Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రసెల్ అర్ధ సెంచరీ
- కోల్‌కత 108/9
చెన్నై : ప్రత్యర్థి ఎవరైనా, గత మ్యాచుల్లో ఎంతటి విధ్వంసం సృష్టించినా.. చెపాక్‌కు వచ్చేసరికి కథ మారాల్సిందేనేమో!. ఇక్కడ అంతా సూపర్ కింగ్స్ స్క్రిప్ట్ ప్రకారమే సాగాలి!. భీకర విజయాలు సాధించిన జోరుమీదున్న కోల్‌కత నైట్‌రైడర్స్ చెపాక్‌లో 108 పరుగులకే పరిమితమైంది. విధ్వంసకారుడు అండ్రూ రసెల్ ( 50 నాటౌట్, 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీతో మెరిసినా, ఆ జట్టు బంతికో పరుగు చేయలేదు. సూపర్ కింగ్స్ యువ సీమర్ దీపక్ చాహర్ (3/20).. స్పిన్నర్లు హర్భజన్ సింగ్ (2/15), ఇమ్రాన్ తాహీర్ (2/21) విజృంభించటంతో కోల్‌కత ఇన్నింగ్స్ చప్పగా సాగింది. వందలోపే ఆలౌట్ అయ్యే ప్రమాదంలో పడినా, రసెల్ అజేయ అర్ధ సెంచరీతో పోరాడాడు. కోల్‌కతకు వంద పరుగుల స్కోరు అందించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత నిర్ణీత ఓవర్లలో 108/9కు పరిమితమైంది.
చాహర్ హల్చల్ : కొత్త బంతితో దీపక్ చాహర్ హల్చల్ చేశాడు. ఇన్నింగ్స్ ఆరో బంతికే క్రిస్ లిన్ (0)ను అవుట్ చేసి కోల్‌కతను దెబ్బకొట్టాడు. తర్వాతి ఓవర్లో టర్బోనేటర్ హర్భజన్ సింగ్ పించ్ హిట్టర్ సునీల్ నరైన్ (6)ను డగౌట్‌కు పంపించాడు. రాబిన్ ఉతప్ప (11), నితీశ్ రానా(0) వరుసగా చాహర్‌కు వికెట్ కోల్పోయారు. తొలి ఐదు ఓవర్లలోనే కోల్‌కత టాప్ ఆర్డర్ నాలుగు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (19, 21 బంతుల్లో 3 ఫోర్లు), శుభ్‌మన్ గిల్ (12 బంతుల్లో 9) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. కానీ స్కోరు వేగం మాత్రం పెంచలేకపోయారు. స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ ఈ జోడీని వరుస ఓవర్లలో సాగనంపాడు. దీంతో 47/6తో కోల్‌కత పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో అండ్రూ రసెల్ (50 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. పియూశ్ చావ్లా (8), కుల్దీప్ యాదవ్ (0), ప్రసిద్ కృష్ణ (0)లు మరో ఎండ్‌లో కూలుతున్నా.. ఓపిగ్గా క్రీజులో నిలిచాడు. సహజశైలికి భిన్నంగా ఆడిన రసెల్.. 44 బంతుల్లో అర్ద సెంచరీ పూర్తి చేశాడు. మూడు సిక్సర్లు, ఐదు ఫోర్లతో కోల్‌కత ఇన్నింగ్స్‌కు కాస్త ఊపిరీ అందించాడు!. మంచు ప్రభావంతో బంతిపై పట్టు చిక్కటం కష్టమైనా.. చెన్నై బౌలర్లు ఆకట్టుకున్నారు. ప్రమాదకర నైట్‌రైడర్స్‌ను స్వల్ప స్కోరుకు పరిమితం చేశారు.