Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెప్టెన్లకు ప్రపంచకప్ పరీక్ష
- కోహ్లి, ఫించ్, మోర్గాన్లపై ఫోకస్
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు పది జట్ల సైన్యాలేవో తేలిపోయింది. రెండు సార్లు విజేత భారత్, ఆతిథ్య ఇంగ్లాండ్‌లు ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయి. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలు రేసులో దూసుకొస్తున్నాయి. అఫ్గాన్, బంగ్లాలు సంచలనాల కోసం ఎదురుచూస్తున్నాయి. ఆసక్తి రేపుతోన్న 10 జట్ల పోటీలో ప్రపంచకప్‌లో సారథ్య అనుభవం కల్గిన కెప్టెన్లు ముగ్గురే. ఏడుగురు కెప్టెన్లకు ప్రపంచకప్‌లో ఇదే తొలి సారథ్య పరీక్ష. మెగా హంగామాకు నాయకులు సిద్ధమేనా?
నవతెలంగాణ క్రీడా విభాగం
ఫుట్‌బాల్, హాకీ వంటి పాపులర్ క్రీడల్లో కెప్టెన్‌కు అంత ప్రాధాన్యం ఉండదు. ఆటలో కీలక పాత్ర పోషించే అవకాశం చాలా స్వల్పం. క్రికెట్ అలా కాదు. ప్రతి దశలోనూ కెప్టెన్ పాత్ర ఉంటుంది. తొలి బంతి నుంచే నాయకుడు వ్యూహ చతురతకు పదును పెట్టాలి. జట్టు ప్రదర్శన సంగతి ఎలాగున్నా.. ఒత్తిడిలో తీసుకునే నిర్ణయాలు, బౌలింగ్‌లో మార్పులు, ఫీల్డింగ్ మొహరింపులు ఇలా ఎన్నో విషయాల్లో కెప్టెన్ ఫలితాన్ని శాసిస్తాడు. మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకుని తీసుకునే అనూహ్య నిర్ణయాలతో ఆశల్లేని మ్యాచ్‌ను లాగేసుకునే అవకాశం ఉండటంతో పాటు, చెత్త నిర్ణయాలతో చేతుల్లోని మ్యాచ్‌ను చేజార్చుకునే ప్రమాదం పొంచి ఉంది. అందుకే, క్రికెట్లో కోచ్ కంటే ఎక్కువగా కెప్టెన్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. జట్టులోని ఆటగాళ్లకు ప్రేరణగా నిలువటంతో పాటు, తనూ కర్తవ్యాన్ని నిర్వర్తించటం నాయకుడిని కత్తి మీద సామే. కొత్త ఫార్మాట్‌తో ఆసక్తి రేపుతోన్న 2019 ప్రపంచకప్‌లో ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లాండ్), జేసన్ హౌల్డర్ (వెస్టిండీస్), మొష్రఫె మోర్తాజా (బంగ్లాదేశ్)లకు ప్రపంచకప్‌లో సారథ్యం వహించిన అనుభవం ఉంది. విరాట్ కోహ్లి, అరోన్ ఫించ్, గులాబ్దిన్ నయిబ్ (అఫ్ఘనిస్థాన్), కానె విలియమ్సన్ (న్యూజిలాండ్), సర్ఫరాజ్ అహ్మద్ (పాకిస్థాన్), డుప్లెసిస్ (దక్షిణాఫ్రికా), దిముత్ కరుణరత్నె (శ్రీలంక)లకు కెప్టెన్‌గా ఇదే తొలి ప్రపంచకప్. ప్రపంచకప్‌లో సారథుల వ్యక్తిగత ప్రదర్శనతో పాటు నాయకత్వ సామర్థ్యంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొన్నది.
గుల్బాదిన్ నయిబ్ : అఫ్ఘనిస్థాన్‌తో పాటు ప్రపంచకప్‌లో అరంగేట్రం చేయబోతున్నాడు కెప్టెన్ గులాబ్దిన్ నయిబ్. అంతర్జాతీయ సర్క్యూట్లో నయిబ్కు కెప్టెన్సీ అనుభవం శూన్యం. ఇటీవల అతడు అఫ్గాన్ నూతన సారథిగా ఎంపికయ్యాడు. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్ల విధానాన్ని అఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసుకోగా.. అష్గర్ అఫ్గాన్ నుంచి కెప్టెన్సీ పగ్గాలు నయిబ్ అందుకున్నాడు. 52 వన్డేల్లో 40 వికెట్లు కూల్చిన నయిబ్, 807 పరుగులు చేశాడు. ఏమాత్రం కెప్టెన్సీ అనుభవం లేని నయిబ్ తొలిసారి అఫ్ఘనిస్థాన్‌ను ఏ విధంగా ముందుకు నడిపిస్తాడనేది ఆసక్తికరం.
