Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్స్‌లో సైనా నెహ్వాల్
- ఫనెత్రిపై సెమీస్‌లో ఏకపక్ష విజయం
- ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్
ఇండియన్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్
చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్దమవుతోంది.
తొమ్మిదేళ్లుగా వరల్డ్ బ్యాడ్మింటన్ టైటిల్ కోసం నిరీక్షిస్తున్న హైదరాబాదీ ఏస్ షట్లర్ ఫైనల్స్‌లో ప్రవేశించి..ఏకంగా 'గోల్డ్'పై గురిపెట్టింది. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో ఫైనల్స్‌కు చేరిన తొలి భారత షట్లర్‌గా రికార్డు సృష్టించిన సైనా నెహ్వాల్.. నేడు జరిగే టైటిల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ కరోలినా మారిన్‌తో తలపడనుంది.
జకర్తా : భారత బ్యాడ్మింటన్ దిగ్గజ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో చరిత్ర సృష్టించింది. ఇండోనేషియా భామ లిండవేని ఫనెత్రితో శనివారం జరిగిన సెమీఫైనల్స్‌లో పోరులో 21-17, 21-17తో ఏకపక్ష విజయం సాధించిన హైదరాబాదీ అమ్మాయి ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో ఓ భారత షట్లర్ ఫైనల్స్‌కు చేరుకోవటం ఇదే ప్రథమం. వరల్డ్ టైటిల్ కోసం తొమ్మిదేళ్లుగా విఫలయత్నం చేసిన సైనా చివరికి ఏకంగా స్వర్ణ పతకంపైనే కన్నేసింది. కనీసం రజతం ఖాయం చేసుకున్న సైనా నెహ్వాల్ ఆదివారం నాటి పోరులో స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే గోల్డ్ మెడల్ కొట్టడం లాంఛనమే.
లోకల్ షట్లర్‌తో జరిగిన సెమీస్ పోరులో సైనా నెహ్వాల్ అద్బుత విజయంతో ఆకట్టుకుంది. స్థాయికి తగిన ప్రదర్శన చేయకపోయినా ఇండోనేషియా షట్లర్ లిండవేని ఫనెత్రిపై వరస సెట్లలో గెలుపొందింది. 55 నిమిషాల పాటు సాగిన సెమీస్ పోరులో సైనా లోకల్ షట్లర్‌ను కుమ్మేసింది. వరసగా 21-17, 21-17తో విజయకేతనం ఎగురవేసింది. ఐతే సైనాకు ఫైనల్స్‌లో ప్రవేశం మరీ సులభంగా ఏమీ లభించలేదు. లిండవేని ఫనెత్రి రెండు సెట్లలోనూ గట్టిగానే ప్రతిఘటించింది. తొలి సెట్లో ఆరంభంలో ఆధిపత్యం ఫనెత్రిదే. 3-1, 6-3, 9-7తో ఆరంభ ఆధిక్యాన్ని ఎంజారు చేసిన ఫనెత్రి వరల్డ్ నెం.2కు సవాల్ విసిరింది. కానీ సైనా నెహ్వాల్ ఒత్తిడికి గురికాకుండా తొలి సెట్ హాఫ్ టైమ్‌కు 11-10తో ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. ఇక సెకండ్ హాఫ్‌లో మొత్తం సైనా హవానే సాగింది. 13-11, 15-13తో సైనా విజయం వైపు దూసుకెళ్లింది. ఫనెత్రి 16-16తో స్కోరు సమం చేసి మళ్లీ సైనాకు సవాల్ విసిరింది. ఇక్కడే చాంపియన్ గేమ్ ఆడింది. ఫనెత్రిని 17 వద్దనే ఉంచి వరసగా నాలుగు పాయింట్లు సాధించిన సైనా తొలి సెట్లో నెగ్గి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక రెండో సెట్లోనూ స్థానిక ప్రేక్షకుల మద్దతుతో ఫనెత్రి అడపా దడపా కవ్వించినా సైనాపై ఎక్కడా ఆధిపత్యం చెలాయించలేకపోయింది. రెండో సెట్ ఆరంభం కూడా నువ్వా నేనా అన్నట్లు స్కోర్లు సమం అవుతూ సాగింది. కానీ విరామ సమయానికి 11-10తో సైనా ఆధిక్యం సాధించింది. సెకండ్ హాఫ్‌లో 14-11, 14-14, 17-14, 18-17తో సైనా దూసుకెళ్లింది. ఫనెత్రి మధ్యలో వరసగా మూడు పాయింట్లు సాధించి స్కోరు సమం చేసినా సైనాను వెనక్కి నెట్టలేకపోయింది. తొలి సెట్ మాదిరిగానే ఫనెత్రిని 17 స్కోరు వద్దనే ఉంచి సైనా రెండో సెట్‌నూ, మ్యాచ్‌ను ముగించేసింది. సెమీస్ విజయానంతరం సంబరాలు చేసుకోని సైనా..అభిమానుల వైపు చూస్తు చిరునవ్వులు చిందుస్తూ ఛీర్ చేసింది.
కరోలినాతో కష్టమే? : ఈఏడాది వరస విజయాలతో దూసుకెళ్తోన్న సైనా నెహ్వాల్ ప్రతిష్టాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ టైటిల్ పోరులో కఠిన పరీక్ష ఎదురుకానుంది. డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్ సుందరీ కరోలినా మారిన్ నేటి ఫైనల్స్‌లో సైనా నెహ్వాల్‌ను ఢకొీట్టనుంది. కరోలినా మారిన్‌తో ముఖాముఖి పోరులో సైనా నెహ్వాల్దే పైచేయి అయినా స్పెయిన్ షట్లర్ భీకర ఫామ్‌లో ఉంది. అదీగాక ఇటీవలి ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో సైనాపై విజయం సాధించి మానసకంగా పైచేయి సాధించింది. అంతకముందు ఇండోనేషియా ఓపెన్ (2013), ఆస్ట్రేలియా ఓపెన్ (2014), సయ్యద్ మోడి ఇండియన్ ఓపెన్ (2015)లలో మారిన్‌పై సైనా విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది. కానీ గత మార్చిలో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాదీ షట్లర్‌పై నెగ్గి సైనా సవాల్‌కు చెక్ పెట్టింది. క్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్ మాజీ నెం.1ను మట్టికరిపించినా..సెమీస్‌లో అత్యుత్తమంగా ఆడలేదు. అన్సీడెన్ ఫనెత్రిపై సైనా సహజం కంటే ఎక్కువగా అనవసర తప్పిదాలు చేసింది. మారిన్ వంటి చాంపియన్‌కు అలాంటి అవకాశం ఇస్తే కోలుకునే అవకాశం ప్రత్యర్థికి ఇవ్వరు. ఈ విషయం సైనాకు బాగా తెలుసు. అద్బుత ఆటతీరుతో ఫైనల్స్‌కు చేరిన సైనా..తుది పోరులో పట్టువిడవకుండా పోరాడితినే గోల్డ్ భాగ్యం దక్కేది.