Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెఎల్ అజేయ శతకం
- పంజాబ్ 197/4
ముంబయి : ఇటు రాహుల్, అటు గేల్ ధనాధన్. మధ్యలో నలిగిన ముంబయి బౌలర్లు!. కెఎల్ రాహుల్ (100 నాటౌట్, 64 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ సెంచరీకి తోడు క్రిస్ గేల్ (63, 36 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) సుడిగేల్ ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. పంజాబ్ ఓపెనింగ్ జోడీ విధ్వంసక ఇన్నింగ్స్‌లతో తొలుత ఆ జట్టు 197/4 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. తొలి నాలుగు ఓవర్లలో 20 పరుగులే చేసినా, పంజాబ్ మెరుపు వేగంతో పుంజుకున్నది. ఆరంభంలో గేల్ విశ్వరూపం చూపించగా, చివర్లో రాహుల్ రఫ్పాడించాడు. ముంబయి బౌలర్లలో హార్దిక్ పాండ్య రెండు వికెట్లు తీసుకోగా.. బుమ్రా, బెహెరాన్డార్ఫ్ చెరో వికెట్ పడగొట్టారు. ఛేదనలో ముంబయి ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగుతోంది!. 8.2 ఓవర్లలో ఆ జట్టు 60/2తో ఎదురీదుతోంది. ఓపెనర్ డికాక్, కెప్టెన్ పొలార్డ్ ఆడుతున్నారు.
రాహుల్ శతక జోరు : టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ ఇన్నింగ్స్ చప్పగా మొదలైంది. ఆరంభ ఓవర్లలో ముంబయి బౌలర్లు పరుగులు ఇవ్వలేదు. కట్టుదిట్టమైన బంతులతో క్రిస్ గేల్, కెఎల్ రాహుల్‌లు స్వేచ్ఛగా ఆడేందుకు వీలు లేకుండా చేశారు. కానీ విధ్వంసకారుడు క్రిస్ గేల్ ఎంతోసేపు ఓపిక పట్టలేదు. ఏడు సిక్సర్లు, మూడు ఫోర్లతో వాంఖడేలో వీరంగం చేశాడు. గేల్ సునామీతో స్కోరు వేగంగా ముందుకెళ్లింది. 31 బంతుల్లోనే గేల్ అర్ధ సెంచరీ సాధించాడు. మరో వైపు రాహుల్ పద్దతిగా ఆడాడు. ఆరంభంలో గేల్‌కు సహకరిస్తూనే బౌండరీలపై కన్నేశాడు. 41 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన రాహుల్.. చివరి ఓవర్లలో చెలరేగాడు. హార్దిక్ పాండ్య వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో వరుసగా 6, 4, 6, 6 వరుస బౌండరీలు సాధించాడు. బుమ్రా వేసిన ఆఖరి ఓవర్లో ఓ సిక్సర్ సహా లాంగాఫ్‌లో రెండు పరుగులు తీసి ఐపీఎల్ శతకం పూర్తి చేశాడు. గత సీజన్లో పలు మార్లు శతక ఛాన్స్ కోల్పోయిన రాహుల్, ఈసారి వాంఖడేలో వంద మార్క్ అందుకున్నాడు. డెవిడ్ మిల్లర్ (7), కరుణ్ నాయర్ (5), శామ్ కరన్ (7నాటౌట్)లు రాహుల్‌కు సహకరించారు.
రోహిత్ శర్మ దూరం : ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పంజాబ్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. మంగళవారం ప్రాక్టీస్‌లో రోహిత్ గాయపడ్డాడు. కుడి కాలు కండరాల నొప్పితో రోహిత్ ఇబ్బంది పడ్డాడు. 24 గంటల్లో మెరుగు పడినా, ముందు జాగ్రత్తగా విశ్రాంతి ఇచ్చామని ముంబయి ఇండియన్స్ తెలిపింది. తొలి సీజనల్లో డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్‌కు ఆడిన రోహిత్, 11 సీజన్లుగా ముంబయికి ఆడుతున్నాడు. 11 సీజన్లలో రోహిత్ శర్మ ఓ మ్యాచ్‌కు దూరం కావటం ఇదే ప్రథమం.