అరోన్ ఫించ్ : ఏడాది క్రితం కేప్‌టౌన్ బాల్ టాంపరింగ్ వివాదంతో ఆస్ట్రేలియా శిబిరంలో నాయకత్వ శూన్యత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో అరోన్ ఫించ్ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. కంగారూ జట్టును 18 వన్డేల్లో నడిపించిన ఫించ్, పది మ్యాచుల్లో గెలిపించాడు. ప్రపంచ క్రికెట్ అగ్ర జట్టు నాయకుడిగా ఫించ్‌కు ఆరంభంలో చేదు ఫలితాలే ఎదురయ్యాయి. పది విజయాలు ఈ ఏడాది జనవరి తర్వాత సాధించినవే. నాయకుడిగా ఓటములు, బ్యాట్స్‌మన్‌గా వైఫల్యం ఎదుర్కొన్న ఫించ్.. తాజా పాకిస్థాన్ సిరీస్‌లో పుంజుకున్నాడు. క్లీన్‌స్వీప్ సిరీస్‌తో పాటు బ్యాట్స్‌మన్‌గా రెండేసి సెంచరీలు, అర్ధ శతకాలు సాధించాడు. ఎదురుదాడికి పెట్టింది పేరైన ఆస్ట్రేలియాను అనుభవ లేమి ఫించ్ నాయకత్వం ఎక్కడకు తీసుకెళ్తుందో చూడాలి.
మష్రఫె మొర్తాజా : ప్రపంచకప్‌లో ఆడుతున్న అత్యంత అనుభవం కల్గిన ఆటగాళ్లలో మొర్తాజా ఒకడు. బంగ్లాదేశ్‌ను ఇతడు రెండోసారి ప్రపంచకప్‌లో నడిపిస్తున్నాడు. మొర్తాజా సారథ్యంలో 2015లో బంగ్లాదేశ్ గ్రూప్-ఏలో నాల్గో స్థానంలో నిలిచింది. పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్, అఫ్ఘనిస్థాన్, స్కాట్లాండ్ కంటే మెరుగైన స్థానం సాధించింది. క్వార్టర్ఫైనల్లో భారత్ చేతిలో ఓడినా.. మొర్తాజా బంగ్లాకు ఆత్మవిశ్వాసం అందించాడు. ప్రపంచకప్‌లో నాకౌట్ స్థాయికి చేరుకోవటం బంగ్లాదేశ్‌కు అదే తొలిసారి. 73 వన్డేల్లో కెప్టెన్సీ వహించిన మొర్తాజా 40 మ్యాచుల్లో విజయాన్ని అందించాడు. తాజాగా తొలి ముక్కోణపు వన్డే సిరీస్ సాధించిన ఆనందంలో ఉన్న బంగ్లాదేశ్ ప్రపంచకప్‌లో అద్బుతాలు చేయగల్గితే.. అందుకు ప్రేరణ మొర్తాజా నాయకత్వం కచ్చితంగా ఉంటుంది.
ఇయాన్ మోర్గాన్ : ఇంగ్లాండ్ వన్డే క్రికెట్ ఆధునిక రూపాంతరంలో ఇయాన్ మోర్గాన్ ఎదుగుదల చెప్పుకోదగిన విషయం. 2015 వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశ నుంచే నిష్క్రమించిన నాటి నుంచి మోర్గాన్ నాయకత్వంలో ఇంగ్లాండ్ ప్రమాదకర ప్రత్యర్థిగా ఎదిగింది. మోర్గాన్ నాయకత్వంలో ఇంగ్లాండ్ వన్డేల్లో వరల్డ్ నం.1గా కొనసాగుతోంది. 76 వన్డేలకు నాయకత్వం వహించిన మోర్గాన్ 50 విజయాలు అందించాడు. ప్రపంచకప్ బరిలో నిలిచిన అత్యంత బలమైన ఇంగ్లాండ్ జట్టుగా పిలువబడుతున్న ఆతిథ్య జట్టు.. తొలి వరల్డ్‌కప్ వేట రేసులో అందరి కంటే ముందుంది. క్రికెట్ పుట్టినిల్లుకు ప్రపంచకప్ అందించి చరిత్రలో నిలవాలని మోర్గాన్ స్వప్నిస్తున్నాడు.
