Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ క్యాపిటల్స్ 155/7
- నిప్పులు చెరిగిన ఖలీల్, భువీ
నవతెలంగాణ-హైదరాబాద్
బ్యాటింగ్ పిచ్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ను సన్‌రైజర్స్ బౌలర్లు స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు. సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న లెఫ్టార్మ్ సీమర్ ఖలీల్ అహ్మద్ (3/30), భువనేశ్వర్ కుమార్ (2/33) నిప్పులు చెరిగారు. సీమర్లు ఐదు వికెట్లతో చెలరేగటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 155/7 పరుగులే చేయగల్గింది. కెప్టెన్ శ్రేయాష్ అయ్యర్ (45, 40 బంతుల్లో 5 ఫోర్లు), కొలిన్ మన్రో (40, 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. కోల్‌కతపై ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన సీనియర్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ (7) సన్‌రైజర్స్‌పై విఫలమయ్యాడు. ఛేదనలో సన్‌రైజర్స్ దూకుడు చూపిస్తోంది. ఓపెనర్లు డెవిడ్ వార్నర్ (12), జానీ బెయిర్‌స్టో (23) జోరుతో ఐదు ఓవర్లలో ఆ జట్టు 36/0 పరుగులతో కొనసాగుతోంది.
ఆ ఇద్దరూ ఆడినా.. : టాస్ నెగ్గిన హైదరాబాద్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నది. బలమైన కోల్‌కతపై వరుస విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు ఆశలతోనే బరిలోకి దిగింది. కానీ పవర్‌ప్లే లోపే ఢిల్లీ ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది. సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న సీమర్ ఖలీల్ అహ్మద్ ఓపెనర్లు ఇద్దరినీ వెనక్కి పంపించాడు. దీంతో 20/2తో ఢిల్లీ దూకుడుకు బ్రేక్ పడింది. కొలిన్ మన్రో (40, 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఎదురుదాడికి దిగాడు. మన్రో మెరుపులతో ఢిల్లీ ఇన్నింగ్స్ మళ్లీ పట్టాలెక్కింది. కానీ అభిషేక్ శర్మ ఓవర్లో మన్రో కథ ముగిసింది. కెప్టెన్ అయ్యర్ (45)తో కలిసి రిషబ్ పంత్ (23, 19 బంతుల్లో 3 ఫోర్లు) నాల్గో వికెట్‌కు 56 పరుగులు జోడించాడు. ఓ ఎండ్‌లో అయ్యర్, మరో ఎండ్‌లో పంత్ ఉండటంతో ఢిల్లీ భారీ స్కోరు ఆశలు నిలిచాయి. 14 ఓవర్ల సమయానికి 114/3తో డెత్ ఓవర్ల బొనంజాకు రంగం సిద్ధం చేసుకున్నది. కానీ భువనేశ్వర్ తెలివిగా అయ్యర్‌ను వెనక్కి పంపించగా, రిషబ్ పంత్ మరోసారి ఒంటిచేత్తో సిక్సర్‌కు ప్రయత్నించి వికెట్ కోల్పోయాడు. నాలుగు బంతుల వ్యవధిలో ఇద్దరు ధనాధన్ బ్యాట్స్‌మెన్‌ను కోల్పోయిన ఢిల్లీ మళ్లీ కోలుకోలేదు. చివరి ఆరు ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి, 41 పరుగులే చేసింది. భువనేశ్వర్ కుమార్ వేసిన చివరి ఓవర్లో కీమో పాల్ (7) సిక్సర్‌తో 13 పరుగులు వచ్చాయి. సర్కిల్ లోపల ముగ్గురు ఫీల్డర్లే (నలుగురు ఉండాలి) ఉండటంతో తొలి బంతి నో బాల్ అయ్యింది. స్పిన్నర్ రషీద్ ఖాన్ (1/22) పొదుపుగా బౌలింగ్ చేశాడు. క్రిస్ మోరీస్ (4), అక్షర్ పటేల్ (14, 11 బంతుల్లో 1 ఫోర్) స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు.