Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ క్రీడా విభాగం
మెగా ఈవెంట్ అనగానే సూపర్స్టార్స్పైనే కన్ను పడుతుంది. దిగ్గజాల ప్రదర్శన కోసమే అభిమానులు ఎదురుచూస్తారు. ఐకాన్ ఆటగాళ్ల ఆటపై పండితులు సైతం ఆసక్తి కనబరుస్తారు. ఎన్నో మార్పులకు వేదిక అయినట్టు, ఈ విషయంలోనూ 2019 ప్రపంచకప్ భిన్నంగా నిలువబోతున్నది. దిగ్గజ ఆటగాళ్ల సంగతి అటుంచి, యువ క్రికెటర్లు ప్రపంచకప్‌పై చెరగని ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇంగ్లీష్ వేసవిలో క్రికెట్ విన్యాసాలతో సందడి చేసేందుకు యువ నాయకులు సిద్ధమవుతున్నారు. 2019 ప్రపంచకప్ సమయానికి పెద్దగా పరిచయం లేని ఈ యువ మెరుపులు.. నాలుగేండ్లలో ఎనలేని స్టార్డమ్ సొంతం చేసుకున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా జట్టుకు అండగా నిలుస్తూ, ఒంటిచేత్తో విజయాలు అందించే స్థాయికి ఎదిగారు. 2019 ప్రపంచకప్‌లో చివరగా ఆడేందుకు రంగం సిద్ధం చేసుకున్న దిగ్గజాలు ఏ మేరకు ప్రభావం చూపిస్తారో లేదో తెలియదు. కానీ ఇప్పుడే ప్రపంచకప్ అరంగేట్రం చేయబోతున్న యువ మెరుపులు చెరగని ముద్ర వేయటం ఖాయం!. అద్బుతాలు చేయగల ఆ యువ క్రికెటర్లలో జశ్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, కగిసో రబాడ, రషీద్ ఖాన్, షిమ్రోన్ హెట్‌మయర్‌లు ముందున్నారు.
అఫ్ఘాన్ స్పిన్ గన్ : రషీద్ ఖాన్‌తో పాటు అతడి జట్టు అఫ్ఘనిస్థాన్‌కు ఇదే తొలి ప్రపంచకప్. ప్రత్యర్థి బలవంతుడైనా, సమవుజ్జీ అయినా.. నైపుణ్యాన్ని నమ్ముకుని, ఆటను ఆస్వాదించటాన్ని నమ్ముతాడు రషీద్ ఖాన్. ఈ యువ స్పిన్నర్ ఇప్పుడు ప్రపంచ మేటి స్పిన్నర్. తొలి ప్రపంచకప్ ఆడుతున్నా.. అద్వితీయ స్పిన్ స్కిల్స్‌తో జట్టు భారాన్ని మోయగల సత్తా ఉంది. మరో స్పిన్నర్ మహ్మద్ నబీ సహకారం రషీద్‌ను మరింత ప్రమాదకారిగా తయారు చేసింది. ఒత్తిడి సమయాల్లో ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకోవటంలో రషీద్ ఖాన్ సిద్ద హస్తుడు. ఈ ఏడాది ఐపీఎల్లో 22.17 సగటుతో 17 వికెట్లు కూల్చిన రషీద్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. 56 వన్డేల్లో 123 వికెట్లు పడగొట్టిన రషీద్ ఖాన్.. ఐపీఎల్లో మేటి బ్యాట్స్‌మెన్‌ను ముప్పు తిప్పలు పెట్టాడు. ప్రపంచకప్‌లో అఫ్ఘనిస్థాన్ ప్రస్థానం ఎక్కడ ముగిసినా... రషీద్ ఖాన్ మెరుపులు మాత్రం శిఖర స్థాయిలో ఉండటం లాంఛనమే.
యార్కర్ల హీరో బుమ్రా : నాలుగేండ్ల కాలం తీసుకొచ్చే మార్పు మనమే నమ్మలేం. 2015 ప్రపంచకప్ సమయంలో ఊసులోనే లేని సీమర్ బుమ్రా. కానీ 2019 ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన ముందు వరుస ఆటగాళ్లలో అతడొకడు. నిలకడ విషయంలో బుమ్రా ఆధునిక మెక్‌గ్రాత్. ఐపీఎల్లో యార్కర్ల కింగ్ లసిత్ మలింగ మార్గదర్శనంలో రాటుదేలిన బుమ్రా.. ఆరంభ ఓవర్లతో పాటు డెత్ ఓవర్లలోనూ అత్యంత ప్రభావ శీలుడు. ముంబయిని ఐపీఎల్ విజేతగా నిలిపిన ఉత్సాహంలో ఉన్న బుమ్రా.. ప్రపంచకప్‌కు నిండైన ఆత్మ విశ్వాసంతో వస్తున్నాడు. భారీ స్కోర్లు నమోదు కానున్న ప్రపంచకప్‌లో అతి తక్కువ ఎకానమీ కలిగిన బుమ్రా ప్రత్యర్థులకు సింహస్వప్నం. 49 వన్డేల్లో 85 వికెట్లు కూల్చిన బుమ్రా.. వరల్డ్‌కప్‌లో వికెట్ల వేటకు మరింత పదును పెట్టనున్నాడు. భారత పేస్ దళానికి నాయకత్వం వహించనున్న బుమ్రా.. 2019 ప్రపంచకప్ ప్రత్యేకం కానున్నాడు.
