Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో వార్నర్, బెయిర్‌స్టో దూరం
- గెలుపు బాట పట్టాల్సిందే
నవతెలంగాణ-హైదరాబాద్
2016 ఐపీఎల్ విజేత, 2018 రన్నరప్. ఐపీఎల్లో పటిష్టమైన బౌలింగ్ విభాగమున్న జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్12లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటి. అంచనాలకు తగినట్టుగానే ఆరంభంలో హైద రాబాద్ అదరగొట్టింది. తొలి మ్యాచ్‌ను తృటిలో కోల్‌కతకు కోల్పోయినా, తర్వాతి మ్యాచుల్లో భారీ విజయాలు నమోదు చేసి సత్తా చాటింది. కానీ గత మూడు మ్యాచుల్లో దారుణ పరాభవాలు చవిచూసిన సన్‌రైజర్స్ సీజన్ ప్రథమార్థంలో పూర్తిగా నిరాశపరిచింది. ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌పై స్వల్ప ఛేదనల్లో సన్‌రైజర్స్ ఓడిన తీరు మరీ బాధాకరం. తిరుగులేని టాప్ ఆర్డర్ ప్రదర్శనలతో విజయం ముంగిట నిలిచినా.. మిడిల్ ఆర్డర్ పేకమేడలా కూలటం హైదరాబాద్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ. ఈ రెండు పరాజయాలు సొంతగడ్డపైనే ఎదురుకావటం గమనార్హం. లీగ్ దశలో తొలి ఏడు మ్యాచులు ఆడేసిన హైదరాబాద్, మూడే విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో ద్వితీయార్థంలో కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ షరవేగంగా దూసుకెళ్తోంటే.. ముంబయి ఇండియన్స్, కోల్‌కత నైట్‌రైడర్స్ ప్లే ఆఫ్ స్థానాలను వదులుకునేలా కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌లోకి ప్రవేశించా లంటే, హైదరాబాద్ గెలుపు బాట పట్టక తప్పదు.
ఆ ఇద్దరూ దూరమైతే : గత సీజన్లో కానె విలియమ్సన్, శిఖర్ ధావన్‌లపైనే హైదరాబాద్ ప్రధానంగా ఆధారపడింది. ఈ ఏడాది సన్‌రైజర్స్ ఓపెనర్లు డెవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టోలను నమ్ముకున్నది. వీరిద్దరి విధ్వంసక ఇన్నింగ్స్‌లతో హైదరాబాద్ అలవోక విజయాలు సాధించింది. నిలకడ లేమి మిడిల్ ఆర్డర్ వైఫల్యాలతో వరుసగా మూడు మ్యాచులు ఓడింది. డెవిడ్ వార్నర్ 80 సగటుతో 400 పరుగులు చేయగా, జానీ బెయిర్‌స్టో 43.42 సగటుతో 304 పరుగులు బాదాడు. స్పిన్నర్లు రషీద్ ఖాన్ ఆరు వికెట్లు, మహ్మద్ నబి 7 వికెట్లతో ఫర్వాలేదనిపించారు. వార్నర్, బెయిర్‌స్టో జోడీ హైదరాబాద్ ఇన్నింగ్స్‌ల్లో 66 శాతం పరుగులు కొట్టారు. నం.4-11 వరకూ చేసిన పరుగుల శాతం కేవలం 12.75. ఇది ఇలాగే కొనసాగితే హైదరాబాద్ ప్లే ఆఫ్స్ ఆశలు ఎంత త్వరగా వదులుకుంటే అంత మంచిది!. ఎందుకంటే, ఓపెనర్లు డెవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టోలు సన్‌రైజర్స్‌ను ఈ నెలాఖరులోనే వీడనున్నారు. ప్రపంచకప్ సన్నద్ధతలో భాగంగా వార్నర్, జానీలు జాతీయ జట్టు శిబిరాల్లో చేరనున్నారు. బెంగళూర్, ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌లను ఈ ఇద్దరూ లేకుండానే హైదరాబాద్ ఆడాల్సి ఉంటుంది. బెయిర్‌స్టో రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కు ముందే జట్టును వీడనున్నాడు. ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ సైతం బంగ్లాకు వెళ్లనున్నాడు. ప్లే ఆఫ్స్ రేసులో తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్వదేశీ బ్యాట్స్‌మన్‌ను మిడిల్ ఆర్డర్‌ను పటిష్టం చేసుకోవటం మేలు. అందుకు సన్‌రైజర్స్‌కు పెద్దగా సమయం కూడా లేదు.