Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడేండ్లుగా సహచర్యం కొనసాగుతుంది
- స్వలింగ సంపర్కురాలిగా ప్రకటించుకున్న ద్యుతీ
హైదరాబాద్ : అవును, ఆమెను ఇష్టపడ్డాను. మూడేండ్లుగా మా బంధం కొనసాగుతోందని భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర విషయాలు వెల్లడించింది. స్వలింగ లైంగిక బంధం నేరం కాదని 2018 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పుతో ఒడిశాకు చెందిన అమ్మాయితో మూడేండ్లుగా స్వలింగ సంపర్కురాలిగా కొనసాగుతున్నానని ద్యుతీ పేర్కొన్నది. 2018 ఆసియా క్రీడల్లో 100 మీటర్ల పరుగులో రజత పతకం సాధించిన ద్యుతీ చంద్, 32 ఏండ్లలో తొలిసారి భారత్‌కు సిల్వర్ తీసుకొచ్చింది. 200 మీటర్ల పరుగులోనూ ద్యుతీ రజతం కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ' సెక్షన్ 377 ప్రకారం, స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన తర్వాత, మా కలిసి ఉండటానికి ఏ హానీ జరుగదని అనుకున్నాం. పెండ్లి చేసుకుని, మాకు మేము ఓ చిన్న కుటుంబంలా ఉండాలని నిర్ణయించుకున్నాం' అని ద్యుతీ తెలిపింది. ఆమె పేరు చెప్పను కానీ, ఒడిశాలోని మా సిటీలోనే ఉంటుంది. ఆమో క్రీడాభిమాని. క్రీడల్లో కెరీర్ కొనసాగించేందుకు నేను ఎదుర్కొన్న కష్టాలను గురించి చదివి, ప్రేరణ పొందానని చెప్పింది. ఆ విధంగా మా ఇద్దరికీ పరిచయ ఏర్పడింది. మేము ఎటువంటి నేరం చేయటం లేదు. మా జీవితం, మాకు నచ్చినట్టు మల్చుకుంటాం. క్రీడల్లో ఉన్నందుకు నాపై ప్రజల దృష్టి ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాతైనా నాకంటూ ఎంతో జీవితం ఉంటుంది. పెద్ద టోర్నీల్లో ఆమె నాతో ఉండేందుకు వీలు పడలేదు. నేను పోటీలో నిలిచినప్పుడు నా కోసం ప్రార్థనలు చేస్తుంది. మా ఇద్దరం గడిపేందుకు పెద్దగా సమయం దొరకదు. అయినా, రెండేండ్లుగా నాకు ఎంతో మద్దతుగా నిలుస్తోంది. నా తల్లిదండ్రులకు ఈ విషయం ఇంకా చెప్పలేదు. నా అభిప్రాయాన్ని వారు గౌరవిస్తారని అనుకుంటున్నానని ద్యుతీ తెలిపింది. పురుష హార్మోన్ టెస్టోస్టిరాన్ అధిక స్థాయిలో కలిగి ఉందనే కారణంగా, ద్యుతీ చంద్‌పై నిషేధం విధించారు. నిషేధంపై కోర్టు ఆఫ్ ఆర్బిటేషన్ ఆఫ్ స్పోర్ట్స్ (సీఏఎస్)కు వెళ్లిన ద్యుతీ చంద్ విజయం సాధించింది. 2018 హార్మోన్ స్థాయిల పరిమితులపై నిబంధనలు ఉపసంహరించుకున్న వెంటనే ఆసియా క్రీడల్లో ద్యుతీ చంద్ డబుల్ సిల్వర్‌తో మెరిసింది. ప్రపంచ చాంపియన్‌షిప్స్ కోసం ద్యుతీ చంద్ ప్రస్తుతం హైదరాబాద్‌లో సాధన చేస్తోంది.