Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమ్మాయితో ద్యుతీ సహజీవనం
- వ్యతిరేకించిన కుటుంబ సభ్యులు
భువనేశ్వర్ : భారత స్టార్ స్ప్రింటర్, ఉపఖండపు వేగవంతమైన మహిళా ద్యుతీ చంద్ తన గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో సహజీవనం కొనసాగిస్తున్నానని ప్రకటించింది. సంప్రదాయ వివాహ పద్దతులను కాదని స్వలింగ సంపర్కురాలిగా ప్రకటించుకున్న ద్యుతీ చంద్ ఈ ధైర్యం చేసిన తొలి భారత స్పోర్ట్స్‌పర్సన్‌గా నిలిచింది. సమాజంలో వ్యతిరేకత, సోషల్ మీడియా నుంచి ట్రోల్స్‌కు భయపడి సెలబ్రిటీలు ఎవరూ ఈ సాహాసానికి సిద్దపడలేదు. మూడేండ్లుగా స్నేహితురాలితో ఉంటున్నాను. వివాహ బంధంతో ఆమెతో జీవితం పంచుకోవాలని అనుకుంటున్నా, మేమేమీ నేరం చేయటం లేదు. సుప్రీంకోర్టు, రాజ్యాంగం ఈ స్వేచ్ఛను ప్రసాదించాయని ద్యుతీ చంద్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ద్యుతీ ప్రకటనతో సోషల్ మీడియాలో ఆమెకు అనూహ్య మద్దతు లభించింది. క్రీడాభిమానులూ ఆమె వ్యక్తిగత ఇష్టాలను గౌరవించారు. కానీ ద్యుతీ కుటుంబ సభ్యులు మాత్రం మండి పడుతున్నారు. ఓ అమ్మాయితో వివాహ బంధానికి అంగీకరించమని తేల్చి చెప్పారు.
తప్పు దారి పట్టించారు! : ' ద్యుతీ ఓ అమ్మాయిని పెండ్లి చేసుకుంటుదనే ఆ వార్త వినగానే షాక్‌కు గురయ్యాం. స్వలింగ సంపర్క వివాహాలకు మేం పూర్తిగా వ్యతిరేకం' అని ద్యుతీ చంద్ తల్లి అకుజీ చంద్ తెలిపింది. ఆసియా క్రీడల్లో ప్రదర్శనకు ద్యుతీకి రూ. 3 కోట్ల నగదు బహుమానం లభించింది. అందులో కొంత మొత్తం ఇవ్వమని ఎన్నోసార్లు అడిగాం. మాకు ఆరుగురు కుమార్తెలు. జీవనం గడిచేందుకు ఇంకా కూలీ పని చేసుకుంటున్నాం. అయినా, ద్యుతీ సాయం చేయలేదు. కొంత మంది వ్యక్తులు ద్యుతీని తప్పుదారి పట్టిస్తున్నారు. ద్యుతీతో సహజీవనం చేస్తున్న అమ్మాయి తల్లి దండ్రులు ఆమెపై నియంత్రణ కోరుకుంటున్నారని వాపోయింది.