Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ, హైదరాబాద్ ఎలిమినేటర్ నేడు
- సన్‌రైజర్స్ సొంతగడ్డ సానుకూలత!
- క్వాలిఫయర్2పై క్యాపిటల్స్ కన్ను
- రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-విశాఖపట్నం
తొమ్మిది విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్, ఆరు మ్యాచులే నెగ్గిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేటర్‌కు సిద్ధమయ్యాయి. మెరుగైన ప్రదర్శన చేసిన ఢిల్లీ నాకౌట్లో ఆడాల్సి రావటం ఊహించనిదే. సీజన్లో మెరుగైన ప్రదర్శనతో ఆశ్చర్యపరిచిన క్యాపిటల్స్.. తాజాగా విశాఖ విజయంతో టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేసేందుకు చూస్తోంది. వైజాగ్‌లో సొంత అభిమానుల నడుమ ఆడటం హైదరాబాద్‌కు అదనపు బలం. లీగ్ దశలో ఎవరు ఎన్ని నెగ్గినా, ఎంత గొప్పగా ఆడినా ఇక లెక్కలోకి రాదు. నేడు ఎవరు మెరుగైన ప్రదర్శన చేస్తారో వారిదే క్వాలిఫయర్2 బెర్త్. ఓడిన జట్టు దారి ఇంటిముఖం!.
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ సమరాలకు విశాఖ తీరం సిద్ధమైంది. నేడు ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తాడోపేడో తేల్చుకోనున్నాయి. నెగ్గిన జట్టు ఫైనల్లో చోటు కోసం క్వాలిఫయర్2కు వెళ్లనుండగా, ఓడిన జట్టు లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది. ఢిల్లీ, హైదరాబాద్‌లు లీగ్ దశలో చెరో మ్యాచ్‌లో నెగ్గాయి. ఇద్దరూ సొంతగడ్డ మ్యాచులను ఓడిపోయారు. ఇప్పుడు తటస్థ వేదిక వైజాగ్‌లో ఆడుతున్నా.. ఇదీ సన్‌రైజర్స్‌కు రెండో సొంత గడ్డ. మరి ఇక్కడా ఢిల్లీ క్యాపిటల్స్ విజయ ఢంకా మోగిస్తుందా? సొంత అభిమానుల నడుమ సన్‌రైజర్స్ ఈల వేస్తుందా? చూడాలి.
ఎక్స్ ఫ్యాక్టర్ పని చేస్తుందా? : ఈ సీజన్‌కు ముందు ఆటగాళ్ల బదిలీలో హైదరాబాద్‌ను వీడిన బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్. సొంత నగర జట్టు ఢిల్లీ తరఫున హ్యాట్రిక్ అర్ధ సెంచరీలతో 486 పరుగులు చేశాడు. దూకుడుగా ఆడే ధావన్, కుర్రాళ్లకు అవకాశం ఇస్తూ తను బాధ్యత తీసుకుంటున్నాడు. ఇది క్యాపిటల్స్‌కు కలిసొచ్చింది. కానీ పాత జట్టు సన్‌రైజర్స్ రెండు మ్యాచుల్లో శిఖర్ విఫలమయ్యాడు. వరుసగా 12, 7 పరుగులే చేశాడు. చివరి రెండు లీగ్ మ్యాచుల్లోనూ ధావన్ 19, 16 పరుగులకే అవుటయ్యాడు. నేడు ఎలిమినేటర్‌లో అనుభవజ్ఞుడు శిఖర్ ధావన్ నిలిస్తే ఢిల్లీ మెరుగైన స్కోరు సాధించగలదు. కెప్టెన్ శ్రేయాష్ అయ్యర్, రిషబ్ పంత్, పృథ్వీ షా సహా రూథర్‌ఫోర్డ్, ఇన్‌గ్రామ్‌లు ఫామ్‌లో ఉన్నప్పటికీ సవాల్ విసిరే విశాఖ పిచ్‌పై ధావన్ ప్రదర్శన ఢిల్లీకి ఎక్స్ ఫ్యాక్టర్ కాగలదు.
