Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాహుల్ లెగ్ స్పిన్ మాయజాలం
- మెరిసిన సూర్యకుమార్, కిషన్
- క్వాలిఫయర్1లో చెన్నై చిత్తు
చెన్నై
చెపాక్‌లో తిరుగులేని రికార్డు. అశేష అభిమానుల నడుమ ఆడుతున్న అనుకూలత. వనరుల వినియోగంలో అత్యుత్తమ సారథి ధోని వ్యూహాలు. అయినా, ముంబయి ఇండియన్సే ముందుడుగు వేసింది. క్వాలిఫయర్1లో చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసి, ఐపీఎల్12 ఫైనల్లోకి ప్రవేశించింది. లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ (2/14) మాయతో చెన్నై 131/4 పరుగులే చేసింది. ఛేదనలో సూర్యకుమార్ యాదవ్ (71 నాటౌట్), ఇషాన్ కిషన్ (28) యువ మెరుపులతో ముంబయి టైటిల్ పోరుకు సిద్ధమైంది.
ఐపీఎల్ 12 ఫైనల్లోకి ముంబయి ఇండియన్స్ దూసుకెళ్లింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై క్వాలిఫయర్1లో అలవోక విజయం సాధించిన ముంబయి మే 12 టైటిల్ పోరుకు రంగం సిద్ధం చేసుకున్నది. 132 పరుగుల స్వల్ప ఛేదనలో సూర్యకుమార్ యాదవ్ (70 నాటౌట్, 47 బంతుల్లో 9 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో చెలరేగాడు. ఇషాన్ కిషన్ (28, 31 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి మూడో వికెట్‌కు 80 పరుగుల విలువైన భాగస్వామం నిర్మించిన సూర్యకుమార్ ముంబయి విజయాన్ని లాంఛనం చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (4), డికాక్ (8) విఫలమైనా.. కఠిన చెపాక్‌పై సూర్యకుమార్ మెరుపులతో మరో 9 బంతులు ఉండగానే ముంబయి ఆరు వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసింది. లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ (2/14) మామజాలంతో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ 131/4 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ ఎం.ఎస్ ధోని (37 నాటౌట్, 29 బంతుల్లో 3 సిక్స్‌లు) మెరిసినా చెన్నై మెరుగైన స్కోరు సాధించలేదు. మురళీ విజరు (26), అంబటి రాయుడు (42 నాటౌట్, 37 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
సూర్యకుమార్ ఛేదించాడు : రెండో ఇన్నింగ్స్‌లో బంతి మరింత నెమ్మదిస్తుందని అంచనా వేసిన ధోని తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మహి ఊహించినట్టే ఛేదనలో ముంబయి ఆరంభంలో ఇబ్బంది పడింది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ (4), క్వింటన్ డికాక్ (8) స్వల్ప స్కోర్లకే నిష్క్రమించారు. దీపక్ చాహర్, హర్బజన్ సింగ్‌లు ముంబయిని ఒత్తిడిలోకి నెట్టారు. 21/2తో కష్టాల్లో ఉన్న తరుణంలో యువ జోడీ సూర్యకుమార్ యాదవ్ (71 నాటౌట్, 54 బంతుల్లో 10 ఫోర్లు), ఇషాన్ కిషన్ (28, 31 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) జట్టు కట్టారు. పవర్ ప్లేలో హర్బజన్ సింగ్‌పై వరుసగా 4, 6 సిక్సర్ బాది ఇషాన్ కిషన్ ఛేదనకు ఊపు తీసుకొచ్చాడు. మరో ఎండ్‌లో సూర్యకుమార్ యాదవ్ సైతం బౌండరీలతో ఒత్తిడిని తగ్గించాడు. ధోని బౌలింగ్ మార్పులతో ప్రయోగాలు చేసినా ఈ జోడీ జోరు తగ్గలేదు. మూడో వికెట్‌కు 80 పరుగులు జోడించిన ఈ జోడీని ఇమ్రాన్ తాహీర్ విడదీశాడు. వరుస బంతుల్లో ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్య (0)లను డగౌట్‌కు చేర్చాడు. 8 ఫోర్లతో 37 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన సూర్యకుమార్ యాదవ్.. జోరు కొనసాగించాడు. హార్దిక్ పాండ్య (13 నాటౌట్, 11 బంతుల్లో 1 ఫోర్) తోడుగా లాంఛనం ముగించాడు.
