Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయితోఢీనేడు
ముంబయి : ఐపీఎల్12లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాల జోరుమీదున్నది. సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, రాజస్థాన్ రాయల్స్‌ను, బయట ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. మరో వైపు ఆడిన మూడు మ్యాచుల్లో ముంబయి ఇండియన్స్ రెండింటిలో ఓడింది. ఒత్తిడిలో ఉన్న బెంగళూర్‌పై నెగ్గిన రోహిత్‌సేన.. ఢిల్లీ, పంజాబ్ చేతిలో ఓడిపోయింది. నేడు వాంఖడేలో ఓటమెరుగని చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబయి ఇండియన్స్ తలపడనున్నది. తాజా ఫామ్, జోరు ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. చెరో మూడు టైటిళ్లతో ఐపీఎల్ విజేతల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న చెన్నై, ముంబయిల ముఖాముఖిలో వాంఖడే జట్టుదే పైచేయి. గత ఐదు మ్యాచుల్లో నాలుగింట చెన్నైపై ముంబయి విజయం సాధించింది. నిరుడు సీజన్ ఆరంభ మ్యాచ్‌లో వాంఖడేలోనే ముంబయిపై చెన్నై అపూర్వ విజయం సాధించింది. ఇప్పుడూ అదే ప్రదర్శన పునరావృతం చేయటంపై ధోనిసేన దృష్టి కేంద్రీకరించింది.
ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ బలహీనంగా కనిపిస్తోంది. ఆ జట్టు ఓపెనర్లు రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్‌లపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. జట్టులోని మిగతా బ్యాట్స్‌మెన్ బాధ్యత తీసుకోవాల్సి ఉన్నది. లోతైన బ్యాటింగ్ లైనప్ కాగితంపై కనిపిస్తోన్నా.. మ్యాచ్‌లో అదేమీ ఉపయోగ పడటం లేదు. ఇదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ దుర్బేధ్యంగా కనిపిస్తోంది. కెప్టెన్ ఎం.ఎస్ ధోని రాయల్స్‌పై 46 బంతుల్లో అజేయ 75 పరుగుల ఇన్నింగ్స్ సూపర్ కింగ్స్ శిబిరంలో ఉత్సాహం తీసుకొచ్చింది. గత మ్యాచ్‌లో 25/3 నుంచి ధోని జోరుతో చెన్నై 175/5తో మెరుగైన స్థితిలో నిలిచింది. షేన్ వాట్సన్, సురేశ్ రైనా, డ్వేన్ బ్రావో ఫామ్‌లో ఉన్నారు. బంతితో పేస్ విభాగంలో ముంబయి బలంగా ఉంది. మలింగ ప్రభావం లేకపోయినా.. బుమ్రా ముంబయికి కొండంత బలం. షార్దుల్ ఠాకూర్‌పై చెన్నై ఆధార పడింది. కానీ స్పిన్ విభాగంలో చెన్నై పైచేయి సాధిస్తోంది. ఇమ్రాన్ తాహీర్, హర్బజన్ సింగ్, రవీంద్ర జడేజాలు చెన్నై తరఫున ఎప్పుడైనా మాయ చేయగలరు. కానీ ముంబయి ఆ స్థాయి స్పిన్నర్ లేడనే చెప్పాలి. అన్నింటికి మించి, సూపర్ కింగ్స్ ఎప్పట్లాగే ఇప్పుడూ సమష్టిగా ఆడుతోంది. ప్రత్యేకించి ఓ ఆటగాడు విఫలమైతే, విజయంపై ఆశలు కోల్పోయే స్థితిలో చెన్నై లేదు. ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ హీరోయిక్స్పైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంటోంది. అదే మూడు సార్లు చాంపియన్‌కు అసలు సమస్య. చెన్నైపై మంచి రికార్డున్న ముంబయి సూపర్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్ వేయగలదా? ధోనీసేన వరుసగా నాల్గో విజయం సాధింస్తుందా? చూడాలి.