Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భువి, నబి, కౌల్ మెరుపులు
- ఢిల్లీ క్యాపిటల్స్ 129/8
న్యూఢిల్లీ : సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయం దిశగా దూసుకెళ్తోంది!. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్లు సత్తా చాటారు. భువనేశ్వర్ కుమార్ (2/27), మహ్మద్ నబి (2/21), సిద్దార్థ్ కౌల్ (2/35) వికెట్ల వేటలో విజృంభించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 129/8 పరుగులకే పరిమితమైంది. స్లో వికెట్‌పై క్రమం తప్పకుండా వికెట్లు కూల్చిన సన్‌రైజర్స్ ఢిల్లీని కోలుకోనీయలేదు. కెప్టెన్ శ్రేయాష్ అయ్యర్ (43, 41 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో రాణించాడు. క్రిస్ మోరీస్ (17), అక్షర్ పటేల్ (23 నాటౌట్, 13 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) చివర్లో ఢిల్లీకి గౌరవప్రద స్కోరు అందించారు. వికెట్ నెమ్మదిగా స్పందిస్తున్నా, రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం హైదరాబాద్ ఛేదనను తేలిక చేసే అవకాశం కనిపిస్తోంది!.
నాయకుడు ఒక్కడే : టాస్ నెగ్గిన హైదరాబాద్ మంచు ప్రభావం దృష్ట్యా ఢిల్లీని బ్యాటింగ్‌ను ఆహ్వానించింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు సహా ప్రమాదకర బ్యాట్స్‌మెన్‌ను ఢిల్లీ ఆరంభంలోనే కోల్పోయింది. రెండు ఫోర్లతో దూకుడుగా మొదలెట్టిన పృథ్వీ షా (11) భువనేశ్వర్ బంతికి బౌల్డయ్యాడు. స్పిన్నర్ నబి మాయలో పడిన శిఖర్ ధావన్ (12) క్యాచౌట్‌గా నిష్క్రమించాడు. రిషబ్ పంత్ (5)ను సైతం బుట్టలో వేసుకున్న నబి.. ఢిల్లీ కోరలు పీకాడు. 52/3తో క్యాపిటల్స్ ఒత్తిడిలో పడింది. ఈ సమయంలో కెప్టెన్ శ్రేయాష్ అయ్యర్ (43) ఆదుకున్నాడు. రాహుల్ తెవాటియ (5), కొలిన్ ఇన్‌గ్రామ్ (5)లు సైతం విఫలమయ్యారు. క్రిస్ మోరీస్ (17)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. మూడు ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టిన అయ్యర్.. డెత్ ఓవర్ల సమయానికి వికెట్ కోల్పోయాడు. అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న అయ్యర్ చివర్లో వేగంగా పరుగులు చేస్తాడని ఢిల్లీ ఆశలు పెట్టుకున్నది. అయ్యర్ అవుటైనా.. ఆ లోటు అక్షర్ పటేల్ (23 నాటౌట్) తీర్చాడు. రెండు సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టి ఢిల్లీని 129 పరుగులకు తీసుకెళ్లాడు. అక్షర్ చివరి ఓవర్లోనే రెండు సిక్సర్లు కొట్టాడు. భువి, నబి, కౌల్లు రెండేసి వికెట్లు తీసుకోగా..రషీద్ ఖాన్, సందీప్ శర్మలు చెరో వికెట్ పడగొట్టారు.