రాహుల్ చాహర్ తిప్పేశాడు : కఠిన చెపాక్ పిచ్‌పై ఆతిథ్య చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆశించిన ఆరంభం లభించలేదు. పవర్ ప్లేలోనే చెన్నై టాప్-3 బ్యాట్స్‌మెన్‌ను కోల్పోయింది. లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ (2/14) చెన్నై బ్యాటింగ్ కోరలు పీకేశాడు. ఓపెనర్ డుప్లెసిస్ (6), మురళీ విజరు (26)లను సాగనంపి, లయ దెబ్బతీశాడు. షేన్ వాట్సన్ (10), సురేశ్ రైనా (5) స్వల్ప స్కోరుకే నిష్క్రమించారు. ఈ దశలో మురళీ విజరుతో కలిసి అంబటి రాయుడు (42 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ నమోదు చేశాడు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఈ జోడీ నెమ్మదిగా పరుగులు చేసింది. బౌండరీలు బాదటం కష్టమైనా.. విజరు మూడు ఫోర్లతో మెరిశాడు. 26 బంతుల్లో 26 పరుగులు చేసిన విజరు దూకుడు అందుకునే క్రమంలో స్టంపౌట్ అయ్యాడు. చివరి ఎనిమిది ఓవర్లలో క్రీజులోకి వచ్చిన ఎం.ఎస్ ధోని (37 నాటౌట్) సైతం స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించలేదు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో మలింగపై వరుస సిక్సర్ల జోరు మినహా మహి ధనాధన్ చూపించలేదు. డెత్ ఓవర్లలో పరుగుల పొదుపు పాటించిన ముంబయి ఆతిథ్య చెన్నై 131/4కే పరిమితం చేసింది. బంతి తిరిగిన వేళ మురళీ విజరు, అంబటి రాయుడు, ఎం.ఎస్ ధోని రాణించారు. చేతిలో వికెట్లు ఉన్నప్పటికీ చివరి ఐదు ఓవర్లలో సూపర్ కింగ్స్ ఎదురుదాడి చేయలేదు. వేగంగా ఆడితే చెన్నై 150 ప్లస్ పరుగులు చేయగలిగేది!. కృనాల్ పాండ్య, జయంత్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ : డుప్లెసిస్ (సి) అన్మోల్ప్రీత్ (బి) రాహుల్ చాహర్ 6, షేన్ వాట్సన్ (సి) జయంత్ (బి) కృనాల్ పాండ్య 10, సురేశ్ రైనా (సి,బి) జయంత్ 5, మురళీ విజరు (స్టంప్డ్) డికాక్ (బి) రాహుల్ చాహర్ 26, అంబటి రాయుడు న నాటౌట్ 42, ఎం.ఎస్ ధోని నాటౌట్ 37, ఎక్స్‌ట్రాలు : 05, మొత్తం :(20 ఓవర్లలో 4 వికెట్లకు) 131.
వికెట్ల పతనం : 1-6, 2-12, 3-32, 4-65.
బౌలింగ్ : లసిత్ మలింగ 3-0-26-0, కృనాల్ పాండ్య 4-0-21-1, రాహుల్ చాహర్ 4-0-14-2, జయంత్ యాదవ్ 3-0-25-1, జశ్‌ప్రీత్ బుమ్రా 4-0-31-0, హార్దిక్ పాండ్య 2-0-13-0.
ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ (ఎల్బీ) దీపక్ చాహర్ 4, క్వింటన్ డికాక్ (సి) డుప్లెసిస్ (బి) హర్బజన్ 8, సూర్యకుమార్ నాటౌట్ 71 , ఇషాన్ కిషన్ (బి) ఇమ్రాన్ తాహీర్ 28, కృనాల్ పాండ్య (సి,బి) ఇమ్రాన్ తాహీర్ 0, హార్దిక్ పాండ్య నాటౌట్ 13, ఎక్స్‌ట్రాలు : 08, మొత్తం : (18.3 ఓవర్లలో 4 వికెట్లకు) 132.
వికెట్ల పతనం : 1-4, 2-21, 3-101, 4-101.
బౌలింగ్ : దీపక్ చాహర్ 3.3-0-30-1, హర్బజన్ సింగ్ 4-0-25-1, రవీంద్ర జడేజా 4-0-18-0, డ్వేన్ బ్రావో 3-0-25-0, ఇమ్రాన్ తాహీర్ 4-0-33-2.