విరాట్ కోహ్లి : ప్రపంచకప్‌లో అత్యంత ఆకర్షణీయ ఆటగాడు, కెప్టెన్ భారత సూపర్ స్టార్ విరాట్ కోహ్లి. విరాట్ సక్సెస్ భారత్‌తో పాటు ప్రపంచకప్‌కూ అంతే కీలకం. కోహ్లి ప్రదర్శన కోసం క్రికెట్ వరల్డ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అతడు మెరిస్తే, క్రికెట్ మరింత ముందుకు సాగుతుందనే వాదన రోజు రోజుకూ పెరుగుతోంది. ఆతిథ్య జట్టు కెప్టెన్ మోర్గాన్ మాదిరిగానే, కోహ్లి సైతం ఫేవరెట్ ట్యాగ్‌తో అదనపు ఒత్తిడి మోస్తున్నాడు. కాలంతో పాటు నాయకుడిగా రాటుదేలుతున్న కోహ్లి వన్డేల్లో 73.88 విజయ శాతం సాధించాడు. కోహ్లి నాయకత్వంలో ఆడిన 69 వన్డేల్లో, భారత్ 49 విజయాలు సాధించింది. 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో నాయకత్వ వహించిన అనుభవం కోహ్లి సొంతం. ఆ టోర్నీలో కోహ్లి భారత్‌ను ఫైనల్లోకి తీసుకెళ్లాడు. వ్యక్తిగతంగా మూడో వరల్డ్‌కప్ ఆడబోతున్న కోహ్లి.. కెప్టెన్‌గా కఠిన పరీక్షకు సిద్ధమయ్యాడు.
కానె విలియమ్సన్ : 2015 వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టులో కానె విలియమ్సన్ సభ్యుడు. బ్రెండ్ మెక్‌కలమ్ నాయకత్వ గొడుగు కింద ఎదిగిన విలియమ్సన్.. న్యూజిలాండ్ తొలి ప్రపంచకప్ ఫైనల్స్‌లో భాగమయ్యాడు. నాయకుడిగా విభిన్న పద్దతులు అనుసరించిన విలియమ్సన్.. ఎక్కువ శాతం విజయాలే అందుకున్నాడు. అంతుచిక్కని వ్యూహ చతురత, తిరుగులేని నాయకత్వ లక్షణాలు, వేలెత్తి చూపలేని బ్యాటింగ్ నైపుణ్యం విలియమ్సన్‌ను మరింత ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. 53.96 విజయ శాతంతో.. ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ తొలి టైటిల్ దిశగా అడుగులు వేసేందుకు విలియమ్సన్ నిశ్శబ్ద ప్రణాళికతో బ్రిటన్ వస్తున్నాడు!.
సర్ఫరాజ్ అహ్మద్ : 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో అండర్ డాగ్ పాకిస్థాన్‌ను విజేతగా నిలిపిన సర్ఫరాజ్ అహ్మద్.. ఇంగ్లాండ్‌లోనే జరుగుతున్న ప్రపంచకప్‌లోనూ పాకిస్థాన్ సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. 35 వన్డేల్లో 21 విజయాలు సాధించిన సర్ఫరాజ్ పాకిస్థాన్ సక్సెస్ఫుల్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. కెప్టెన్‌గా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా, వికెట్ కీపర్‌గా సర్ఫరాజ్ పాక్ ప్రపంచకప్ బృందంలో కీలక పాత్ర పోషించనున్నాడు. అనిశ్చితికి మారు పేరైన పాకిస్థాన్ మరోసారి సర్ఫరాజ్ నాయకత్వంలో సంచలనం నమోదు చేస్తే, పాక్ క్రికెట్లో ఇమ్రాన్ ఖాన్ స్థాయిని సర్ఫరాజ్ అందుకోవటం లాంఛనమే!.