డెవిడ్ వార్నర్ 12 మ్యాచుల్లో 692 పరుగులు, జానీ బెయిర్‌స్టో 10 మ్యాచుల్లో 445 పరుగులతో హైదరాబాద్‌ను రేసులో నిలిపారు. ఇప్పుడు ఆ ఇద్దరూ లేరు. గత సీజన్ హీరో కానె విలియమ్సన్ ఫామ్‌లో లేడు. ఐపీఎల్12లో విలియమ్సన్ సగటు 21.33 మాత్రమే. నాయకుడిగానూ విలియమ్సన్ అంత సక్సెస్ కాలేదు!. కఠిన విశాఖ పిచ్‌పై స్పిన్‌ను సమర్థవంతంగా ఆడగల విలియమ్సన్ ప్రదర్శన హైదరాబాద్‌కు ఎక్స్ ఫ్యాక్టర్. చివరి లీగ్ మ్యాచ్‌లో బెంగళూర్‌పై 43 బంతుల్లో 70 పరుగులు చేసిన విలిమయ్సన్.. అదే జోరు విశాఖలో కొనసాగిస్తే హైదరాబాద్ క్వాలిఫయర్2 ఆడటం ఖాయం. ఓపెనర్లు వృద్దిమాన్ సాహా, మార్టిన్ గప్టిల్‌లు ధనాధన్ ఆరంభాల్ని ఇస్తున్నారు. కానీ నిలకడ లేదు. మనీశ్ పాండే భారీ ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆల్‌రౌండర్లు మహ్మద్ నబి, రషీద్ ఖాన్, విజరు శంకర్లు సన్‌రైజర్స్‌ను ముందంజలో నిలపగలరు.
తేల్చేది వీళ్లే! : విశాఖ భారీ స్కోర్ల పిచ్ కాదు. ఇక్కడ బ్యాట్స్‌మన్ విధ్వంసానికి ఆస్కారం తక్కువ. అలాగని, నిప్పులు చెరిగే బంతులు విసిరినా ప్రయోజనం ఉండదు. నెమ్మదిగా బంతులేసినా, బంతిని టర్న్ చేసినా ప్రత్యర్థిని బోల్తా కొట్టించవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఆ జట్టుకు కీలకం కానున్నాడు. ఇక్కడ మెరుగైన రికార్డు అతడికి మరింత బలం. మరో స్పిన్నర్ అక్షర్ పటేల్ మ్యాజిక్ తోడైతే ఢిల్లీ మెరుగైన స్థితిలో నిలుస్తుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మహ్మద్ నబి, రషీద్ ఖాన్లు కీలకం కానున్నారు. అత్యుత్తమ ఎకానమీ, మెరుగైన సగటు అఫ్ఘాన్ స్పిన్నర్లను ప్రమాకరంగా తయారు చేసింది. టర్న్ లభించే వికెట్‌పై వీరిని ఎదుర్కొవటం అంతు సులువు కాదు. నకుల్ బంతులతో పాటు స్లో బంతులతో ప్రయోగాలు చేసే భువనేశ్వర్ కుమార్ సైతం కీలక పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు. ఢిల్లీ, హైదరాబాద్ బౌలర్లలో ఎవరు ప్రత్యర్థి కట్టడి చేయగలరో వారిదే విజయం.
పిచ్, వాతావరణం : విశాఖ పిచ్ సహజంగా నెమ్మదిగా స్పందించే గుణం కల్గి ఉంది. భారత్ ఆడిన టీ20ల్లో స్వల్ప స్కోర్లే నమోదయ్యాయి. ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌ను దృష్టిలో ఉంచుకుని బ్యాట్స్‌మెన్‌కూ అనుకూలించే వికెట్ అందించే ఆలోచన ఉంది!. స్లో బౌలర్లు, స్పిన్నర్లు విశాఖలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నది. 160-170 పరుగులతో మ్యాచ్‌ను గెలవచ్చు!.
తుది జట్లు (అంచనా)
సన్‌రైజర్స్ హైదరాబాద్ : వృద్దిమాన్ సాహా, మార్టిన్ గప్టిల్ , మనీశ్ పాండే, కానె విలియమ్సన్, విజరు శంకర్, యూసుఫ్ పఠాన్/దీపక్ హుడా, మహ్మద్ నబి, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్.
ఢిల్లీ క్యాపిటల్స్ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాష్ అయ్యర్, రిషబ్ పంత్, కొలిన్ ఇన్‌గ్రామ్, రూథర్‌ఫోర్డ్, కీమో పాల్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, ట్రెంట్ బౌల్ట్, ఇషాంత్ శర్మ.