సఫారీ సీమర్ రబాడ : ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఆడిన 12 మ్యాచుల్లో కగిసో రబాడ కూల్చిన వికెట్లు 25. స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ 17 మ్యాచుల్లో 26 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. టోర్నీ అత్యుత్తమ వికెట్ల వేటగాడి కంటే ఐదు మ్యాచులు తక్కువ ఆడినా.. వికెట్ల వేటలో వ్యత్యాసం ఒకటి మాత్రమే. నిలకడ విషయంలో బుమ్రా సమవుజ్జీగా నిలిచే రబాడ.. దక్షిణాఫ్రికా పేస్ విభాగంలో కీలక బాధ్యతలు తీసుకోనున్నాడు. షాన్ పొలాక్, మకియా ఎన్తిని, డెల్ స్టెయిన్ వంటి ప్రపంచ శ్రేణి సీమర్లను తయారు చేసిన దక్షిణాఫ్రికా నుంచి దూసుకొచ్చిన మరో సీమ్ కెరటం రబాడ. ఇంగ్లాండ్ బౌన్సీ పిచ్‌లపై రబాడ.. పేస్ పదును బ్యాట్స్‌మన్‌ను ముప్పు తిప్పలు పెడుతుంది. 66 వన్డేల్లో 106 వికెట్లు కూల్చిన రబాడ.. మ్యాచ్ మ్యాచ్‌కూ మరింత మెరుగ్గా రూపు దిద్దుకుంటున్నాడు. దక్షిణాఫ్రికా ప్రపంచకప్ 'దురదృష్టవంతులు' ట్యాగ్ తొలగించేందుకు ఈసారి రబాడ స్పెషల్ మ్యాజిక్ చేస్తాడనే అంచనాలు నెలకొన్నాయి.
హాట్ హాట్ హార్దిక్ : 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో భారత్ ఓడినా.. ఓ ఆటగాడి ప్రదర్శన మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆశలు కోల్పోయిన సమయంలో విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగిన ఆ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య. ఈ ఏడాది ఐపీఎల్లో కోల్‌కత నైట్‌రైడర్స్‌పై వేగవంతమైన అర్ధ సెంచరీతో హార్దిక్ పాండ్య భీకర ఫామ్‌లోకి వచ్చాడు. బంతితో, బ్యాట్‌తో కీలక పాత్ర పోషించగల హార్దిక్ పాండ్య.. ఇటీవల స్పెషలిస్ట్ సీమర్‌గా, స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా రూపొందాడు. మరో కపిల్ దేవ్‌గా కితాబు అందుకుంటున్న హార్దిక్ పాండ్య.. దిగ్గజ కపిల్ మాదిరిగా ఇంగ్లాండ్‌లో జరుగుతున్న వరల్డ్‌కప్‌లో అద్భుతాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. తొలి ప్రపంచకప్‌లోనే తిరుగులేని ప్రదర్శన చేయగల్గితే, దిగ్గజ ఆల్‌రౌండర్ల సరసన హార్దిక్ చోటు సాధించినట్టే అవుతుంది!.
విండీస్ యువ రక్తం : ప్రపంచకప్ రేసులోకి ఒక్కసారిగా దూసుకొచ్చిన జట్టు వెస్టిండీస్. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడగల బ్యాట్స్‌మన్, భీకర షాట్లతో బౌలర్లపై విరుచుకుపడే పించ్ హిట్టర్లకు కరీబియన్ జట్టులో కొదవ లేదు. వయసు మళ్లిన హిట్టర్లతో కూడిన విండీస్ బ్యాటింగ్ లైనప్‌తో యువ రక్తం చేరింది. అండర్-19 సారథిగా 2016లో ప్రపంచకప్ విజయం రుచి చూసిన షిమ్రోన్ హెట్మయర్.. అద్భుత ప్రతిభావంతుడైన బ్యాట్స్‌మన్. ఏమాత్రం భయం లేని క్రికెట్ ఆడే షిమ్రోన్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో క్లాసిక్ ఆటగాడు. హిట్టర్లతో కూడిన విండీస్ టాప్ ఆర్డర్‌కు మిడిల్ ఆర్డర్లో షిమ్రోన్ హెట్మయర్ అదనపు బలం. మధ్య ఓవర్లలో షిమ్రోన్ను నిలువరించటం ప్రత్యర్థి జట్లకు సవాల్ అనే చెప్పాలి. విండీస్ భవిష్యత్‌ను నిలబెట్టగల క్రికెటర్‌గా షిమ్రోన్ ఇప్పటికే భారీ అంచనాలు మోస్తున్నాడు. ప్రపంచకప్‌లో అతడి ప్రదర్శన కోసం కరీబియన్లు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.