Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాణించిన సూర్యకుమార్, కృనాల్
- హార్దిక్, పొలార్డ్ మెరుపులు
- ముంబయి ఇండియన్స్ 170/5
ముంబయి : చెన్నై సూపర్‌కింగ్స్‌తో చివరి ఐదు మ్యాచుల్లో నాలుగింట వారిదే ఆధిపత్యం. ఐపీఎల్ ముఖాముఖిలోనూ ముంబయి ఇండియన్స్‌దే పైచేయి. అయితేనేం, హ్యాట్రిక్ విజయాల ఊపుమీదున్న డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జోరు కొనసాగించేందుకు రంగం సిద్ధం చేసుకున్నది. ముంబయి సొంతగడ్డ వాంఖడేలో వరుసగా రెండో విజయంపై కన్నేసింది. ముంబయి ఇండియన్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆ జట్టును స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. ప్రధాన బ్యాట్స్‌మెన్ క్వింటన్ డికాక్ (4), రోహిత్ శర్మ (13) విఫలమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ (59, 43 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), కృనాల్ పాండ్య (42, 32 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులతో ముంబయి 170/5 పరుగులు చేసింది. చివరి రెండు ఓవర్లలో హార్దిక్ పాండ్య (25 నాటౌట్), కీరన్ పొలార్డ్ (17 నాటౌట్) 45 పరుగులు పిండుకుని, ముంబయి ఆశలు నిలిపారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో దీపక్ చాహర్, మోహిత్ శర్మ, ఇమ్రాన్ తాహీర్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావోలు తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఓపెనర్లు విఫలం : టాస్ నెగ్గిన చెన్నై తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నది. సొంతగడ్డపై ముంబయికి మెరుగైన ఆరంభం లభించలేదు. స్టార్ బ్యాట్స్‌మెన్ ఇద్దరూ ఆరంభంలోనే అవుటయ్యారు. క్వింటన్ డికాక్ (4)ను చాహర్, రోహిత్ శర్మ (13)ను జడేజా వెనక్కి పంపారు. యువరాజ్ సింగ్ (4) తాహీర్ బంతికి వికెట్ కోల్పోయాడు. ఆరంభ వికెట్లతో ముంబయి ఇన్నింగ్స్ చప్పగా సాగింది. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ (59), కృనాల్ పాండ్య (42) ముంబయిని నిలబెట్టారు. నాల్గో వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఎనిమిది ఫోర్లు, ఓ సిక్సర్‌తో సూర్యకుమార్ అర్ధ సెంచరీ సాధించగా, ఐదు ఫోర్లు ఓ సిక్స్ కొట్టిన కృనాల్ ఫిఫ్టీ మార్క్ ముందు వికెట్ కోల్పోయాడు.
హార్దిక్ ధనాధన్ : 18 ఓవర్లలో 125/5 స్వల్ప స్కోరుకు పరిమితమ్యే ప్రమాదంలో పడిన ముంబయి ఇండియన్స్‌ను ధనాధన్ ఆటగాళ్లు హార్దిక్ పాండ్య (25 నాటౌట్, 8 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు), కీరన్ పొలార్డ్ (17 నాటౌట్, 7 బంతుల్లో 2 సిక్స్‌లు) పోటీలో నిలిపారు. బ్రావో వేసిన చివరి ఓవర్లో హార్దిక్ రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ కొట్టగా.. పొలార్డ్ మరో సిక్సర్ సంధించాడు. దీంతో చివరి ఓవర్లో 29 పరుగులు వచ్చాయి. అంతకుముందు షార్దుల్ ఠాకూర్ ఓవర్లోనూ ఈ జోడీ 16 పరుగులు పిండుకున్నది. దీంతో ముంబయి ఇండియన్స్ 170 పరుగులు చేసింది.