Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్‌లో దారుణ ఓటమి
- టైటిల్ పోరుకు ఒకుహర
- సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్
సింగపూర్ : ఎదురుదాడితో ప్రత్యర్థిపై స్మాష్‌ల వర్షం కురిపిస్తూ, సుదీర్ఘ ర్యాలీలలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తూ షటిల్ కోర్టులో ఆధిపత్యం చెలాయించే సింధు.. సింగపూర్‌లో అనూహ్యంగా చతికిల పడింది. మాజీ వరల్డ్ చాంపియన్ నొజొమి ఒకుహర (జపాన్)తో మరో ఫైట్‌లో దారుణ ఓటమి చవిచూసింది. సెమీ సమరంలో ఏ మాత్రం ఆత్మవిశ్వాసంతో కనిపించని తెలుగు తేజం 7-21, 11-21తో వరుస గేముల్లో పరాజయం పాలైంది. సింధుపై నెగ్గేందుకు ప్రతిసారీ గంటకు పైగా చెమటోడ్చిన జపాన్ అమ్మాయి ఒకుహర, తాజాగా మ్యాచ్‌లో చెమట పట్టకుండానే ఫైనల్లోకి ప్రవేశించింది. నేడు టైటిల్ పోరులో వరల్డ్ నం.1 తైజు యింగ్ (చైనీస్ తైపీ)తో తాడోపేడో తేల్చుకోనున్నది.
ఒత్తిడిలో సింధు! : నూతన బ్యాడ్మింటన్ షెడ్యూల్ ప్రకారం తప్పిదాలు సరిచేసుకునే అవకాశమే దొరకటం లేదు. ఇటీవల సైనా, సింధు వంటి స్టార్స్ బీడబ్లూఎఫ్ బిజీ షెడ్యూల్‌పై చేసిన వ్యాఖ్య. సింగపూర్ ఓపెన్ మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్స్ చూసిన తర్వాత సింధు మాటలు నిజమే అనిపిస్తాయి. డిసెంబర్ వరల్డ్ టూర్ ఫైనల్స్ విజేతగా నిలిచిన సింధు.. అప్పట్నుంచి ఒక్క టోర్నీలోనూ టైటిల్ పోరుకు చేరలేదు. సింగపూర్‌లో క్వార్టర్స్ వరకూ మెరుగ్గానే రాణించినా.. సెమీస్‌లో పూర్తిగా తేలిపోయింది. ఒకుహరతో మ్యాచ్‌లో ఎక్కువ నెట్ దగ్గర తప్పిదాలతో పాటు సైడ్ లైన్స్ వద్ద అవుట్స్‌తో కీలక పాయింట్లు కోల్పోయింది. సుదీర్ఘ ర్యాలీల్లోనూ సహనం కోల్పోయింది. త్వరగా ముగించాలనే తొందరలో ప్రత్యర్థికి ఆధిక్యం కోల్పోయింది. ఏకపక్షంగా సాగిన తొలి గేమ్‌ను సింధు 15 నిమిషాల్లోనే దూరం చేసుకున్నది. 0-4తో తొలి గేమ్ ఆరంభించిన సింధు విరామ సమయానికి 3-11తో నిలిచింది. ద్వితీయార్థంలోనూ సింధు ఆట మారలేదు. 21-7తో ఒకుహర అత్యంత సులువుగా తొలి గేమ్ సొంతం చేసుకున్నది. రెండో గేమ్నూ వెనుకంజలోనే మొదలెట్టినా 4-4తో పుంజుకున్నది. అయినా, విరామ సమయానికి సింధు మరో పాయింట్ మాత్రమే సాధించగల్గింది. వరుసగా ఆరు పాయింట్లు సాధించిన ఒకుహర 11-5తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. సెకండ్ హాఫ్‌లో మరో ఆరు పాయింట్లు సాధించినా, ఎక్కడా ఒకుహరతో పోటీపడలేదు. ఒకుహరతో మారథాన్ మ్యాచులు ఆడిన సింధు.. సింగపూర్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. మరో టోర్నీలో ఫైనల్స్‌కు ముందే నిష్క్రమించింది.
అంతకుముందు క్వార్టర్ఫైనల్లోనూ భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌పై ఒకుహర ఏకపక్ష విజయం సాధించిన సంగతి తెలిసిందే. వరుసగా ఇద్దరు భారత అగ్రతారలపై విజయంతో ఒకుహర సింగపూర్ మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో నిలిచింది.