Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరుసగా రెండోసారి ప్రపంచకప్ కైవసం
- ఐసిసి వన్డే ప్రపంచకప్ మరో 14 రోజుల్లో
నవ తెలంగాణ క్రీడాప్రతినిధి
క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్ తొలి ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వగా కరేబియన్ జట్టు అనూహ్యంగా టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఆ తర్వాత 1979లో రెండో ప్రుడెన్షియల్ ప్రపంచకప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చింది. రౌండ్‌రాబిన్ లీగ్ మరియు నాకౌట్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీ టైటిల్‌నూ డిఫెండింగ్ ఛాంపియన్ క్లైవ్ లాయిడ్ వెస్టిండీస్ జట్టు మరోసారి చేజిక్కించుకోవడం విశేషం. జూన్ 9 నుండి 23 వరకు జరిగిన టైటిల్‌కై 8 జట్లు పోటీపడ్డాయి. ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించగా.. ప్రతి జట్టు ఆ గ్రూప్‌లో మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడి అగ్రస్థానంలో నిలిచిన రెండుజట్లు సెమీస్‌లో తలపడ్డాయి. గ్రూప్-ఏలో ఇంగ్లాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, కెనడా జట్లు... గ్రూప్-బిలో వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంక, ఇండియా జట్లు ఉన్నాయి. 1975 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన దక్షిణాఫ్రికా ఈసారి టోర్నీకి దూరమైంది. సఫారీ జట్టు స్థానంలో ఈసారి కెనడా ప్రపంచకప్‌కు అర్హత సాధించడం మరో విశేషం.
జూన్ 9న విండీస్‌తో తొలి మ్యాచ్ ఆడిన భారత్ 53.1 ఓవర్లలో 190 పరుగులే చేయగా... ఆ లక్ష్యాన్ని విండీస్ కేవలం ఒక వికెట్ మాత్రమే చేజార్చుకొని 51.3 ఓవర్లలో ఛేదించగల్గింది. జూన్ 13న న్యూజిలాండ్‌పై తొలిగా బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం 182 పరుగులకే పరిమితం కాగా... ఆ లక్ష్యాన్ని కివీస్ జట్టు 57 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే చేజార్చుకొని విజయాన్ని నమోదు చేసుకుంది. జూన్ 18న ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడిన టీమిండియా జట్టు శ్రీలంక నిర్దేశించిన 239 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 191 పరుగులకే ఆలౌట్ కావడం గమనార్హం.
గ్రూప్-ఏలో ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్, ఆస్ట్రేలియా, కెనడాలపై గెలిచి అగ్రస్థానంలో నిలవగా... పాకిస్తాన్‌జట్టు ఇంగ్లాండ్ చేతిలో ఓడి.. ఆస్ట్రేలియా, కెనడాలపై గెలిచి రెండోస్థానంలో నిలిచింది. ఇక గ్రూప్-బిలో వెస్టిండీస్ రెండు విజయాలతో పాటు శ్రీలంకతో మ్యాచ్‌ను టైగా ముగించి 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా... న్యూజిలాండ్ రెండు విజయాలు, ఒక పరాజయంతో 8 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచింది. గ్రూప్-బిలో ఉన్న భారత్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఘోర పరాజయాలను చవిచూసింది. దీంతో ఆ గ్రూప్‌లో భారత్ నాల్గో స్థానంలో నిలిచి లీగ్ దశలోనే వెనుదిరిగింది. అంతేగాక ఆసియా ఖండానికి చెందిన శ్రీలంక చేతిలో భారత్ 47 పరుగులతో ఓడి విమర్శలనెదుర్కోవాల్సి వచ్చింది.
హోరాహోరీగా సాగిన తొలి సెమీస్‌లో ఇంగ్లాండ్ జట్టు 8 వికెట్లు చేజార్చుకొని 221 పరుగులు చేయగా... ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్జట్టు 60 ఓవర్ల మ్యాచ్ పూర్తయ్యేసరికి 9 వికెట్లు చేజార్చుకొని 212 పరుగులే చేయగల్గింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు 9 పరుగుల తేడాతో కివీస్‌పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. ఇక రెండో సెమీస్‌లో వెస్టిండీస్ 6 వికెట్లు కోల్పోయి 293 పరుగులు చేయగా... పాకిస్తాన్ 250 పరుగులకే ఆలౌటైంది. జూన్ 23న జరిగిన ఫైనల్లో టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 60 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ జట్టు 194 పరుగులకు కుప్పకూలింది. దీంతో వెస్టిండీస్ జట్టు 92 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తుచేసి వరుసగా రెండోసారి ఐసిసి ఫ్రుడెన్షియల్ ప్రపంచకప్ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులను వెస్టిండీస్‌కు చెందిన గార్డన్ గ్రీనిడ్జ్ 4 ఇన్నింగ్స్‌లో 253 పరుగులు చేయగా... వివ్ రిచర్డ్స్ 4 ఇన్నింగ్స్‌లో 217 పరుగులతో రెండోస్థానంలో నిలిచాడు. ఇక బౌలర్ల విభాగంలో ఇంగ్లాండ్‌కు చెందిన మైక్ హెండ్రిక్ 5 ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు చేజిక్కించుకొని అందరికంటే ముందున్నాడు.
1975 నుంచి వరల్డ్ కప్‌ను దక్కించుకున్న విజేత
సంవత్సరం ఛాంపియన్ రన్నర్అప్
1975 వెస్టిండీస్ ఆస్ట్రేలియా
1979 వెస్టిండీస్ ఇంగ్లాండ్
1983 భారత్ వెస్టిండీస్
1987 ఆస్ట్రేలియా ఇంగ్లాండ్
1992 పాకిస్థాన్ ఇంగ్లాండ్
1996 శ్రీలంక ఆస్ట్రేలియా
1999 ఆస్ట్రేలియా పాకిస్థాన్
2003 ఆస్ట్రేలియా భారత్
2007 ఆస్ట్రేలియా శ్రీలంక
2011 భారత్ శ్రీలంక
2015 ఆస్ట్రేలియా న్యూజిలాండ్