Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధోనీ జట్టుకు ఏడో విజయం
- కోల్‌కతపై సూపర్ విక్టరీ
- తాహీర్ మాయ, రైనా జోరు
కోల్‌కత
ఈడెన్ గార్డెన్లో చెన్నై సూపర్ కింగ్స్ విజిలేసింది!. బలమైన కోల్‌కతను చెపాక్‌ను దెబ్బకొట్టిన సూపర్ కింగ్స్, తాజాగా ఈడెన్లోనూ ఓడించింది. స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ (4/27) మాయజాలంతో తొలుత కోల్‌కత నైట్‌రైడర్స్ 161 పరుగులే చేసింది. ఓపెనర్ క్రిస్ లిన్ (82, 51 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. రసెల్ (10), కార్తీక్ (18) డెత్ ఓవర్లలో విఫలమయ్యారు. ఛేదనలో నైట్‌రైడర్స్ స్పిన్నర్ సునీల్ నరైన్ (2/19) పరీక్షగా నిలిచినా.. 19.4 ఓవర్లలోనే సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సురేశ్ రైనా (58 నాటౌట్, 42 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధ సెంచరీతో కదం తొక్కాడు. రవీంద్ర జడేజా (31 నాటౌట్, 17 బంతుల్లో 5 ఫోర్లు) ధనాధన్ ముగింపునిచ్చాడు. కోల్‌కత బ్యాటింగ్ లైనప్‌ను కట్టడి చేసిన ఇమ్రాన్ తాహీర్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. ఐపీఎల్12లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇది ఏడో విజయం. ఎనిమిది మ్యాచుల్లో ఆ జట్టు ఒక్క ఓటమే చవిచూసింది.
రైనా అర్ధ శతకం : ఛేదనలో సూపర్ హీరో సురేశ్ రైనా (58 నాటౌట్) అజేయ అర్ధ సెంచరీతో చెన్నైకి విజయాన్ని అందించాడు. ఓపెనర్ షేన్ వాట్సన్ (6) స్వల్ప స్కోరుకే వికెట్ కోల్పోయాడు. మరో ఓపెనర్ డుప్లెసిస్ (24)తో కలిసి రైనా ఇన్నింగ్స్ నిర్మించే పనిలో నిమగమయ్యాడు. కానీ స్పిన్నర్ నరైన్ ధాటికి డుప్లెసిస్ వికెట్ కోల్పోయాడు. అంబటి రాయుడు (5) చావ్లా బంతికి బలయ్యాడు. కేదార్ జాదవ్ (20), ఎం.ఎస్ ధోని (16)లు వేగంగా ఆడే ప్రయత్నంలో వికెట్ కోల్పోయారు. దీంతో సూపర్ కింగ్స్ ఒత్తిడిలో పడింది. కానీ రవీంద్ర జడేజా (31 నాటౌట్) ధనాధన్ షో చెన్నై విజయాన్ని సులువు చేసింది. 36 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన రైనా.. సహజశైలిలో తొందరపాటు షాట్లకు వెళ్లలేదు. ఐదు ఫోర్లతో సమీకరణాన్ని సులభతరం చేసిన జడేజా.. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే లాంఛనాన్ని ముగించాడు.
లిన్ మెరిసినా : టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన కోల్‌కతకు ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. పించ్ హిట్టర్ సునీల్ నరైన్ (2) స్వల్ప స్కోరుకే విఫలమయ్యాడు. మరో ఎండ్‌లో ధాటిగా ఆడిన క్రిస్ లిన్ (82) చెన్నై బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. నితీశ్ రానా (21) తర్వాత లిన్‌కు సరైన సహకారం లభించలేదు. ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో విజృంభించినా.. కోల్‌కతకు లిన్ భారీ స్కోరు అందించలేదు. డెత్ ఓవర్లలో ధనాధన్‌కు రంగం సిద్ధం చేసినా.. దినేశ్ కార్తీక్ (18, 14 బంతుల్లో 2 ఫోర్లు), అండ్రీ రసెల్ (10, 4 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) అంచనాలను అందుకోలేదు. శుభ్‌మన్ గిల్ (20 బంతుల్లో 15 పరుగులు) పరిస్థితిని అనుగుణంగా ఆడలేదు. చివరి ఆరు ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన కోల్‌కత కేవలం 39 పరుగులే చేసింది. క్రిస్ లిన్ మెరుపులతో భారీ స్కోరు దిశగా సాగినా.. రసెల్, కార్తీక్‌ను కట్టడి చేసిన చెన్నై బౌలర్లు తమ బ్యాట్స్‌మెన్ పని తేలిక చేశారు. లిన్, రానా, ఉతప్ప (0), రసెల్‌లను తాహీర్ బలిగొన్నాడు. కార్తీక్, గిల్లను సీమర్ ఠాకూర్ వెనక్కి పంపించాడు.