Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 13 బంతుల్లో 48 నాటౌట్
- విరుచుకుపడిన విండీస్ వీరుడు
- 206ను ఛేదించిన కోల్‌కత
- బెంగళూర్‌కు ఐదో ఓటమి
వరుస ఓటముల బెంగళూర్ భారీ స్కోరు చేసింది. కెప్టెన్ కోహ్లి (84), డివిలియర్స్ (63) అర్ధ సెంచరీలతో ఆ జట్టు 205 పరుగులు సాధించింది. ఐపీఎల్12లో కోహ్లి జట్టు తొలి విజయం సాధించినట్టే అనిపించింది.
ఛేదనలో కోల్‌కత రేసులో నిలిచినా.. చివర్లో సాధించాల్సిన రన్‌రేట్ 20కి చేరువైంది. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (19) నిష్క్రమణతో కోల్‌కత అవకాశాలు బహు స్వల్పం!. కానీ, అండ్రూ రసెల్ (48 నాటౌట్, 13 బంతుల్లో 1 ఫోర్, 7 సిక్స్‌లు) ఉప్పెనలా విరుచుకుపడ్డాడు. 18 బంతుల్లో 56 పరుగులు చేయాల్సిన దశలో ఏడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో సూపర్‌మ్యాన్ ప్రదర్శన గావించాడు. మంచినీళ్ల ప్రాయంలా సిక్సర్ల వర్షం కురిపించిన రసెల్ బెంగళూర్ ఆశలు ఆవిరి చేశాడు. కోల్‌కత ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
బెంగళూర్ : కోల్‌కత నైట్‌రైడర్స్ 206 ఛేదన. అండ్రూ రసెల్ (48 నాటౌట్) క్రీజులోకి వచ్చే సరికి సమీకరణం 26 బంతుల్లో 68 పరుగులు. విలక్షణ షాట్లతో చెలరేగే కెప్టెన్ దినేశ్ కార్తీక్ నిష్క్రమణ తర్వాత 18 బంతుల్లో మరో 54 పరుగులు చేయాలి. ఈ దశలో కోల్‌కత విజయంపై పెద్దగా నమ్మకం లేదు. కానీ కరీబియన్ విధ్వంసకారుడు రసెల్ అద్భుతం చేశాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో మూడు సిక్సర్లతో 23 పరుగులు పిండుకున్న రసెల్, తర్వాతి ఓవర్లో నాలుగు సిక్సర్లతో 29 పరుగులు సాధించాడు. మరో ఓవర్ ఉండగానే కోల్‌కత గెలుపు ఖాయం చేసుకున్నది. ఓపెనర్ క్రిస్ లిన్ (43), రాబిన్ ఉతప్ప (33), నితీశ్ రాణా (37) రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లి (84, 49 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఏబీ డివిలియర్స్ (63, 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో 205 పరుగులు చేసింది.
ఛేదనలో దూకుడు : భారీ ఛేదనలో పించ్ హిట్టర్ సునీల్ నరైన్ (10) త్వరగా అవుటయ్యాడు. మరో ఓపెనర్ క్రిస్ లిన్ (43, 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాబిన్ ఉతప్ప (33, 25 బంతుల్లో 6 ఫోర్లు) రెండో వికెట్‌కు అర్ద సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. దూకుడుగా ఆడిన ఈ జోడీ ఛేదనలో కోల్‌కతను రేసులో నిలిపింది. ఉతప్ప నిష్క్రమణ తర్వాత లిన్‌కు తోడైన నితీశ్ రాణా (37, 23 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) బాధ్యతాయుతంగా ఆడాడు. పదికిపైగా రన్‌రేట్‌తో పరుగులు చేయటంతో భారీ ఛేదనలో నైట్‌రైడర్స్ రేసులోనే నిలిచింది. వరుస ఓవర్లలో రాణా, కార్తీక్ నిష్క్రమణతో సాధించాల్సిన రన్‌రేట్ భారీగా పెరిగింది. ఈ దశలో అండ్రూ రసెల్ ఊహకందని విన్యాసం చేశాడు. 18 బంతుల్లో 56 పరుగులు చేయాల్సి ఉండగా.. 12 బంతుల్లోనే 55 పరుగులు పిండుకున్నాడు. రసెల్ విధ్వంసానికి బెంగళూర్ ఐదో ఓటమి మూటగట్టుకున్నది.
ఆ రెండు ఓవర్లలో.. : 17 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కత స్కోరు 153/5. అప్పటికే దినేశ్ కార్తీక్ వికెట్ కోల్పోయాడు. మరరో ఎండ్‌లో యువ ఆటగాడు గిల్ (3) ఉన్నాడు. మహ్మద్ సిరాజ్ వేసిన 18వ ఓవర్లో రసెల్ తొలి రెండు బంతులకు పరుగులేమీ చేయలేదు. దీంతో బెంగళూర్ ఆశలు మరింత రెట్టింపయ్యాయి. మూడో బంతిని వైడ్‌గా వేయగా, అది బౌన్సర్ తొలి హెచ్చరిక అయ్యింది. తర్వాతి బంతిని హై ఫుల్‌టాస్‌గా వేయగా రసెల్ దాన్ని సిక్సర్‌గా మలిచాడు. వరుసగా రెండో బంతి బీమర్‌గా సంధించటంతో సిరాజ్ బౌలింగ్ వేసే అవకాశాన్ని కోల్పోయాడు. దీంతో ఆ ఓవర్ స్టోయినిస్ కొనసాగించాడు. స్టోయినిస్ వేసిన తొలి రెండు బంతులకు రసెల్ సిక్సర్లు కొట్టాడు. దీంతో ఆ ఓవర్లో 23 పరుగులొచ్చాయి. చివరి 12 బంతుల్లో 30 పరుగులు చేయాలి. టిమ్ సౌథి వేసిన ఆ ఓవర్లో తొలి బంతికి గిల్ సింగిల్ తీయగా.. తర్వాత రసెల్ ఊచకోత మొదలైంది. వరుసగా 6, 6, 6, 4, 6తో దండయాత్ర చేశాడు. ప్రతి సిక్సర్‌ను స్టాండ్స్‌లోకి పంపిన రసెల్ ఫీల్డర్లనూ ప్రేక్షక పాత్రకు పరిమితం చేశాడు.
కోహ్లి, డివిలియర్స్ జోరు : తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూర్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు పార్దీవ్ పటేల్ (25), విరాట్ కోహ్లి (84) తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించారు. పార్దీవ్ మూడు ఫోర్లు బాదగా, కోహ్లి ఆరంభ నుంచీ దూకుడుగా ఆడాడు. పటేల్ ఎల్బీగా అవుటైనా.. డివిలియర్స్ (63) తోడుగా కోహ్లి చెలరేగాడు. ఏబీ, విరాట్ వికెట్ రెండు వైపులా బౌండరీల మోత మోగించారు. వీరిద్దరి జోరుతో రెండో వికెట్‌కు కోల్‌కత బౌలర్లు సెంచరీ భాగస్వామ్యం సమర్పించుకున్నారు. కోహ్లి రెండు సిక్సర్లు, తొమ్మిది ఫోర్లు కొట్టగా.. డివిలియర్స్ ఐదు ఫోర్లు సహా నాలుగు సిక్సర్లు బాదాడు. చివర్లో ఈ ఇద్దరూ అవుటైనా.. మార్కస్ స్టోయినిస్ (28 నాటౌట్, 13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ ముగింపునిచ్చాడు.
స్కోరు వివరాలు :
బెంగళూర్ ఇన్నింగ్స్ : పార్దీవ్ పటేల్ (ఎల్బీ) రాణా 25, కోహ్లి (సి,బి) కుల్దీప్ 84, డివిలియర్స్ (సి) గిల్ (బి) నరైన్ 63, స్టోయినిస్ నాటౌట్ 28, అలీ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 05, మొత్తం : (20 ఓవర్లలో 3 వికెట్లకు) 205.
వికెట్ల పతనం : 1-64, 2-172, 3-185.
బౌలింగ్ : ప్రసిద్ 3-0-41-0, చావ్లా 4-0-32-0, నరైన్ 4-0-30-1, ఫెర్గుసన్ 2-0-32-0, కుల్దీప్ 4-0-31-1, రాణా 2-0-22-1, రసెల్ 1-0-16-0.
కోల్‌కత ఇన్నింగ్స్ : లిన్ (బి) నేగి 43, నరైన్ (సి) నేగి (బి) షైని 10, ఉతప్ప (సి) సౌథి (బి) నేగి 33, రాణా (సి) క్లాసెన్ (బి) చాహల్ 37, కార్తీక్ (సి) చాహల్ (బి) షైని 19, రసెల్ నాటౌట్ 48, గిల్ నాటౌట్ 3, ఎక్స్‌ట్రాలు : 13, మొత్తం : (19.1 ఓవర్లలో 5 వికెట్లకు) 206.
వికెట్ల పతనం : 1-28, 2-93, 3-108, 4-139, 5-153.
బౌలింగ్ : సౌథి 4-0-61-0, షైని 4-0-34-2, చాహల్ 4-0-24-1, సిరాజ్ 2.2-0-36-0, నేగి 3.1-0-21-2, స్టోయినిస్ 1.4-0-28-0.