Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురు అనుభవజ్ఞుల అండ
- ఆశ్చర్యకర విజయాలపై కన్ను
పసికూన.. బంగ్లాదేశ్ గురించి ప్రస్తావన అనగానే ఈ పదం ముందు ఉండాల్సిందే. కానీ పరిస్థితులు మారిపోయాయి. ఇంకెంత మాత్రం పసికూనను కాదని బంగ్లాదేశ్ నిరూపించుకున్నది. అగ్రజట్లతో దీటుగా తలపడి, విజయాలు సాధించగల స్థాయికి ఎదిగింది. 2015లో తొలిసారి ప్రపంచకప్ క్వార్టర్ఫైనల్లోకి చేరి కొత్త అధ్యాయానికి తెరతీసిన బంగ్లాదేశ్.. 2019లో మరింత ముందుకెళ్లటంపై దృష్టి సారించింది. అందుకు బంగ్లాదేశ్ ముందుగా జయించాల్సింది నియంత్రణ లేని భావోద్వేగాలే.
నవతెలంగాణ క్రీడా విభాగం
ప్రపంచ క్రికెట్లో అనిశ్చితి అనగానే పాకిస్థాన్ గుర్తొచ్చినట్టే.. సంచలనం అనగానే బంగ్లాదేశ్ ముందు వరుసలో ఉంటుంది. 1999లో తొలిసారి ప్రపంచకప్ ఆడిన బంగ్లాదేశ్, సంచలనం కోసం ఎంతో సమయం ఎదురుచూడలేదు. మాజీ సహచర దేశం పాకిస్థాన్‌పై అదిరే విజయం సాధించింది. 2007లో బంగ్లాదేశ్ సంచలన విజయాల బాధిత జట్ల సంఖ్య పెరిగింది. అగ్ర జట్లు భారత్, దక్షిణాఫ్రికాలపై బంగ్లా పంజా విసిరింది. చివరగా, 2015లో ఇంగ్లాండ్‌పై అద్భుత విజయంతో క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇంగ్లీష్ జట్టు గ్రూప్ దశ నుంచే నిష్క్రమించేలా చేసింది. ఈ నాలుగేండ్లలో బంగ్లాదేశ్ ప్రయాణం భిన్నంగా సాగింది. ఒకట్రెండు సంచలనాలతో సరిపెట్టుకోలేదు. మూడు ఫార్మాట్లలో నిలకడ సాధించే దిశగా పయనించింది. ఆ నిలకడ ప్రపంచకప్‌లోనూ చూపించాలని బంగ్లాదేశ్ భావిస్తోంది.
అనుభవమే బలం : ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ అతి పెద్ద సానుకూలత అనుభవం. ఐదుగురు అనుభవజ్ఞులైన క్రికెటర్లతో బంగ్లాదేశ్ బ్రిటన్ బయల్దేరుతుంది. మష్రఫె మొర్తాజా, ముష్ఫీకర్ రహీమ్, షకిబ్ అల్ హసన్, తమీమ్ ఇక్బాల్, మహ్మదుల్లా బంగ్లాదేశ్‌కు కీలకం. 2016, 2018 ఆసియా కప్ ఫైనల్స్ సహా నిదహాస్ ట్రోఫీ ఫైనల్లోనూ బంగ్లాదేశ్ తృటిలో టైటిళ్లు చేజార్చుకున్నది. తాజాగా ఐర్లాండ్, వెస్టిండీస్‌తో ముక్కోణపు వన్డే సిరీస్ విజయంతో విలువైన ఆత్మ విశ్వాసం సంపాదించింది. మూడు దేశాలు పోటీపడిన టోర్నీలో విజేతగా నిలువటం బంగ్లాదేశ్‌కు ఇదే తొలిసారి. ఇంగ్లాండ్‌లో బంగ్లాదేశీయులు భారీ సంఖ్యలో ఉన్నారు. బంగ్లా మ్యాచులకు ఆ దేశ అభిమానులు భారీ స్థాయిలోనే హాజరయ్యే అవకాశం ఉంది. అభిమానుల అండ సైతం బంగ్లాకు ప్లస్ పాయింట్!.
ముగించే లోపం : కొన్నేండ్లుగా నిలకడ కోసం నిరంతర ప్రయత్నం చేస్తున్న బంగ్లాదేశ్‌కు నిలకడగా రాణించే బ్యాట్స్‌మన్ లభించారు. కానీ కీలక సమయాల్లో, ప్రత్యేకించి ముగింపులో భారీ షాట్లు బాదటంలో వైఫల్యం సుస్పష్టం. చివరి ఓవర్లలో బౌండరీలు బాదటంలో బలహీనత.. భారీ స్కోరు మ్యాచుల్లో ప్రభావం చూపనుంది. బౌలింగ్ విభాగంలో బంగ్లాకు వైవిధ్యత లోపించింది. రుబెల్ హుస్సేన్ నిలకడగా రాణించటం లేదు. ముస్తాఫిజుర్ రెహమాన్ నమ్మదగిన పేసర్ కాదు!. దీంతో కెప్టెన్ మెష్రఫె మొర్తాజా అటు బంతితో, ఇటు కెప్టెన్సీ వ్యూహంతో బంగ్లాదేశ్‌కు కీలకం కానున్నాడు.
అవకాశం ఎంత? : ముగింపులో ఒత్తిడికి గురయ్యే స్వభావం బంగ్లాదేశ్‌ది. 2016 వరల్డ్ టీ20లో భారత్‌తో మ్యాచ్‌లో నియంత్రణ లేని భావోద్వేగాలు, ముగించ టంలో నైపుణ్య లేమి బంగ్లాదేశ్‌ను ఓటమి కోరల్లోకి తీసుకెళ్లాయి. చాలా సందర్బాల్లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు భావోద్వేగాలు నియంత్రణలో ఉంచుకోలేదు. కెప్టెన్ మొర్తాజా సైతం అందులో భాగమయ్యాడు. విజయావకాశాలు ఉన్న మ్యాచులు ముగించటలో భావోద్వేగాలు అదుపులో పెట్టుకోవటం ముఖ్యం. వెస్టిండీస్‌పై ముక్కోణపు టోర్నీ ఫైనల్లో 27 బంతుల్లో 52 పరుగులు బాదిన మొసద్దిక్ హుస్సేన్ ప్రపంచకప్‌లో బంగ్లాకు ఎక్స్ ఫ్యాక్టర్ కాగలడు. మరో యువ క్రికెటర్ అబు జయద్ మిస్టరీ అస్త్రంగా ఉపయోగపడగలడు. ప్రపంచకప్ ఆరంభానికి ముందు పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచే జట్లలో బంగ్లాదేశ్ రేసులో లేదు. కానీ సంచలన విజయాలకు నిలకడ తోడైతే.. తొలిసారి సెమీఫైనల్లోకి అడుగుపెట్టడం సులువే.
గత ప్రదర్శన : 2015 క్వార్టర్‌ఫైనల్స్
ప్రపంచకప్ జట్టు : మష్రఫె మొర్తాజా (కెప్టెన్), అబు జాయద్, లిటన్ దాస్, మమ్మదుల్లా, మెహదీ హసన్, మహ్మద్ మిథున్, మహ్మద్ సైఫుద్దీన్, మొసద్దీక్ హౌస్సేన్, ముష్ఫీకర్ రహీమ్, ముస్తాఫిజుర్ రెహమాన్, రూబెల్ హుస్సేన్, షబ్బీర్ రెహమాన్, షకిబ్ అల్ హసన్, సౌమ్య సర్కార్, తమీమ్ ఇక్బాల్.