Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయిపై రాజస్థాన్ గెలుపు
- రాణించిన స్మిత్, రియాన్ పరాగ్
- డికాక్ మెరుపులు వృథా
నాయకుడిగా స్మిత్ రాకతో రాజస్థాన్ సీజనల్లో విజయాల బాట పట్టింది. ఛేదనలో స్మిత్ (59 నాటౌట్, 48 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధ సెంచరీకి తోడు రియాన్ పరాగ్ (43) మెరవటంతో ముంబయి ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముంబయిపై రాజస్థాన్‌కు ఇది వరుసగా నాల్గో విజయం. ఈ సీజన్లో రెండు విజయాలు సహా, గత సీజన్లోనూ ముంబయిపై రాయల్స్ తిరుగులేని విజయాలు సాధించింది.
జైపూర్ :నాయకత్వ మార్పు, ఫలితంలో మార్పు తీసుకొచ్చింది. అజింక్య రహానెపై వేటు వేసిన రాయల్స్.. పాత సారథి స్మిత్‌కు నాయకత్వ పగ్గాలు అందించింది. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే స్మిత్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అజేయ అర్ధ శతకంతో రాయల్స్‌కు సీజన్లో మూడో విజయాన్ని అందించాడు. 163 పరుగుల ఛేదనలో రహానె (12) విఫలమయ్యాడు. స్మిత్‌కు తోడు సంజు (35), పరాగ్ (43)లు రాణించారు. ఓపెనర్ డికాక్ (65, 47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో తొలుత ముంబయి ఇండియన్స్ 162 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (5), కీరన్ పొలార్డ్ (10) విఫలమయ్యారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో మెరిసిన స్టీవ్ స్మిత్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
కెప్టెన్సీ ఇన్నింగ్స్ : ఛేదనలో పవర్‌ప్లేలోనే బ్యాటింగ్‌కు వచ్చిన స్టీవ్ స్మిత్ (59 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అజింక్య రహానె (12) త్వరగా వికెట్ కోల్పోయాడు. సంజు శాంసన్ (35, 19 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి స్మిత్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. బలమైన ముంబయి బౌలింగ్ దాడిని ఎదుర్కొని లక్ష్యం దిశగా ఒక్కో పరుగే జోడించాడు. రాహుల్ చాహర్ ఒకే ఓవర్లో సంజు, బెన్ స్టోక్స్ (0)ను వెనక్కి పంపగా రాయల్స్ ఒత్తిడిలో పడింది. రియాన్ పరాగ్ (43, 29 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ ఇన్నింగ్స్‌తో సాధించాల్సిన రన్‌రేట్‌ను తగ్గించాడు. చివర్లో పరాగ్, ఆష్టన్ టర్నర్ (0) అవుటైనా.. స్టువర్ట్ బిన్ని (7 నాటౌట్) తోడుగా స్మిత్ లాంఛనం ముగించాడు. మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించాడు.
డికాక్ జోరు : తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్‌కు మరోసారి ఆరంభం కలిసి రాలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ (5) నిరాశపరిచాడు. ఓపెనర్ క్వింటన్ డికాక్ (65, 47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫామ్ కొనసాగించాడు. ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో అలరించాడు. సూర్యకుమార్ యాదవ్ (34)తో కలిసి రెండో వికెట్‌కు 98 పరుగులు జోడించిన డికాక్.. భారీ స్కోరుపై ఆశలు పెంచాడు. కానీ విధ్వంసక బ్యాట్స్‌మెన్ కీరన్ పొలార్డ్ (10)ను కట్టడి చేసిన రాయల్స్ తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. హార్దిక్ పాండ్య (23) రెండు జీవనదానాలు పొంది.. రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు. బెన్ కట్టింగ్ (13) చివర్లో ఓ సిక్స్, ఫోర్‌తో ధనాధన్ ముగింపునిచ్చాడు. శ్రేయాష్ గోపాల్ రెండు వికెట్లు పడగొట్టగా, ఆర్చర్ ఓ వికెట్ తీసుకున్నాడు.
ముంబయి ఇన్నింగ్స్ : డికాక్ (సి) స్టోక్స్ (బి) గోపాల్ 65, రోహిత్ శర్మ (సి,బి) గోపాల్ 5, సూర్యకుమార్ (సి) కులకర్ణి (బి) బిన్ని 34, హార్దిక్ పాండ్య (ఎల్బీ) ఆర్చర్ 23, కీరన్ పొలార్డ్ (బి) ఉనద్కత్ 10, బెన్ కట్టింగ్ నాటౌట్ 13, కృనాల్ పాండ్య నాటౌట్ 2,
ఎక్స్‌ట్రాలు : 09,
మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 161.
వికెట్ల పతనం : 1-11, 2-108, 3-111, 4-124, 5-152.
బౌలింగ్ : స్టువర్ట్ బిన్ని 3-0-19-1, కులకర్ణి 3-0-31-0, శ్రేయాష్ గోపాల్ 4-0-21-2, జోఫ్రా ఆర్చర్ 4-0-22-1, జైదేవ్ ఉనద్కత్ 4-0-46-1, రియాన్ పరాగ్ 2-0-17-0.
రాజస్థాన్ ఇన్నింగ్స్ : అజింక్య రహానె (సి) సూర్యకుమార్ (బి) చాహర్ 12, సంజు (సి) పొలార్డ్ (బి) చాహర్ 35, బెన్ స్టోక్స్ (బి) చాహర్ 0, రియాన్ పరాగ్ రనౌట్ 43, టర్నర్ (ఎల్బీ) బుమ్రా 0, బిన్ని నాటౌట్ 7, ఎక్స్‌ట్రాలు : 06,
మొత్తం : (19.1 ఓవర్లలో 5 వికెట్లకు) 162.
వికెట్ల పతనం : 1-39, 2-76, 3-77, 4-147, 5-153.
బౌలింగ్ : హార్దిక్ పాండ్య 4-0-31-0, కృనాల్ పాండ్య 2-0-24-0, లసిత్ మలింగ 3.1-0-27-0, రాహుల్ చాహర్ 4-0-29-3, బుమ్రా 4-0-21-1, మార్కండె 2-0-24-0.