Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాణించిన రసెల్
- కోల్‌కత 178/8
కోల్‌కత: యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ (65, 39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఐపీఎల్లో అత్యుత్తమ స్కోరు నమోదు చేశాడు. ఈడెన్ గార్డెన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ అర్ధ సెంచరీతో కదం తొక్కాడు. విధ్వంసక వీరుడు అండ్రీ రసెల్ (45, 21 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మరోసారి బ్యాట్ ఝులిపించాడు. గిల్, రసెల్ ధనాధన్‌తో ఢిల్లీపై తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత నైట్‌రైడర్స్ 178/8 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ మోరీస్, కగిసో రబాడ, కీమో పాల్లు తలా రెండు వికెట్లు పడగొట్టారు.
గిల్, రసెల్ జోరు : టాస్ నెగ్గిన ఢిల్లీ ఆతిథ్య జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. సునీల్ నరైన్‌కు విశ్రాంతి లభించిన వేళ ఓపెనర్‌గా వచ్చిన జో డెన్లీ (0) తొలి బంతికే వికెట్ కోల్పోయాడు. డెన్లీని క్లీన్‌బౌల్డ్ చేసిన ఇషాంత్ ఢిల్లీకి అదిరే ఆరంభాన్ని అందించాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (65)తో కలిసి రాబిన్ ఉతప్ప (28) కీలక భాగస్వామ్యం నిర్మించాడు. ఉతప్ప సహాయక పాత్రకు పరిమితం కాగా, గిల్ చెలరేగాడు. ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో ఢిల్లీ బౌలర్లపై దండెత్తాడు. 34 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదిన గిల్ ప్రమాదకరంగా కనిపించాడు. కానీ ఉతప్ప, నితీశ్ రానా (11) వికెట్లు కూల్చిన ఢిల్లీ బౌలర్లు నైట్‌రైడర్స్ దూకుడుకు అడ్డుకట్ట వేశారు. గిల్ సైతం వికెట్ కోల్పోయే సమయానికి 115/4తో కోల్‌కత బలమైన పునాది వేసుకున్నది. ఈ దశలో అండ్రీ రసెల్ (45) ధనాధన్ షోతో దండిగా పరుగులు పిండుకున్నాడు. నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్లు కొట్టిన రసెల్ ఢిల్లీని భయపెట్టాడు. మోరీస్ ఫుల్ టాస్‌తో రసెల్‌ను అవుట్ చేసినా, పియూశ్ చావ్లా (14 నాటౌట్) రెండు ఫోర్లతో కోల్‌కతకు మరింత బలమైన స్కోరు అందించాడు. ఐపీఎల్12లో తొలి మ్యాచ్ ఆడిన కార్లోస్ బ్రాత్‌వేట్ (6) నిరాశపరిచాడు.