డుప్లెసిస్ : ప్రపంచకప్ కెప్టెన్లలో అత్యంత విజయవంతమైన సారథి సఫారీ నాయకుడు డుప్లెసిస్. అతడు కెప్టెన్సీ వహించిన 30 వన్డేల్లో దక్షిణాఫ్రికా కేవలం ఐదింట మాత్రమే పరాజయం పాలైంది. 83.33 సక్సెస్ రేటుతో డుప్లెసిస్ ప్రపంచకప్‌లోకి అడుగు పెడుతున్నాడు. 2018 నుంచి దక్షిణాఫ్రికా కేవలం ఒకే ఒక్క ద్వైపాక్షిక వన్డే సిరీస్ కోల్పోయి, ఐదింట అద్భుత విజయాలు సొంతం చేసుకున్నది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ డుప్లెసిస్ విలువైన ఆటగాడు. 46.54 సగటుతో ప్రత్యర్థులకు కొరకరాని కొయ్య. డుప్లెసిస్ బ్యాటింగ్ శైలి, స్ట్రయిక్ రేట్ అతడిని టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గానే కాదు లోయర్ ఆర్డర్లోనూ ఉపయుక్తమైన బ్యాట్స్‌మన్‌ను చేసింది. ప్రతిభావంతులతో కూడిన దక్షిణాఫ్రికాను నడిపిస్తున్న డుప్లెసిస్.. ప్రపంచకప్‌లో ఆ జట్టు 'దురదృష్టకర బృందం' ట్యాగ్‌ను తీసిపారేసేందుకు కృత నిశ్చయంతో కనిపిస్తున్నాడు.
దిమిత్ కరుణరత్నె : వన్డే ఫార్మాట్ రెగ్యులర్ క్రికెటర్లు, అనుభవం కల్గిన ఆటగాళ్లు డిక్వెల్లా, చండిమాల్, తరంగ, ధనంజయ వంటి ఆటగాళ్ల సేవలు అందుబాటులో లేవు. 2015 ప్రపంచకప్‌లో చివరి వన్డే ఆడిన దిముత్ కరుణరత్నె ఈ వరల్డ్‌కప్‌లో శ్రీలంకకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. దక్షిణాఫ్రికాలో 2-0 టెస్టు సిరీస్ విజయం అందించిన కరుణరత్నె.. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. చారిత్రక టెస్టు సిరీస్ విజయంతో కరుణరత్నె వన్డేల్లో చోటుతో పాటు కెప్టెన్సీత అరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. బ్యాట్స్‌మన్‌గా కరుణరత్నెకు మంచి రికార్డు లేదు. 17 వన్డేల్లో 190 పరుగులే చేశాడు. సగటు కేవలం 16. అయినా, తిరుగులేని టెక్నిక్‌తో ప్రపంచకప్‌లో విలువైన పరుగులు చేస్తాడనే అంచనాలు ఉన్నాయి. సఫారీ గడ్డపై అందించినట్టే, శ్రీలంకకు ఇంగ్లాండ్‌లోనూ వరల్డ్ కప్ విజయాన్ని అందించగలడనే విశ్వాసం లంకేయుల్లో కనిపిస్తోంది.
జేసన్ హౌల్డర్ : తొలి రెండు ప్రపంచకప్ నెగ్గిన వెస్టిండీస్ (1975, 1974) మళ్లీ ఆ కప్పు దరిదాపుల్లోకి రాలేదు. క్లైవ్ లాయిడ్ నుంచి ప్రేరణ పొందిన కెప్టెన్ జేసన్ హౌల్డర్.. చరిత్ర సృష్టిస్తానని విశ్వసిస్తున్నాడు. 27 ఏండ్ల జేసన్.. ప్రపంచకప్‌లో కెప్టెన్సీ వహించనున్న పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. సీనియర్లు, జూనియర్ల కలయికలో విండీస్ గత రెండు నెలల్లో అత్యంత ప్రమాదకర జట్టుగా తయారైంది. 2014 నుంచి వెస్టిండీస్ ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయం సాధించలేదు. కానీ, వరల్డ్‌కప్ ఫేవరెట్ ఇంగ్లాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌ను డ్రా చేసుకున్నది. ఆ ఆత్మవిశ్వాసంతో విండీస్‌ను విజయ పథాన నడిపించేందుకు జేసన్ సిద్ధమవుతున్నాడు.