువు. కోహ్లి, డివిలియర్స్, హెట్మయర్ వంటి భారీ హిట్టర్లతో బెంగళూర్‌లో గట్టి పోరాటమే చేస్తుందని అనుకున్నారు. కానీ కోహ్లి జట్టు పూర్తిగా చేతులెత్తేసింది. ఏ దశలోనూ ఛేదన వైపు కాదు కదా, కనీస పోటీ ఇవ్వలేదు. రెండో ఓవర్లోనే బంతి అందుకున్న అఫ్ఘాన్ స్పిన్నర్ మహ్మద్ నబి (4/11) బెంగళూర్‌ను చావుదెబ్బ కొట్టాడు. తొలుత ఓపెనర్ పార్దీవ్ పటేల్ (11) క్యాచౌట్ అయ్యాడు. తన తర్వాతి ఓవర్లో నబి ఈసారి రెండు వికెట్లు కూల్చాడు. షిమ్రోన్ హెట్మయర్ (9) క్రీజు వదిలి వికెట్ కోల్పోగా, ఏబీ డివిలియర్స్ (1) మిడిల్ వికెట్ లేచిపోయింది. సందీప్ శర్మ ఓవర్లో వార్నర్‌కు కోహ్లి (3) దొరికిపోయాడు. అప్పటికి బెంగళూర్ స్కోరు 30/4. అదే ఓవర్లో మోయిన్ అలీ (2) రనౌట్ అయ్యాడు. ప్రమాదకర శివం దుబె (5)ను నబీ వెనక్కి పంపించాడు. పది ఓవర్లు ముగియకుండానే సన్‌రైజర్స్ చేతిలో బెంగళూర్ పరాజయం ఖాయమైంది. కొలిన్ గ్రాండ్‌హౌమె (37), ప్రయాశ్ బర్మన్ (19) ఓటమి అంతరాన్ని తగ్గించేందుకు తమ కొంతసేపు క్రీజులో నిలిచారు. 19.5 ఓవర్లలోనే బెంగళూర్‌ను కుప్పకూల్చిన సన్‌రైజర్స్ రెండో విజయాన్ని సొంతం చేసుకున్నది. సందీప్ శర్మ మూడు వికెట్లు పడగొట్టాడు.
ఎదురులేని వార్నర్, జానీ : టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు మెగా స్కోరు అందించారు. డెవిడ్ వార్నర్ ఐపీఎల్లో నాల్గో శతకం, జానీ బెయిర్‌స్టో తొలి సెంచరీ కొట్టగా హైదరాబాద్ 231 పరుగులు చేసింది. ఐపీఎల్లో హైదరాబాద్‌కు ఇదే అత్యధిక స్కోరు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ శతక భాగస్వామ్యం (185) నమోదు చేసిన వార్నర్, బెయిర్‌స్టోలు ఐపీఎల్లో కొత్త రికార్డు నెలకొల్పారు. తొలి ఓవర్ నుంచే ఈ జోడీ విధ్వంసం మొదలైంది. మోయిన్ అలీ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే బెయిర్‌స్టో రెండు ఫోర్లు కొట్టగా, వార్నర్ ఓ ఫోర్ బాదాడు. తర్వాతి ఓవర్లో స్ట్రయిట్ సిక్సర్ కొట్టిన వార్నర్.. ప్రమాద హెచ్చరికలు పంపాడు. బెయిర్‌స్టో ఎదురుదాడిలో ముందుండగా.. వార్నర్ సహకరించాడు. బంతి ఎటు పడినా బౌండరీకి తరలించే జోరులో కనిపించిన బెయిర్‌స్టో ఎడాపెడా బౌండరీలు సాధించాడు. ప్రయాశ్ బర్మన్ ఓవర్లో వరుసగా 6, 4, 4.. గ్రాండ్‌హౌమె ఓవర్లో వరుసగా 6, 6... ఉమేశ్ యాదవ్ ఓవర్లో వరుసగా 4, 6, 4లతో రెచ్చిపోయాడు. 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ కొట్టిన బెయిర్‌స్టో.. మరో 24 బంతుల్లోనే ఐపీఎల్లో తొలి సెంచరీ కొట్టాడు. లాంగ్ ఆన్, మిడ్ వికెట్ మీదుగా బెయిర్‌స్టో బాదిన సిక్సర్లు స్టాండ్స్‌లోకి దూసుకెళ్లాయి. బెయిర్‌స్టో నిష్క్రమణ తర్వాత వార్నర్ విధ్వంసం మొదలైంది. 32 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన వార్నర్.. 54 బంతుల్లో మూడెంకల స్కోరు చేరుకున్నాడు. ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లే కొట్టిన వార్నర్.. వికెట్ల నడుమ విలువైన పరుగులు రాబట్టాడు. మహ్మద్ సిరాజ్ వేసిన ఆఖరి ఓవర్లో థర్డ్‌మన్ దిశగా ఫోర్ బాది, వార్నర్ ఐపీఎల్ నాల్గో శతక సంబురాలు చేసుకున్నాడు. విజరు శంకర్ (9) వచ్చీ రాగానే లాంగ్ ఆన్‌లో సిక్సర్ కొట్టి ఔరా అనిపించాడు. రనౌట్‌గా వెనుదిరిగినా.. యూసుఫ్ పఠాన్ (6 నాటౌట్) వార్నర్ తోడుగా భారీ స్కోరులో భాగస్వామి అయ్యాడు.
హైదరాబాద్ ఇన్నింగ్స్ : జానీ బెయిర్‌స్టో (సి) ఉమేశ్ (బి) చాహల్ 114, డెవిడ్ వార్నర్ నాటౌట్ 100, విజరు శంకర్ రనౌట్ (హెట్మయర్/పార్దీవ్) 9, యూసుఫ్ పఠాన్ నాటౌట్ 6, ఎక్స్‌ట్రాలు : 02, మొత్తం : (20 ఓవర్లలో 2 వికెట్లకు) 231.
వికెట్ల పతనం : 1-185, 2-202.
బౌలింగ్ : మోయిన్ అలీ 3-0-29-0, ఉమేశ్ యాదవ్ 4-0-47-0, యుజ్వెంద్ర చాహల్ 4-0-44-1, మహ్మద్ సిరాజ్ 4-0-38-0, ప్రయాశ్ బర్మన్ 4-0-56-0, గ్రాండ్‌హౌమె 1-0-16-0.
బెంగళూర్ ఇన్నింగ్స్ : పార్దీవ్ పటేల్ (సి) మనీశ్ పాండే (బి) మహ్మద్ నబి 11, షిమ్రోన్ హెట్మయర్ (స్టంప్డ్) బెయిర్‌స్టో (బి) మహ్మద్ నబి 9, విరాట్ కోహ్లి (సి) వార్నర్ (బి) సందీప్ శర్మ 3, ఏబీ డివిలియర్స్ (బి) మహ్మద్ నబి 1, మోయిన్ అలీ రనౌట్ (నబి/సందీప్) 2, శివం దుబె (సి) దీపక్ హుడా (బి) మహ్మద్ నబి 5, గ్రాండ్‌హౌమె రనౌట్ (భువి/విజరు) 37, ప్రయాశ్ బర్మన్ (సి) దీపక్ (బి) సందీప్ శర్మ 19, ఉమేశ్ యాదవ్ రనౌట్ (విజరు/రషీద్) 14, మహ్మద్ సిరాజ్ నాటౌట్ 3, యుజ్వెంద్ర చాహల్ (సి) దీపక్ (బి) సందీప్ 1, ఎక్స్‌ట్రాలు : 08, మొత్తం : (19.5 ఓవర్లలో ఆలౌట్) 113.
వికెట్ల పతనం : 1-13, 2-20, 3-22, 4-30, 5-30, 6-35, 7-86, 8-103, 9-109, 10-113.
బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ 3-0-25-0, మహ్మద్ నబి 4-0-11-4, సందీప్ శర్మ 3.5-0-19-3, సిద్దార్థ్ కౌల్ 3-0-16-0, రషీద్ ఖాన్ 4-0-25-0, విజరు శంకర్ 2-0-13-0.
సెంచరీ సాధించటం గొప్పగా ఉంది. వార్నర్‌తో బ్యాటింగ్ అద్భుతమైన భావన. ఇక్కడి అభిమానులు మరింత ప్రత్యేకం. ఉప్పల్ పెద్ద మైదానాల్లో ఒకటి. నిలకడగా స్ట్రైక్ రొటేట్ చేయటంతోనే భారీ స్కోరు సాధ్యపడింది. వార్నర్ ఆరెంజ్ క్యాప్ అందుకోవటం మరింత సంతోషం' - జానీ బెయిర్‌స్టో
- వార్నర్, జానీలు వరుసగా మూడోసారి శతక భాగస్వామ్యం నమోదు చేశారు. ఐపీఎల్ చరిత్రలోనే ఇది ప్రథమం.
- డెవిడ్ వార్నర్‌కు ఐపీఎల్లో ఇది నాల్గో శతకం. కోహ్లి, వాట్సన్‌లు సైతం నాలుగు సెంచరీలు కొట్టారు.
- పరుగుల పరంగా సన్‌రైజర్స్‌కు ఇదే అత్యుత్తమ విజయం. గతంలో 86 పరుగుల విజయాన్ని బెంగళూర్‌పై మెరుగుపర్చుకున్నది.